మృత్యు లోయ.. రీల్ కాదు.. రియల్ 'విరూపాక్ష'.. ఇక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నయ్

మృత్యు లోయ.. రీల్ కాదు.. రియల్ 'విరూపాక్ష'.. ఇక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నయ్

భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం అనగానే ఎక్కువగా గుర్తుకువచ్చేది సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వం, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన లోయలు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఈశాన్య భారతం. కానీ కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో చాలా రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో అస్సాంలోని జటింగా ఒకటి. ఈ ప్రదేశాన్ని "మృత్యు లోయ" అని పిలుస్తారు. ఆసక్తిని రేకెత్తించే ఈ గ్రామంలో దాగిన ఆ మిస్టీరియస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్య కాలంలో వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష' మూవీ చూసే ఉంటారు కదా. ఈ మూవీలో పక్షులు చనిపోయినట్టే..  ఓ చిన్న గ్రామంలోనూ పక్షులు చనిపోతున్నాయి. చనిపోవడం అంటే వాటిది మామూలు మరణం కాదు.. అవి ఆత్మహత్య చేసుకుంటున్నాయట. ఆ గ్రామం మరెక్కడో కాదు.. మన ఇండియాలోనే ఉంది. అదే అస్సాంలోని జటింగా.

జటింగా అనే గ్రామంలో ఒకటి కాదు, రెండు కాదు గుంపులు గుంపులుగా చేరి పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయట. అంతే కాదు ఈ సంఘటనలు ఎక్కువగా అమావాస్య రోజునే జరుగుతున్నాయట. దుష్టశక్తులు గ్రామంలోకి ప్రవేశించడం వల్లే ఇలా అవుతోందని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ గ్రామస్థులు దీన్నొక అపశకునంగా భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు వెదురు కర్రల కంచెలు పెట్టుకుంటున్నారట.

పరిశోధకులు ఏమంటున్నారంటే..

ఎక్కువగా రాత్రి సమయంలోనే పక్షులు చనిపోతుండడంపై స్పందించిన పరిశోధకులు.. దానిక్కారణాన్నీ వెల్లడించారు. వీధి దీపాలకు అట్రాక్ట్ అవుతున్నాయని, అలా వెళ్లే క్రమంలో స్తంభాలను, చెట్లను ఢీకొని చనిపోతున్నాయని వాదిస్తున్నారు. మరి వేరే గ్రామాల్లోనూ ఇలాగే ఎందుకు జరగడం లేదన్న ప్రశ్నకు మాత్రం వారు సమాధానం చెప్పలేకపోతున్నారు.

మృత్యు లోయ (వ్యాలీ ఆఫ్ డెత్) లేదా పక్షులు ఆత్మహత్య చేసుకునే ప్రదేశంగా పేరు తెచ్చుకున్న ఈ గ్రామం అస్సాంలోని గౌహతికి దక్షిణాన 330 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పక్షుల ఆత్మహత్యలు ఎక్కువగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెల నుంచి నవంబర్ వరకు నమోదవుతాయి. స్థానిక పక్షులే కాదు, వలస పక్షులు సైతం ఈ ప్రాంతానికి వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని ఇక్కడి గ్రామస్థులు చెబుతున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, పక్షులు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆత్మహత్య చేసుకుంటున్నాయట. అయితే సాధారణ వాతావరణంలో ఈ పక్షులు పగటిపూట బయటకు వెళ్లి రాత్రికి తిరిగి తమ గూడుకు చేరుకుంటాయి. ఈ ఆత్మహత్య రేసులో దాదాపు 40 రకాల స్థానిక & వలస పక్షులు పాల్గొంటున్నాయి. కింగ్‌ఫిషర్స్, టైగర్ బిటర్న్, బ్లాక్ బిటర్న్, పాండ్ హెరాన్, ఇండియన్ పిట్టా, లిటిల్ ఎగ్రెట్, గ్రీన్ పావురం, బ్లాక్ డ్రోంగో, ఎమరాల్డ్ పావురం లాంటి అనేక రకాల పక్షులు ఈ గ్రామానికి వెళ్లి చనిపోతున్నాయి.