
న్యూఢిల్లీ: జేకే లక్ష్మీ సిమెంట్ లిమిటెడ్ నికరలాభం (కన్సాలిడేటెడ్) 2025–-26 ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ఏడాది లెక్కన రెండు రెట్లు పెరిగి రూ.149.88 కోట్లుగా నమోదైంది. గత ఏడాది జూన్ క్వార్టర్లో రూ.56.68 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం 11.8 శాతం పెరిగి రూ.1,763.14 కోట్లకు చేరుకుంది.
గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,576.96 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అమ్మకాల పరిమాణం 3,326 లక్షల టన్నులుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 10 శాతం ఎక్కువ. జేకే లక్ష్మీ సిమెంట్ మొత్తం ఖర్చులు రూ.1,559.26 కోట్లు కాగా, గత సంవత్సరంతో పోలిస్తే 6.68 శాతం ఎక్కువ.
కంపెనీ కాంపోజిట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. ఈ పథకం జులై 31, 2025 నుంచి అమలులోకి వచ్చింది. జేకే లక్ష్మీ సిమెంట్‌కు సంవత్సరానికి దాదాపు 16.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది.