రాష్ట్రాన్ని కబళిస్తున్న విషజ్వరాలు

రాష్ట్రాన్ని కబళిస్తున్న విషజ్వరాలు

సుల్తానాబాద్, వెలుగు : విష జ్వరాలతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టలో సోమవారం రాత్రి ఇద్దరు చనిపోయారు. గ్రామానికి చెందిన ఎర్ర శ్రీనివాస్(34) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా చూపించుకుని మందులు వాడాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఒక దవాఖానాకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. 

ఇదే గ్రామానికి చెందిన ఇరుగురాళ్ల రాజేందర్ (34) గోదావరిఖనిలో ఉంటున్నాడు. ఇతడికి కూడా తీవ్ర జ్వరం రాగా గోదావరిఖనిలోని ఏరియా దవాఖానాలో చేరి వారం రోజులుగా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నాడు. జాండీస్ ​కూడా రావడంతో కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రాజేందర్ కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా, వీరిద్దరూ డెంగ్యూతో మరణించారని గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఇంకా ఈ గ్రామంలో పలువురు జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఇద్దరి మరణాలపై ఎలిగేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆఫీసర్ ను వివరణ కోరగా, డెంగ్యూతో మరణించినట్టు ఎలాంటి రిపోర్టులు లేవన్నారు. గ్రామంలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  

డెంగ్యూతో చనిపోయిన మహిళ.. 

మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంటకు చెందిన పోత స్వాతి(26) డెంగ్యూతో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. కాటారం మండలంలోని శంకరంపల్లిలో ఉండే వివాహిత స్వాతికి వారం కింద డెంగ్యూ వచ్చింది. దీంతో ఆమెను ఐదు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటుండగా పరిస్థితి విషమించి సోమవారం అర్ధరాత్రి మరణించింది. మృతురాలికి భర్త, కొడుకు ఉన్నారు.