యూజీసీ ఛైర్మన్గా జెఎన్యూ వీసీ జగదీశ్ కుమార్ 

యూజీసీ ఛైర్మన్గా జెఎన్యూ వీసీ జగదీశ్ కుమార్ 

ఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యూజీసీ కొత్త ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తి నియమితులయ్యారు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ఉన్న ఎం. జగదీశ్ కుమార్కు యూజీసీ బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెసర్ డీపీ సింగ్ రిటైర్ కావడంతో యూజీసీ ఛైర్మన్ పదవి గతేడాది డిసెంబర్ 7 నుంచి ఖాళీగా ఉంది. తాజాగా ఈ స్థానాన్ని జగదీశ్ కుమార్ తో భర్తీ చేశారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జగదీశ్ కుమార్ యూజీసీ ఛైర్మన్గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి కావడం విశేషం.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన జగదీశ్ కుమార్ మద్రాస్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్తో పాటు పీహెచ్డీ పూర్తి చేశారు. అనంతరం కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్ లూ నుంచి పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కంప్లీట్ చేశారు. 1994 -95లో ఐఐటీ ఖరగ్ పూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ విజిటింగ్ ఫ్యాకల్టీగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించారు. 1997లో ఢిల్లీ ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు అసోసియేట్ ప్రొఫెసర్గా వెళ్లారు. 2005లో ప్రొఫెసర్గా ప్రమోషన్ పొందిన జగదీశ్ కుమార్.. 2016లో జేఎన్యూ వీసీగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి జనవరి 26తోనే జగదీశ్ ఐదేళ్ల పదవీకాలం ముగిసినా తదుపరి వీసీని నియమించే వరకు ఆయనను ఆ పోస్టులో కొనసాగించాలని నిర్ణయించారు. 

యూజీసీ ఛైర్మన్ పదవికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల కాగా.. 55 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన కమిటీ వారిలో ఏడుగురిని ప్రాథమికంగా ఎంపిక చేసింది. వీరంతా ఈ నెల 3న ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. కమిటీ ముగ్గురి పేర్లను కేంద్రానికి పంపింది. అందులో జగదీశ్ కుమార్ను యూజీసీ ఛైర్మన్ గా ప్రభుత్వం ఎంపిక చేసింది. 

మరిన్ని వార్తల కోసం..

అసదుద్దీన్పై దాడిని ఖండించిన వైఎస్ షర్మిల

పాతబస్తీలో ఎంఐఎం బంద్