
జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీలో ఉన్న లక్ష్మీదేవి గుడిలో బుదవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. స్థానికులు, ఆలయ కమిటీ మెంబర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిలో రోజూ శుభ్రం చేసే మహిళ గురువారం ఉదయం వెళ్లగా తాళాలు పగులగొట్టి ఉండడంతో ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చింది.
వారు పోలీసులకు తెలియజేశారు. శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ ఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌తో చేరుకొని వివరాలు సేకరించారు. సుమారు రూ.8 లక్షల విలువ చేసే అమ్మవారి బంగారు పుస్తెలు, ముక్కు పుడక,శఠగోపం, కిరీటం, హారంతో పాటు హుండీలోని దాదాపు రూ.33 వేల నగదు చోరీకి గురైనట్లు కమిటీ సభ్యుడు అన్నవేన సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.