జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోక్రియాల్ ఎన్టీఏకు సూచించారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన సంస్థ.. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 27,28,30 తేదీల్లో నిర్వహించాల్సిన మూడో విడత జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌ను వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కనీసం ఎగ్జామ్స్ నిర్వహించే 15 రోజుల ముందే ఈ విషయం స్పష్టం చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఫిబ్రవరి,మార్చిలో రెండు సెషన్లలో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో 6,20,978 మంది పరీక్ష రాయగా.. మార్చిలో 5,56,248 మంది హాజరయ్యారు.
