అగోజిలో చేరడం అంత సులువు కాదు

అగోజిలో చేరడం అంత సులువు కాదు

దట్టమైన అడవిలో ఉందా ఊరు... 
సన్నగా మండుతున్న మంటకు ఆనుకుని కొంతమంది ఉన్నారక్కడ..  
వాళ్లందరి కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి.. కళ్లలో భయం భయం...
తెల్లారితే వాళ్ల బతుకులు బానిసలుగా మారిపోతాయి.. 
తప్పించుకుందామంటే చుట్టూ ఆయుధాలతో సైన్యం.. 
ఇంతలో ఎక్కడినుంచో  వచ్చిందొక సివంగుల దండు..  
ఆ సైన్యాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి, బందీలను విడిపించింది..
ఆ సివంగుల దండు పేరు ‘అగోజి’.

ఈ డిజిటల్​ యుగంలోనూ మిలటరీలో ఆడవాళ్లను చేర్చుకోవడానికి ఇష్టపడని దేశాలు చాలానే ఉన్నాయి. పదవులు, అధికారం విషయంలోనూ అంతే. అయితే, వందేండ్ల కిందటే ఆడవాళ్లకు అన్ని పదవుల్లోనూ వాటా ఇవ్వడమే కాక, వాళ్లతో ఏకంగా సైన్యాన్నే ఏర్పాటు చేసింది బెనిన్​. ఆఫ్రికాలోని పడమర భాగంలో బిగించిన పిడికిలిలా, ఎలుగెత్తిన కాగడాలా కనిపిస్తుంది ఈ దేశం​. ఇక్కడే ‘అగోజి’ పుట్టింది.

ఆడవాళ్ల సైన్యం         

‘అగోజి’ ఎప్పుడు పుట్టిందో కచ్చితంగా చెప్పే ఆధారాలు లేవు. ఇప్పుడు బెనిన్​గా పిలుస్తున్న ‘దహోమీ’ రాజ్యం 1600 సంవత్సరంలో ఏర్పడింది. ఆ రాజ్యమే ‘అగోజి’కి పుట్టిల్లు. అప్పటికి దహోమీకి రాజు హౌగెబాద్జా. హౌగెబాద్జాకు ‘అకబ’ అనే కొడుకు,  హంగ్బే అనే కూతురు ఉండేవాళ్లు. వీళ్లు కవలలు. హౌగెబాద్జా తర్వాత రాజు అయిన ‘అకబ’ అనుమానాస్పద రీతిలో చనిపోయాక ‘హంగ్బే’ రాణి అయింది. ‘అగోజి’ని ఏర్పాటుచేసింది ఆమెనే అంటారు. ఆ తర్వాత 1880 నాటికి ‘దహోమీ’కి ‘గెజో’ రాజు అయ్యాడు. ఆయన్నే ‘ద ఉమెన్​ కింగ్’​ అనేవాళ్లు. కారణం.. పాలనలోనూ, సైన్యంలోనూ ఆడవాళ్లకు గెజో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పటివరకు ‘అగోజి’లో కేవలం 600 మంది వరకు మహిళా సైనికులు ఉండగా, వాళ్ల సంఖ్యను ఆరువేలకు పెంచాడు. మంత్రి పదవుల్లోనూ ఎక్కువ భాగం ఆడవాళ్లకే ఇచ్చాడు. అయితే, అప్పటివరకు ‘ఒయొ’ సామ్రాజ్యంలో సామంతరాజ్యంగా ఉన్న ‘దహోమీ’1823లో స్వతంత్ర రాజ్యంగా మారింది. ఆ పనిలో ఆయనకు అండగా నిలిచింది ‘అగోజి’. పూర్తిగా ఆడవాళ్లతోనే ఉన్న ఈ సైన్యానికి జనరల్​గా ‘ననిస్కా’ ఉండేది.  

బానిసల వ్యాపారాన్ని అడ్డుకుంటూ..

 ‘ఒయొ’ సామ్రాజ్యం(ఇప్పటి నైజీరియా)లో బానిసగా అమ్మేస్తుంటే తప్పించుకొని వచ్చి ‘అగోజి’లో చేరింది ననిస్కా. ఆ తర్వాత కొన్నేండ్లకు అగోజికి జనరల్​గా మారింది. రాజు గెజోకు అత్యంత నమ్మకస్తురాలిగా మారింది. ఫ్రెంచ్​ సైన్యంతో కలసి ‘ఒయొ’ చక్రవర్తి చేస్తున్న బానిసల వ్యాపారాన్ని అడ్డుకునేలా ‘గెజో’ను ఒప్పించింది. ఆఫ్రికన్లను బానిసలుగా అమ్మేవాళ్లపై దాడులు చేసింది. వేలమందిని బానిసలు కాకుండా కాపాడింది. మంత్రివర్గంలో ఆడవాళ్లకు ఎక్కువ పదవులు ఇచ్చేలా  గెజోను ఒప్పించింది.

కఠిన శిక్షణ పూర్తయితేనే ‘అగోజి’లోకి..  

అగోజిలో చేరడం అంత సులువు కాదు. భయంలేని, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే యువతులనే సైన్యంలోకి తీసుకునేవాళ్లు. వీళ్లలో ఎక్కువమంది బానిసల వ్యాపారం నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్లే ఉండేవాళ్లు. సైన్యంలో చేరిన తర్వాత చాలా కఠినమైన శిక్షణ ఉండేది. చెప్పులు లేకుండా పరిగెత్తడం, బరువులు ఎత్తడం, బలమైన ఆయుధాలను మోసుకెళ్లడం వంటి చాలా పనులు సక్సెస్​ఫుల్​గా పూర్తిచేశాకే సైనికులుగా అవకాశం ఇచ్చేవాళ్లు. 

ఫ్రెంచ్​ సైన్యంతో పోరాడి..

అప్పటికే ఆఫ్రికాలోని చాలా రాజ్యాలను స్వాధీనం చేసుకున్న ఫ్రెంచ్​ ప్రభుత్వం 1863లో ‘దహోమీ’ రాజ్యంలోని పోర్టో నోవో(ఇప్పటి బెనిన్​ రాజధాని)పై దాడికి దిగింది. కారణం.. బానిసల వ్యాపారాన్ని ‘దహోమీ’ అడ్డుకోవడమే. అప్పటికే గెజో కొడుకు ‘గ్లెలె’ రాజు అయ్యాడు. ఆయన, నన్సికా ఆధ్వర్యంలోని అగోజి సైన్యం ఫ్రెంచ్​ మిలటరీని ఎదుర్కొన్నాయి. అయితే, తుపాకులు, ఫిరంగులు ఉన్న ఫ్రెంచ్​ సైన్యానిది పైచేయి అయింది. దాంతో శత్రువు బలం గమనించిన ‘గ్లెలె’.. రాజీ కుదుర్చుకొని ‘పోర్టోనోవో’ను ఇచ్చేశాడు. కానీ, రెండేండ్లకే మళ్లీ ఫ్రెంచ్​ సైన్యంతో పోరాటానికి దిగాడు. అప్పటికి గ్లెలె కూడా శత్రు సైన్యంతో సమానంగా తుపాకులు, ఫిరంగులు సమకూర్చుకున్నాడు. ఏడు వారాల పాటు రెండువైపులా భీకరమైన పోరాటం జరిగింది. అందులో ‘అగోజి’ సైన్యందే మెయిన్​రోల్​. ఒకదశలో ఫ్రెంచ్​ సైన్యం ఓటమి అంచుల వరకు వెళ్లిందంటే కారణం అగోజీనే. అయితే, ఆఖరికి ఫ్రెంచ్​ సైన్యందే పైచేయి అయింది.

‘ద ఉమెన్​ కింగ్​’ సినిమా

యుద్ధంలో ఓడిపోయాక మార్టినెక్యూ దేశానికి పారిపోయాడు గ్లెలె. అప్పటికి అగోజి సైన్యంలో కేవలం 64 మంది మాత్రమే మిగిలారు. వాళ్లలో కొందరు గ్లెలె వెంట వెళ్లగా మరికొందరు దేశంలోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ‘దహోమీ’ని ఆక్రమించుకున్నాక ఆడవాళ్లను అన్ని పదవుల నుంచి తీసేసింది ఫ్రెంచ్​ ప్రభుత్వం. కొన్నేండ్లపాటు బానిసల వ్యాపారాన్ని, ‘దహోమీ’పై శత్రువుల దాడిని అడ్డుకున్న మహిళల సైన్యం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ‘అగోజి’ గురించి ఇటీవల ‘ద ఉమెన్​ కింగ్​’ పేరుతో సినిమా కూడా వచ్చింది.