ప్రొ. కూరపాటి వెంకటనారాయణ ఇంటికి బీజేపీ నేతలు

ప్రొ. కూరపాటి వెంకటనారాయణ ఇంటికి బీజేపీ నేతలు

హనుమకొండలో తెలంగాణ పోరాటయోధుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఇంటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లారు. నడ్డా వెంట తరుణ్ చుగ్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఇతర కీలక నేతలున్నారు. ప్రొఫెసర్ లింగమూర్తి, పుల్లూరి సుధాకర్, టి.  శ్రీనివాస్, డా.స్వర్ణలత, డా.మామిడాల ఇస్తారి కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ వాదులను, మేధావులను ఏకతాటిపైకి తేవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అంతకంటే ముందు.. బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు జేపీ నడ్డా వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు బీజేపీ పార్టీకి చెందిన కీలక నేతలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నోవాటెల్ లో జేపీ నడ్డాతో భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు.

అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ కు చేరుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్ తో కలిసి భద్రకాళి టెంపుల్ కు చేరుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన నడ్డా..ఇతర నేతలకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా.. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఇంటికి వెళ్లారు. ఆయనతో ప్రజా సమస్యలు, రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ముగిసిన అనంతరం హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్న బహిరంగసభలో నడ్డాతో పాటు బండి సంజయ్ ఇతర కీలక నేతలు పాల్గొంటారు.