బిడెన్‌ను చైనా కొనేసింది.. ఆయన గెలిస్తే ఇండియాకు నష్టం: ట్రంప్ కొడుకు

బిడెన్‌ను చైనా కొనేసింది.. ఆయన గెలిస్తే ఇండియాకు నష్టం: ట్రంప్ కొడుకు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడంతో గెలుపోటములను డిసైడ్ చేసే శక్తి ఉన్న ఇండియన్ కమ్యూనిటీపై అభ్యర్థులు కన్నేశారు. అమెరికన్ ఇండియన్స్ ఓట్ల కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియా – చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా ప్రచారంలో వాడేసుకుంటున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ చైనాకు అమ్ముడుపోయాడని, ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే ఇండియాకు నష్టమని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ ఆరోపించారు. జో బిడెన్ అధ్యక్షుడైతే చైనా పట్ల సాఫ్ట్ కార్నర్‌తో పనిచేయడం ఖాయమని అన్నారు. ‘లిబరల్ ప్రవిలేజ్’ అన్న పేరుతో జో బిడెన్ ఫ్యామిలీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రచురించిన బుక్ సక్సెస్ ఈవెంట్‌ను న్యూయార్క్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా జూనియర్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్‌కు చైనా వల్ల ముప్పు ఉందని, ఈ విషయంపై ఇండియన్ అమెరికన్స్‌ తెలిసినంతగా ఎవరికీ అవగాహన ఉండదని అన్నారు. చైనా నుంచి జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్‌కు దాదాపు 11 వేల కోట్ల రూపాయల (1.5 బిలియన్ డాలర్లు) ఆర్థిక సాయం అందిందని ఆరోపించారు జూనియర్ ట్రంప్. ఈ సొమ్ము ఆయనేదో పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఇవ్వలేదని, బిడెన్‌ను కొనేసేందుకే ఇచ్చారని అన్నారు. దీని ద్వారా జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తమ దేశానికి అనుకూలంగా పని చేయించుకునేందుకు చైనా కుట్రలు చేస్తోందని చెప్పారు.

ది న్యూయార్క్ పోస్ట్ లాంటి వార్త సంస్థ ఇప్పటికే బిడెన్ చేస్తున్న ఈ అక్రమాలను బయటపెట్టిందని జూనియర్ ట్రంప్ అన్నారు.  చైనాకు అమ్ముడుబోతున్న జో బిడెన్ వల్ల భారత్‌కు చెప్పలేనంత నష్టం జరుగుతుందని అన్నారు. కేవలం చైనా ఒక్కటే కాదు, ఉక్రెయిన్, రష్యా లాంటి దేశాలు కూడా బిడెన్‌ను కొనేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్లను పొగడ్తల్లో ముంచెత్తారు జూనియర్ ట్రంప్. భారతీయులు కష్టపడి పని చేస్తారని, కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారని, ఎడ్యుకేషన్‌పై మంచిగా దృష్టి పెడతారని జూనియర్ ట్రంప్ అన్నారు. ఇండయన్ కమ్యూనిటీ తన మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారన్నారు. భారతీయులను తాను చాలా బాగా అర్థం చేసుకుంటానని చెప్పారు. తన తండ్రి డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు ప్రజల్లో వచ్చిన స్పందన తాను ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు.