మహానుభావులు : విడాకులు ఇచ్చిన కూతురు.. పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చిన పేరంట్స్

మహానుభావులు : విడాకులు ఇచ్చిన కూతురు.. పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చిన పేరంట్స్

అమ్మాయికి విడాకులంటే  పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తారు చాలా మంది తల్లిదండ్రులు. పెళ్లైన కొత్తలో ...దంపతుల మధ్య చిన్నాచితక గొడవలు, ఇద్దరి మధ్య  భేదాభిప్రాయాలు, అత్తింటి వారి చిత్రహింసలతో  నరకం అనుభవిస్తూ ఇప్పటికీ ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. సర్దుకుపోయి సంసారం చేసే వారు కొందరైతే.. మధ్యతరగతి జీవితాల వల్ల.. అమ్మానాన్నాలకు బరువు కాలేక కొట్టినా తిట్టినా అడ్జస్ట్ అయ్యే వారు మరికొందరున్నారు.

 చాలా మంది తల్లిదండ్రులు కూతుళ్లను బుజ్జగించి విడాకులు తీసుకోకుండా సర్దుకుపోవాలని సర్దిచెబుతుంటారు. విడాకులు తీసుకున్న కూతురు తమ దగ్గర ఉంటే సమాజంలో తమ పరువు పోతుందని భయపడుతుంటారు.   కానీ అత్తింట్లో చిత్రహింసలు పడుతున్న ఓ కూతురికి విడాకులు ఇప్పించి తన ఇంటికి బ్యాండ్ బాజాలతో ఊరేగింపుతో గ్రాండ్ గా తీసుకొచ్చాడు ఓ తండ్రి.  కూతరంటే భారం కాదు..బాధ్యత అని..కష్టాల్లో ఉన్న కూతురి జీవితమే ముఖ్యమని చెబుతున్నాడు. ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడూ అండగా ఉండాలని..కూతుళ్లు విలువైన వాళ్లని  చెబుతున్నాడు. 

జార్ఖండ్ లోని రాంచీలో కైలాస్ నగర్లోని కుమ్ హర్తోలి ఉండే ప్రేమ్ గుప్తా.. తన కుమార్తె సాక్షి గుప్తాకు ఏప్రిల్ 28, 2022న  సచిన్ కుమార్ అనే యువకుడికి ఇచ్చి ఎంతో వైభవంగా పెళ్లి చేశాడు. అయితే  అతను జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.  రాంచీలోని సర్వేశ్వరి నగర్ లో ఉంటున్నారు. 

అయితే కొన్ని రోజుల నుంచి  తన కూతురిని అత్తమామలు వేధించడం స్టార్ట్ చేశారు.  అపుడపుడు తన కూతురిని కొట్టి ఇంటి నుంచి భయటకు పంపించారని ప్రేమ్ గుప్తా తెలిపాడు.  సచిన్ కు అంతకుముందే మరో పెళ్లి అయిందని ఆ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందన్నాడు. అయినా  అతనితో జీవితం కొనసాగించాలనుకున్నామని.. అయితే రోజురోజుకు అతని వేధింపులు.. చిత్రహింసలు ఎక్కువయ్యాయని చెప్పాడు. దీంతో  తన కూతురి విడాకులు తీసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. తన కూతురి నిర్ణయాన్ని  వారు కూడా అంగీకరించారు. 

తన కూతురిని అత్తవారి ఇంటి నుంచి   తీసుకురావాలని డిసైడ్ అయ్యారు తండ్రి ప్రేమ్ గుప్తా. అయితే పెళ్లికి ఏవిధంగా అయితే  బ్యాండ్ బాజాలతో ఊరేగిస్తారో.. తన కూతురిని పుట్టింటికి తీసుకుని  వచ్చేందుకు ప్రేమ్ గుప్తా బ్యాండ్ బాజాలు, ఆటపాటలతో, టాపాసులు కాలుస్తూ  పుట్టింటికి స్వాగతం పలికాడు.

 కూతుళ్లు చాలా ముఖ్యమైన వారని వారికి ఎటువంటి ఆపద వచ్చినా అండగా ఉండాలని కోరాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కూతురిపై ప్రేమ్ గుప్తాకు ఉన్న ప్రేమను కొందరు ప్రశంసిస్తున్నారు. మరికొందరు భిన్నరకాలుగా కామెంట్ చేస్తున్నారు.