
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర నిలిపేస్తున్నట్లు చేసిన ప్రకటనను జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కొద్దిసేపటికే వెనక్కి తీసుకుంది. హిమాలయ శిఖరాల్లో ఉండే మంచు లింగం దర్శనం కోసం ప్రతి ఏటా జూన్ 23 నుంచి ఆగస్టు 3 మధ్య జరిగే అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది నిలిపేస్తున్నట్లు జమ్ము కశ్మీర్ రాజ్ భవన్ నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే కొద్దిసేపటికే ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది జమ్ము కశ్మీర్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అమర్నాథ్ యాత్రకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నందున రానున్న రోజుల్లో పరిస్థితులపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు రాజ్ భవన్ పీఆర్వో.
హిమాలయాల్లో 12,756 అడుగుల ఎత్తున ఉండే అమర్నాథుడి మంచు లింగం దర్శనం కోసం ఏటా లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. ప్రతి సంవత్సరం జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకు మంచు కొండల్లో సాగే ఆధ్యాత్మిక సాహస యాత్ర ఇది. కొంత దూరం చైనా టెరిటరీలోనూ ఈ యాత్ర సాగుతుంది. అమర్నాథ్ యాత్రలో మన ఆర్మీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు యాత్రికులపై దాడులు చేయకుండా రక్షణగా నిలుస్తుంది.