కాళేశ్వరం గుదిబండే..కాగ్​ చెప్పింది అక్షర సత్యం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాళేశ్వరం గుదిబండే..కాగ్​ చెప్పింది అక్షర సత్యం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • నిర్మాణ ఖర్చు కంటే అవినీతే ఎక్కువ జరిగింది
  • ఏటా సర్కారుపై రూ.24 వేల కోట్ల భారం
  • తుమ్మిడిహెట్టి దగ్గర కడితే ఇలా అయ్యేది కాదు
  • ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాన్ని మోయడం కష్టమని కామెంట్​

కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులపై కాగ్ రిపోర్టు ఆందోళన కలిగిస్తున్నదని, రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇది గుదిబండగా మారుతుందని కాంగ్రెస్  నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కరీంనగర్​లో  మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అప్పులకు రీపేమెంట్ రూ.13 వేల కోట్లు, మోటార్లకు రూ.11 వేల కోట్ల కరెంట్ బిల్లులు కలిపి ఏటా రూ.24 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 

తుమ్మిడిహెట్టి వద్ద రూ.38 వేల కోట్లతో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేసీఆర్​ రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి అంచనాలను రూ.లక్షా 50 వేల కోట్లకు తీసుకెళ్లారని ఫైర్​ అయ్యారు. ఇందులో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కంటే అక్రమ సంపాదనకే ఎక్కువ నిధులు వెళ్లాయని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయి నాలుగేండ్లయిందని, ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పాలని జీవన్​రెడ్డి ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్​కు మాత్రమే కాళేశ్వరం ఉపయోగపడిందన్నారు. ఈ కరువు కాలంలో నీళ్లు ఎత్తిపోద్దామంటే మేడిగడ్డ వద్ద గుక్కెడు నీళ్లు లేవన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్లు నీటి నిల్వకే ఉపయోగపడుతున్నాయి తప్ప, సాగుకు పనికిరావడం లేదన్నారు. 

వీటికి అనుబంధంగా ఫీడర్ చానళ్లు, కాల్వల నిర్మాణం  ఇంకా ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కాగ్ నివేదిక అక్షర సత్యమని, ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను పరిశీలించాకే నివేదిక ఇస్తుందని చెప్పారు. ఆ నివేదికను శాసన సభలో ప్రవేశపెట్టే ఆనవాయితీ ఉన్నా.. ప్రభుత్వం ఆ పని చేయడం లేదన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్న కేంద్రం.. కేసీఆర్​ సర్కారుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా  ప్రాజెక్టు నిర్మించడం వల్లే కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.  జాతీయ హోదాపై కేంద్రం, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తుందని స్పష్టం చేశారు.