ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

అర్బన్‌ ఎమ్మెల్యేకు ధన్‌పాల్‌ సవాల్‌

నిజామాబాద్, వెలుగు: అర్బన్  అభివృద్ధిపై ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ సవాల్‌ విసిరారు. గురువారం బీజేపీ జిల్లా ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరిగితేనే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందూరుకు వస్తారని అన్నారు. ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ.. అభివృద్ధిపై డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో చేర్చుకున్న బీజేపీ కార్పొరేటర్లపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటేయాలని ఎన్నికల కమిషన్, కలెక్టర్‌‌ను కోరినట్లు చెప్పారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచినప్పుడే ఎమ్మెల్యే నైతికంగా ఓడి పోయారని విమర్శించారు. తన అనుచరుల భూకబ్జాలు, అక్రమాలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆఫీసర్లపై దాడులు జరుగుతున్నా  ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్‌కార్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పంచరెడ్డి లింగం, కార్పొరేటర్లు  ప్రవళిక శ్రీధర్, మాస్టర్ శంకర్, సుక్క మధు తదితరులు పాల్గొన్నారు.

మొక్కుబడిగా దిశ మీటింగ్‌

ఆఫీసర్ల తీరుపై ఎంపీ అసహనం

అసంపూర్తి సమాచారంతో ఎందుకొచ్చారని ఆగ్రహం

కామారెడ్డి, వెలుగు:  కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్‌, అభివృద్ధి పనులపై ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రధానంగా చర్చించాల్సిన ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మమ అనిపిస్తున్నారు. గురువారం జరిగిన కామారెడ్డి దిశ ( జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) మీటింగ్‌ కూడా అలాగే కొనసాగింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, జాజాల సురేందర్,  కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.కె ముజీబుద్దీన్, అడిషనల్ కలెక్టర్​ చంద్రమోహన్, ఎంపీపీలు, ఆయా శాఖల  జిల్లా ఆపీసర్లు పాల్గొన్నారు. ఎజెండాలో 21 శాఖలపై చర్చ ఆంశాలు ప్రతిపాదించినప్పటికీ 17 శాఖలపైనే చర్చించారు. కేవలం 2 గంటల 20 నిమిషాల్లోనే మీటింగ్ ముగించారు.

అంబులెన్స్ ఎందుకు ఉపయోగిస్తలె..

మద్నూర్, బిచ్కుందకు ఎంపీ ఫండ్స్‌తో ఇచ్చిన అంబులెన్స్‌లు ఎందుకు ఉపయోగించడం లేదని డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌ను ఎంపీ బీబీ పాటిల్ ప్రశ్నించారు. డ్రైవర్, డిజీల్ సమస్య ఉందా..? ఉంటే చెప్పాలన్నారు. ఆ హాస్పిటల్​ డీసీహెచ్‌వో పరిధిలో ఉందని, వివరాలు కనుక్కొని చెబుతానని చెప్పడంతో కలెక్టర్‌‌ కలుగజేసుకుని ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద జిల్లాలో గాంధారి మండలం బ్రహ్మన్‌పల్లి,  దోమకొండ మండలం షేర్​బీబీపేట సెలక్ట్ అయ్యాయని ఇక్కడ రూ.49.50 లక్షలతో పనులు చేపట్టినట్లు డీపీవో శ్రీనివాస్​రావు వివరించారు. ఇంకా కొన్ని గ్రామాలు కూడా సెలక్ట్ అయ్యాయని పూర్తి వివరాలు చెప్పాలని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తి వివరాలు ఎందుకు చెబుతున్నారని సంజాయిషీ నోటిసు ఇస్తానని కలెక్టర్​ పేర్కొన్నారు. డీఆర్డీఏ, పంచాయతీ రాజ్ ఆఫీసర్లు కోఆర్డినేషన్​ చేసుకుని వివరాలు అందించాలని ఆదేశించారు.

భగీరథ నీళ్లు ఎక్కడ వస్తున్నాయ్​..?

మిషన్ భగీరథపై చర్చలో జిల్లాలో రెండు హాబిటే షన్లు మినహా మిగతా అన్ని చోట్ల భగీరథ నీళ్లు సప్ల య్ చేస్తున్నామని ఈఈ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దీంతో జుక్కల్ నియోజక వర్గంలో ఎన్ని హాబిటేషన్లకు నీళ్లను ఇస్తున్నారని ఎంపీ ప్రశ్నించారు. 254 హాబిటేషన్లకు నీళ్లు ఇస్తున్నామని చెప్పగా.. ఇంకా కొన్ని గ్రామాల్లో సరిగ్గా రావట్లేదని, సీర్పుర్‌‌లో కూడా నీళ్లు రావడం లేదని అవసరమయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేద్దామన్నారు. మున్సిపాల్టీ ఏరియాల్లో పైపులైన్ల డ్యామేజీపై పరిశీలన చేయాలని ఈఈకి సూచించారు. సమావేశంలో ఏఎస్పీ అన్యోన్య, డీఆర్డీవో సాయన్న పాల్గొన్నారు.  

రూ.600 కోట్ల స్కాంపై కోర్టుకు కెళ్తా..

బీజేపీ లీడర్ మల్లికార్జున్‌రెడ్డి

ఏర్గట్ల, వెలుగు: జిల్లాలో సహజ వనరుల దోపిడీతో పాలకులు రూ.600 కోట్లు లూటీ చేశారని,ఈ అక్రమ దందాలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాత్ర ఉందని బీజేపీ నేత డాక్టర్‌‌ మల్లికార్జున్‌రెడ్డి ఆరోపించారు. వనరుల దోపిడీపై కోర్టుకు కెళ్తానని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో జనంతో మనం పాదయాత్ర 3వ రోజూ కొనసాగింది. గురువారం ఉప్లూర్‌ నుంచి ప్రారంభమై ఏర్గట, రాంపూర్, గుమ్మిర్యాల్ మీదుగా దొంచంచ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.

ఏర్గట్లను ఆనుకుని ఉన్న బట్టాపూర్‌ క్రషర్‌లో రూ.600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు‌. ప్రశాంత్‌రెడ్డి ఇప్పటి వరకు రూ. 4 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడని ఆరోపించారు. పాలకుల మోసాలను ప్రజలు ఇప్పడిప్పుడే తెలుసుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. పాదయాత్రలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, ఏర్గట్ల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

బీజేపీ కార్యకర్తలకు ఎంపీఆర్‌‌ అండ

బోధన్, వెలుగు: బోధన్​ నియోజకవర్గంలోని బీజే పీ బూత్​స్థాయి కార్యకర్తల జీవితాలకు భరోసా కల్పించడం కోసమే ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు బోధన్ నియో జకవర్గ నేత మేడపాటి ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. గురు వారం బోధన్‌లోని ఆయన నివాసంలో బీజేపీ కార్యకర్తల కోసం రూ.10 లక్షల ప్రమాద బీమా పాలసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి పునాదిరాయి వంటివారన్నారు. వారి జీవితాల్లో అనుకోని ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు అండగా ఉండడానికి రూ.10 లక్షల యాక్సిడెంట్  బీమా పథకాన్ని ప్రతి కార్యకర్తలకు వర్తింప జేస్తున్నామని చెప్పారు.  నియోజవర్గంలోని 220 బూత్‌ల్లో ఉన్న 6 వేల మందికి ఈ పాలసీని వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజవక వర్గ కన్వీనర్ శ్రీధర్, నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్టూడెంట్లకు హైజెనిక్ కిట్ల పంపిణీ 

కోటగిరి, వెలుగు: నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్భా స్కూల్ స్టూడెంట్లకు గురువారం హైజెనిక్ కిట్లను పంపిణీ చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ ఆడ పిల్లలకు పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమన్నారు. సాయం చేసిన వారిని మర్చిపోకుండా కృతజ్ఞతాభావంతో ఉండాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ట్రెజరర్ రవీందర్, జిల్లా ఈసీ మెంబర్ సూర్యనారాయణ, విద్యా వికాస్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్, బోధన్ డివిజన్ రెడ్‌ క్రాస్ సొసైటీ చైర్మన్ కొడాలి కిషోర్, కోటగిరి మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వెంకటేశం, మెంబర్ బర్ల రవి, జిల్లా ఐసీడీఎస్  ఇన్‌చార్జి పీడీ సుధారాణి, సీడీపీవో వినోద, ఐసీడీఎస్ సూపర్‌‌ వైజర్ శ్రీలత, కేజీబీవీ ఎస్‌ఓ రూప పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పుకోవద్దా!

టీఆర్ఎస్​లీడర్లపై యువకుల ఆగ్రహం

నవీపేట్, వెలుగు: ఎమ్మెల్యేకు కాకుంటే తమ సమస్యలు ఎవరికి చెప్పాలంటూ టీఆర్ఎస్​లీడర్లపై జన్నేపల్లె గ్రామ యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల  పరిష్కారం కోసం ‘మన ఊరు – మన ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని బోధన్ ఎమ్మెల్యే షకీల్ గత నెల ప్రారంభించారు. అందులో భాగంగా గురువారం నిజామాబాద్​జిల్లా నవీపేట మండలంలోని నాడాపూర్, జన్నేపల్లి గ్రామాల్లో పర్యటించారు. జన్నేపల్లి శివాలయం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తుండగా గ్రామ యూత్ సభ్యులు వచ్చారు. మాటు కాలువపై కొన్ని అక్రమ కట్టడాలను ఇరిగేషన్ ఆఫీసర్లు కూల్చేశారని, ఎప్పటినుంచో ఉన్న మిగతా కట్టడాలు కూడా తీసివేయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

అంతలో కొందరు టీఆర్ఎస్ లీడర్లు వచ్చి మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ యూత్​సభ్యులను అడ్డుకున్నారు. దీంతో  ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం యూత్​సభ్యులు మాట్లాడుతూ అక్రమ కట్టడాలు కూల్చి వేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని పార్టీలకు అతీతంగా వచ్చామని, ఎమ్మెల్యే సమస్యలను సానుకూలంగా వింటుంటే టీఆర్ఎస్ లీడర్లు వచ్చి దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఎమ్మెల్యేకు కాకుంటే ఇంకెవరికి చెప్పాలని, పార్టీ మీటింగ్​అనుకుంటే పాసులు ఇచ్చి పెట్టుకోవాలని అన్నారు. 

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

పిట్లం, వెలుగు: మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే హన్మంత్​షిండే ఆఫీసర్ల ను ఆదేశించారు. గురువారం మద్నూర్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ పత్తి రేటు ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉండడం సంతోషకరమన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌ సాయాగౌడ్, ఆఫీసర్లు, నాయకులు పాల్గొన్నారు. కాగా, గురువారం క్వింటల్‌ పత్తి ధర రూ.9,609 పలికింది.