కరోనా పేరుతో కేసీఆర్ జనాన్ని అణిచేస్తున్నడు

కరోనా పేరుతో కేసీఆర్ జనాన్ని అణిచేస్తున్నడు
  • బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్
  • రాష్ట్రంలో అవినీతి అంతం అయ్యే దాకా పోరాడ్తం
  • ఉద్యోగులు, టీచర్లకు అండగా నిలుస్తం
  • కరోనా రూల్స్​ మా పార్టీ లీడర్లకేనా? 
  • సికింద్రాబాద్​లో గాంధీ విగ్రహం వద్ద నివాళులు
  • ఆంక్షల పేరుతో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • రెండు వారాల పాటు రాష్ట్రంలోనే తరుణ్​చుగ్​

కాళేశ్వరం.. కేసీఆర్‌‌కు ఏటీఎంగా మారింది
కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్‌‌కు ఏటీఎంగా మారింది. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు నీటిని తన ఫామ్ హౌస్‌కు మళ్లించు కుంటున్నాడు. పాలమూరు ప్రాజెక్టుతో ఒక చుక్క నీరు కూడా రైతులకు అందడం లేదు. అత్యంత అవినీతిపరుడైన సీఎం కేసీఆరే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. 
‑ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ది నియంత పాలన అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. కరోనా పేరుతో ప్రజలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. ‘‘తెలంగాణలో కేసీఆర్‌‌‌‌తో కొట్లాడేది బీజేపీ మాత్రమే. ఆయన నియంతృత్వ పాలన అంతమయ్యే దాకా పోరాడుతాం. మా పార్టీ చేస్తున్న ధర్మ పోరాటానికి ప్రజలు మద్దతివ్వాలి’’ అని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా సికింద్రాబాద్‌‌లో తలపెట్టిన  ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌‌ వచ్చారు. కానీ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో సికింద్రాబాద్​లోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి పార్టీ ఆఫీస్​కు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై కరీంనగర్‌‌‌‌లో శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్‌‌పై పోలీసులు చేయి చేసుకోవడం, అరెస్టు చేయడాన్ని నడ్డా తీవ్రంగా ఖండించారు. 317 జీవో ఉద్యోగులు, టీచర్లకు వ్యతిరేకంగా ఉందని, వారికి న్యాయం జరిగే దాకా ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల కోసం రాష్ట్ర బీజేపీ చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. సంజయ్‌‌ని అరెస్టు చేయడం.. కేసీఆర్ వినాశకాలే విపరీత బుద్ధికి నిదర్శనమన్నారు. సంజయ్ దీక్ష చేస్తే కరోనా రూల్స్ గుర్తుకు వచ్చే ప్రభుత్వానికి.. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ర్యాలీలు తీస్తున్నప్పుడు గుర్తుకు రావా అని నిలదీశారు.

ఎట్ల కొట్లాడాలో మాకు తెలుసు
తన స్వార్థం కోసం కరోనా అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంటున్నదని బీజేపీ చీఫ్ నడ్డా దుయ్యబట్టారు. ‘‘ధర్నా చౌక్‌‌ను మూసి వేయించిండు. హైకోర్టు ఆదేశాలతో తెరిచిన తర్వాత మొదట అక్కడ ధర్నా చేసిందే కేసీఆరే” అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పని చేయదని, మరొకరిని పని చేసుకోనివ్వదని ఫైర్ అయ్యారు. ‘‘శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టులో నేను దిగగానే ఇక్కడి ప్రభుత్వ తీరు నాకు అర్థమైంది. నన్ను ఆపటానికి జాయింట్ సీపీ కార్తికేయ ప్రయత్నించారు. కానీ నేను అడిగిన ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేకపోయింది. ఇక్కడ మమ్మల్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆగబోమని చెప్పినం. ప్రజాస్వామ్యయుతంగా ఈ సర్కార్ కు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో మాకు తెలుసు” అని అన్నారు.

ఎయిర్‌‌‌‌పోర్టులో ఘన స్వాగతం
ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన నడ్డాకు రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సాయంత్రం ఐదున్నరకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నేతలు లక్ష్మణ్​, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు బొకేలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో ఎయిర్ పోర్టు ఆవరణ కిక్కిరిసిపోయింది. అక్కడే పార్టీ ముఖ్యనేతలతో నడ్డా కొద్దిసేపు మాట్లాడారు. సంజయ్ అరెస్టు, అనంతర పరిణామాలను నడ్డాకు నేతలు వివరించారు.
 

సీనియర్ నేతలతో చర్చ
మీడియా సమావేశం తర్వాత పార్టీ ఆఫీసులో నడ్డా మరోసారి బీజేపీ సీనియర్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సంజయ్ అరెస్టు, దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన అంశంపై నేతలు నడ్డాకు వివరించినట్లు సమాచారం. వీలును బట్టి సంజయ్‌‌ని పరామర్శించేందుకు కరీంనగర్ వెళ్లే విషయం చూద్దామని ఆయన అన్నట్లు తెల్సింది. అబ్దుల్లాపూర్ మెట్‌‌లోని తారామతిపేటలో బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి గెస్ట్ హౌస్‌‌లో నడ్డా రాత్రి బస చేశారు. బుధవారం అమ్మోజీగూడలో జరగనున్న ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరవుతారు. ఈ నెల 7 వరకు సంఘ్ శిబిరంలోనే ఉండనున్నారు.

టెన్షన్.. టెన్షన్..
బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా సికింద్రాబాద్ రాణిగంజ్‌‌లోని గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్యారడైజ్ సర్కిల్ దాకా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. దీనికి చీఫ్ గెస్ట్‌‌గా నడ్డా రానున్నారని ప్రకటించారు. కానీ కరోనా ఆంక్షలున్నాయని, ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని పోలీసులు చెప్పారు. దీంతో నడ్డా హైదరాబాద్ రాకపై పార్టీ లీడర్లలో టెన్షన్ నెలకొంది. నడ్డా ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత పోలీసు అధికారులు ఆయన్ను కలిశారు. ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆఫీసర్లు చెప్పడంతో కార్యకర్తల్లో టెన్షన్ తగ్గింది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ వెళ్లిన నడ్డా.. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆంక్షల నేపథ్యంలో నడ్డా కారులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ.. నేరుగా బీజేపీ స్టేట్ ఆఫీసుకు చేరుకున్నారు.

హుజూరాబాద్​ దెబ్బకు కేసీఆర్​ మెంటల్ బ్యాలెన్స్ తప్పింది
సీఎం కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ తప్పారని, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల తీర్పుతో ఆయన మతి భ్రమించిందని జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది’’ అని ఫైర్ అయ్యారు. తన కుటుంబం కోసం కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కొడుకు, బిడ్డ, అల్లుడితోపాటు ఇప్పుడు తన మనువడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.