జెట్ ఎయిర్వేస్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

జెట్ ఎయిర్వేస్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • త్వరలోనే సర్వీసులు పున: ప్రారంభం

జెట్ ఎయిర్వేస్కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. దాదాపు మూడేళ్ల తర్వాత నింగిలోకి ఎగిరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దాదాపు మూడేళ్ల పాటు ఎ‌యిర్‌పోర్టులకే పరిమితమైన జెట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్లు త్వరలోనే విమాన సర్వీసులు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి.  జెట్‌ ఎయిర్‌వేస్ కమర్షియల్ విమాన సర్వీసుల పున: ప్రారంభానికి పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతులు ఇచ్చింది. డీజీసీఏ ప్రమాణాలను పాటిస్తూ సన్నాహక విమానాలు నడిపిన అనంతరం ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్) లైసెన్స్ మంజూరు చేసింది. ఈ లైసెన్స్ పొందాలంటే మొత్తం 5 ల్యాండింగ్ ఫ్లైట్స్ నడపాల్సి ఉంటుంది. విమానాల్లో డీజీసీఏ అధికారులు ప్రత్యక్షంగా ప్రయాణించి పరిశీలిస్తారు. ఈ క్రమంలో జలాన్ - కల్రాక్ కన్సార్టియం సారథ్యంలోని జెట్ ఎయిర్‌వేస్ మే 15, 17 తేదీల్లో 5 విమానాలను నడిపింది. ఈ సర్వీసులపై సంతృప్తి వ్యక్తం చేసిన డీజీసీఏ అధికారులు ఏఓసీ లైసెన్స్ జారీ చేయడంతో మళ్లీ విమానాలు నడిపేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఏడాది జులై, సెప్టెంబర్ క్వార్టర్లో జెట్‌ ఎయిర్‌వేస్ కమర్షియల్ ఫ్లైట్స్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.

ఎయిర్‌ లైన్స్ నిర్వహణకు అవసరమైన నగదును సమకూర్చడంలో ప్రమోటర్ నరేష్ గోయల్ విఫలం కావడంతో 2019లో జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఏప్రిల్ 17, 2019లో చివరి సర్వీసు నడిచింది. జూన్ 2019లో దివాళా ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం జలాన్- కల్రాక్ కన్సార్టియం ప్రమోటర్‌గా జెట్‌ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు పునరుద్ధరణ కానున్నాయి. అక్టోబర్ 2020లో యూకేకి చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ కేంద్రంగా పని చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ కన్సార్టియం దాఖలు చేసిన రిసొల్యూషన్ ప్లాన్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్.. సీవోసీ అంగీకారం తెలిపింది. జెట్ ఎయిర్ వేస్ కు హోం శాఖ ఇప్పటికే సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చింది. 

మరిన్ని వార్తల కోసం..

ఐపీఎల్ లో టాప్ 5 అత్యధిక స్కోర్లు చేసిన ..

నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ..