అంతా సైలెంట్ ఓటింగ్ జరిగింది.. అందుకే కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్: జీవన్ రెడ్డి

అంతా సైలెంట్ ఓటింగ్ జరిగింది.. అందుకే కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్: జీవన్ రెడ్డి

ఓటింగ్ తర్వాత వచ్చిన సర్వేలను బట్టి చూస్తే కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫలితాల తర్వాత ఓడిపోతే మరుసటి రోజు కేబినెట్ సమావేశమై మూకుమ్మడి రాజీనామాలు చేసి గవర్నర్ కు అందజేయడం ఆనవాయితీగా వస్తుందని.. అందుకే, కేసీఆర్ ఫలితాల తర్వాతి రోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారనన్నారు.

ఆయనకు గెలుపుపై విశ్వాసం ఉంటే 4న సమావేశం ఏర్పాటు చేసుకోవడం అవసరం లేదని అన్నారు. డిసెంబర్ 2వ తేదీ శనివారం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  కేసీఆర్ నియంతృత్వ ధోరణి ప్రజా వ్యతిరేకతకు కారణమని తాము భావిస్తున్నట్లుగా తెలిపారు. 

 ఉద్యమ ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో ఏ ఒక్కటి నెరవేరలేదని.. కాబట్టి, ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు.  ఆ మార్పులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లకు డబ్బులు ఇచ్చాము కాబట్టి ఫలితాలు అనుకూలంగా వస్తాయని కొంతమంది అనుకుంటున్నారని... కానీ ప్రజాస్వామ్యంలో ఓటరు అత్యంత తెలివైన విజ్ఞత కలిగిన వాళ్లని అయన అన్నారు.  నవంబర్ 30న జరిగిందంతా సైలెంట్ ఓట్ అని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఓడిపోతే.. ముమ్మాటికి కేసీఆర్ ఫెయిల్యూర్ గానే చూస్తామని,  ఆ పార్టీ ఎమ్మెల్యేల ఓటమిగా తాము భావించమని జీవన్ రెడ్డి అన్నారు.