
- పాక్ ఇంటెలిజెన్స్ అధికారికి ల్యాప్‌టాప్ కూడా ఇచ్చిండు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జస్బీర్ సింగ్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. పాక్ లో అతను ఆరుసార్లు పర్యటించాడు. అతని ఫోన్ లో 150 పాకిస్తాన్ కాంటాక్టులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పాక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ షకీర్ అలియాస్ జాట్ రంధావాతో పాటు ఆ దేశ ఆర్మీ అధికారులతోనూ సంబంధాలు పెట్టుకున్నాడు. పాక్ మాజీ పోలీసు అధికారి నాసిర్ ధిల్లాన్.. జస్బీర్ ను పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారులకు పరిచయం చేశాడు. 2020, 2021, 2024లో పాక్ లో జస్బీర్ పర్యటించాడు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ షకీర్ కు తన ల్యాప్ టాప్ ను సైతం ఇచ్చాడు.
దేశానికి సంబంధించిన కీలక సమాచారం ఉన్న ఆ ల్యాప్ టాప్ ను షకీర్ గంటసేపు వాడుకున్నాడు. ఆ టైంలో సున్నితమైన ఇన్ఫర్మేషన్ ను ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. అలాగే ఐఎస్ఐ ఆపరేటివ్ డానిష్ అలియాస్ ఎషనుర్ రెహమాన్తోనూ టచ్‌లో ఉన్నాడు. గూఢచర్యం కేసులో ఇదివరకే అరెస్టయిన జ్యోతి మల్హోత్రాలాగే జస్బీర్ కూడా డానిష్‌తో సంప్రదింపులు జరిపాడు. జస్బీర్‌ను ఓ మహిళ డానిష్‌కు పరిచయం చేసింది. తనకు కొన్ని సిమ్ కార్డులు ఇవ్వాలని జస్బీర్‌ను డానిష్ అడిగాడు. డానిష్‌తో కాంటాక్టులో ఉంటూ జస్బీర్.. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను పంపాడు. కాగా.. డానిష్ ఇంతకుముందు భారత హైకమిషన్‌లో పాక్ దౌత్య అధికారిగా పనిచేశాడు. జ్యోతి మల్హోత్రా గూఢచర్యం వ్యవహారంలో అతని పేరు బయటకు రావడంతో అధికారులు డానిష్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసి పాకిస్తాన్‌కు పంపారు. ఇక గూఢచర్యం కేసులో జస్బీర్‌ను పోలీసులు ఈ నెల 4న అరెస్టు చేశారు. శనివారం పంజాబ్‌లోని మొహాలి కోర్టులో అతనిని ప్రవేశపెట్టగా నిందితుడికి కోర్టు మరో రెండు రోజులు రిమాండ్‌ను పొడిగించింది.