ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు


టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను సాగనంపడం ఖాయం

ఆర్మూర్, వెలుగు: ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రం నుంచి టీఆర్ఎస్‌‌‌‌ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌‌‌‌చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రపంచంలోనే గొప్ప కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్‌‌‌‌ చేసిన సీఏం కేసీఆర్ మొన్నటి వర్షాలకు ఆ ప్రాజెక్ట్ పూర్తిగా మునిగిపోయి కోట్లాది రూపాయల నష్టం జరిగితే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వర్షాలకు ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో నష్టం జరిగినా ఎమ్మెల్యే జీవన్‌‌‌‌రెడ్డి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నందిపేట్‌‌‌‌లో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ అర్వింద్‌‌‌‌కు ప్రోటోకాల్ పాటించని పోలీసులు ఎమ్మెల్యే తమ్ముడు రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఎందుకు అతిథి మర్యాద చేస్తున్నారో అర్థం కావడంలేదని విమర్శించారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన పోలీసులు టీఆర్ఎస్ లీడర్లకు గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు. 21న మునుగోడులో జరిగే అమిత్ షా బహిరంగ సభకు ఆర్మూర్ నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ టౌన్​ప్రెసిడెంట్​జెస్సు అనిల్, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, టౌన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, నాయకులు ద్యాగ ఉదయ్, మీసాల రాజేశ్వర్, అమ్దాపూర్ రాజేశ్‌‌‌‌,  వేణు, విజయానంద్, పాన్ శ్రీను, ఖాందేశ్ ప్రశాంత్, పాలెపు రాజు, మందుల బాలు, మిర్యాల్‌‌‌‌కర్ కిరణ్, రాము  పాల్గొన్నారు.

నేల తల్లి ఒడిలో...

తల్లి ఎంత పనిలో ఉన్నా.. తన బిడ్డ సంరక్షణలో తగు జాగ్రత్త తీసుకుంటుందనడంలో సందేహం లేదు.. అలాంటి దృశ్యమే ఇది.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మహిళా రైతు కయ్యల లక్ష్మి తమకున్న నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తోంది. చేనులో గడ్డి పెరగడంతో శుక్రవారం కలుపు తీత పనిలో ముగిన ఆమె.. తన రెండేళ్ల చిన్నారిని నేలపై పడుకోబెట్టి, ఎండ తగలకుండా ఇలా ఏర్పాట్లు చేసింది. - వెలుగు, కామారెడ్డి

నిండుకుండలా ఎస్సారెస్పీ...

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌‌‌‌లోకి వరద నీరు పెరగడంతో నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,090 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్ట్‌‌‌‌లోకి 46 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా శుక్రవారం సాయంత్రం12  గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 84  టీఎంసీల నీరు ఉన్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.  - నిజామాబాద్, వెలుగు

రాంపూర్‌‌‌‌‌‌‌‌లో ముగ్గుల పోటీ


పిట్లం, వెలుగు: ఆజాది కా అమృత్ మహోత్సవ్‌‌‌‌లో భాగంగా పిట్లం మండలం రాంపూర్​  హైస్కూల్‌‌‌‌లో స్టూడెంట్లకు శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. హెచ్‌‌‌‌ఎం ఆనంద్​ ప్రారంభించిన ఈ పోటీల్లో పిల్లలు దేశభక్తి భావం పెంచేలా ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. గెలుపొందిన వారికి వజ్రోత్సవాల ముగింపు ప్రోగ్రాంలో బహుమతులు అందజేస్తామని హెచ్‌‌‌‌ఎం తెలిపారు. కార్యక్రమంలో టీచర్లు సాయిబాబా, కిష్టయ్య, స్వరూప, సాయిలు, కృష్ణాగౌడ్, రాజు ప్రసన్న, సీఆర్పీ గోపాల్, మల్లేశ్‌‌‌‌ పాల్గొన్నారు.

స్టూడెంట్లకు పుస్తకాలు, దుస్తుల పంపిణీ


మాక్లూర్, వెలుగు:  భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆలిండియా మూమెంట్​ఫర్ సేవా ఆశ్రమంలోని స్టూడెంట్లకు శుక్రవారం పుస్తకాలు,పెన్నులు, పెన్సిళ్లు, బట్టలు, షూస్ పంపిణీ చేశారు. మాక్లూర్ మండలంలోని మదన్‌‌‌‌పల్లి గ్రామంలో ఇటీవల స్వామి దయానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఆశ్రమం (హాస్టల్ బిల్డింగ్)ను నిర్మించారు. ఇందులో ఉంటున్న మదన్‌‌‌‌పల్లి గవర్నమెంట్ ప్రైమరీ, హైస్కూళ్ల స్టూడెంట్లకు పైవస్తువులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, స్థానిక సర్పంచ్ శంకర్‌‌‌‌‌‌‌‌గౌడ్, ఎంపీటీసీ గోవూరు ఒడ్డెన్నయాదవ్, ఎండీవో క్రాంతి, ఎంఈవో శ్రీనివాస్, రూరల్​సీఐ నరహరి, మాక్లూర్ ఎస్సై యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.

ఆటోను ఢీకొట్టిన కారు
ఐదుగురు చిన్నారులకు గాయాలు 

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: స్కూల్‌‌‌‌లో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని ఆటో ఇంటికి వెళ్తున్న చిన్నారులను రాంగ్ రూట్లో వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఆర్ఆర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ ఘటన వివరాలు టూ టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ కథనం ప్రకారం.. నాగారంలోని కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం ఉదయం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం  10 మంది చిన్నారులు టాటా మ్యాజిక్‌‌‌‌లో ఇంటికి బయలుదేరారు. అదే టైంలో కారులో రాంగ్ రూట్‌‌‌‌లో వస్తున్న రిటైర్డ్ ఏఎస్సై మేకల శంకర్ టాటా మ్యాజిక్‌‌‌‌ను ఢీకొట్టాడు. దీంతో అందులో ఉన్న సాత్విక్, శ్రీకర్, మౌర్య. రిత్విక్, శ్రీనందన్‌‌‌‌ను తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారులను నగరంలోని ఓ ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. టాటా మ్యాజిక్ డ్రైవర్ రియాజ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెస్పారు.  

సర్పంచ్‌‌‌‌‌‌‌‌తో మాకు  ప్రాణహాని ఉంది


వర్ని, వెలుగు: రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్న తమను సర్పంచ్ ఖాదర్‌‌‌‌‌‌‌‌, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని కాలనీకి చెందిన హమీదా బేగం ఆమె భర్త షేక్‌‌‌‌‌‌‌‌ హజీం శుక్రవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌‌‌‌తో తమకు ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటున్న తమను ఖాళీ చేయాలని బెదిరించారని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై సర్పంచ్‌‌‌‌ వివరణ కోరగా తాను ఎవరినీ బెదిరించలేదని అందరితో మంచిగా ఉండాలని గొడవలు పెట్టుకోవద్దని భార్యాభర్తలకు సూచించినట్లు తెలిపారు. ఈ విషయంపై రుద్రూర్‌‌‌‌‌‌‌‌ ఎస్సై రవీందర్‌‌‌‌‌‌‌‌కు వివరణ కోరగా తమకు ఎలాంటి పిర్యాదు రాలేదన్నారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు తొత్తులుగా మారిన పోలీసులు


వర్ని, వెలుగు: పోలీసులు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు తొత్తులుగా మారారని బీజేపీ మండల ప్రెసిడెంట్‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు బీజేపీపై సోషల్‌‌‌‌ ‌‌‌‌మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిని స్పీకర్‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ శుక్రవారం బీజేపీ లీడర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అయితే దీనిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా శంకర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీజేపీ లీడర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ తీరు మార్చకోకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

స్వాతంత్ర్య పోరాటాన్ని పిల్లలకు వివరించాలి

నిజామాబాద్,  వెలుగు: నేటి బాలలే రేపటి పౌరులని.. వారికి దేశ స్వాతంత్ర్య పోరాటం, సమరయోధుల త్యాగాలను వివరించాలని మేయర్ నీతూ కిరణ్ సూచించారు. స్థానిక మారుతినగర్‌‌‌‌లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌లో జిల్లా మహిళ, శిశు, వికలాంగులు, వయో- వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులు, దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్లు, వృద్ధాశ్రమంలో ఉండే వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం స్వతంత్ర వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సీడీపీవో సౌందర్య, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి,  మాజీ కార్పొరేటర్ చాంగు బాయి పాల్గొన్నారు. 

కొనసాగుతున్న వజ్రోత్సవాలు

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: డిచ్‌‌‌‌పల్లి మానవత సదన్ నిజామాబాద్‌‌‌‌ కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ మాట్లాడుతూ సదన్‌‌‌‌లో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ డివిజన్‌‌‌‌కు చెందిన పంచాయతీ సెక్రటరీలు అందజేసిన రూ.లక్షా 17 వేల విలువ గల బట్టలు, ఇతర ఉపకరణాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రవి, డీపీవో జయసుధ, డీఎల్పీవో నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో గోపిబాబు, సీఐ శ్రీశైలం, ఎస్సై గణేశ్‌‌‌‌, కేర్ టేకర్ రవి పాల్గొన్నారు.

పండ్లు, స్వీట్ల పంపిణీ

నవీపేట్‌‌‌‌/ఆర్మూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నవీపేట్‌‌‌‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ సవిత బుచ్చన్న, ఎస్సై రాజిరెడ్డి, ఏఎస్సై లు మోహన్‌‌‌‌రెడ్డి, యాదగిరిగౌడ్, ఎంపీటీసీ మినా నవీన్‌‌‌‌రాజ్‌‌‌‌ పాల్గొన్నారు. ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రోగ్రామ్‌‌‌‌లో డీఎంహెచ్‌‌‌‌వో సుదర్శనం, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ పండిత్ వినీత పవన్, ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సీఐ సురేశ్‌‌‌‌బాబు, ఎస్సైలు ప్రదీప్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ​ 

బోధన్‌‌‌‌ గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌లో...


బోధన్, వెలుగు: పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌లో ఎమ్మెల్యే షకీల్‌‌‌‌ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ పద్మావతి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాధకృష్ణ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా గోకులాష్టమి 

ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో గోకులాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలు, మండలాల్లోని శ్రీకృష్ణ మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లలో జరిగిన కృష్టామి వేడుకల్లో చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణతో సందడి చేశారు.  ఇక యువకులు ఉట్ల సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.   - వెలుగు, నెట్‌‌‌‌వర్క్‌‌‌‌