జడ్జిలు, లాయర్లు, జర్నలిస్టులు..ఎవ్వరినీ వదల్లేదు

జడ్జిలు, లాయర్లు, జర్నలిస్టులు..ఎవ్వరినీ వదల్లేదు
  •  బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్​గా ఫోన్ ట్యాపింగ్ 
  • 300 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసిన తిరుపతన్న టీమ్
  • లిస్టులో పొంగులేటి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి, కొండల్ రెడ్డి
  • ఎన్నికల టైమ్​లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రత్యర్థుల డబ్బు పట్టివేత   
  • యశోద, ప్రతిమ హాస్పిటల్స్ నుంచి బీఆర్ఎస్ నేతలకు భారీగా డబ్బు పంపిణీ  
  • టాస్క్​ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు 
  • భుజంగరావు, తిరుపతన్న స్టేట్‌‌మెంట్స్​లో వెలుగులోకి సంచలన విషయాలు 

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్​గా గత ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్​ను మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టు వెల్లడైంది. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష లీడర్లు, పోలీస్‌‌ ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జిలు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించినట్టు తేలింది. 

తమకు టార్గెట్ గా ఉన్నోళ్లతో పాటు వాళ్ల కుటుంబసభ్యుల వ్యక్తిగత జీవితాలపైనా నిఘా పెట్టినట్టు బట్టబయలైంది. ఈ కేసులో నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్ మెంట్లలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చేస్తున్న స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు మార్చి 30న వీరిద్దరూ వాంగ్మూలం ఇచ్చారు.

భుజంగరావు టీమ్ పొలిటికల్ ఆపరేషన్స్.. 

భువనగిరి ఏసీపీ భుజంగరావును 2021 నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఇంటెలిజెన్స్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ ఎస్పీగా నియమించారు. ఆయన టీమ్​లో ఇన్‌‌‌‌స్పెక్టర్లు చలపతి, శ్రీధర్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌ఐ ప్రభాకర్ రాజు, ఏఎస్‌‌‌‌ఐ నర్సింగ్‌‌‌‌ రావు, హెడ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ జంగయ్య ఉన్నారు. ఇంటెలిజెన్స్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌లోని ఫస్ట్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో భుజంగరావుకు చాంబర్ ఏర్పాటు చేశారు. ఆపరేషన్స్‌‌‌‌ కోసం రెండు సెల్‌‌‌‌ఫోన్స్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, ఐ పాడ్‌‌‌‌ అందించారు. 

ఈ టీమ్ పొలిటికల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ ఆపరేషన్స్ చేసింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ, కేసీఆర్‌‌‌‌‌‌‌‌, కేటీఆర్, కవిత, హరీశ్​రావు సహా వారి కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించేటోళ్ల వివరాలను సేకరించేవారు. రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా భుజంగరావు టీమ్‌‌‌‌ ఆపరేషన్స్ చేసింది. బీఆర్ఎస్‌‌‌‌కు వ్యతిరేకంగా పనిచేసినోళ్ల ఫోన్లను ట్యాప్ చేసింది. 

వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రత్యర్థుల డబ్బు ట్రాక్.. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన కేసులపై కూడా మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌‌‌రావు టీమ్‌‌‌‌ ఫోకస్ పెట్టింది. కేసులను విచారిస్తున్న జడ్జీలు, సంబంధిత న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌‌‌‌ చేశారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని వారి కదలికలపైనా నిఘా పెట్టారు. పలువురిని బెదిరింపులకు గురిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో కామారెడ్డి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ‘కేఎంఆర్‌‌‌‌‌‌‌‌’ పేరుతో స్పెషల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా ఫోన్లను తిరుపతన్న టీమ్‌‌‌‌ ఫోన్స్‌‌‌‌ ట్యాప్ చేసింది. 

కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌ రెడ్డి, బీజేపీ నేత వెంకటరమణా రెడ్డి, రేవంత్‌‌‌‌రెడ్డి సోదరుడు కొండల్‌‌‌‌రెడ్డిపై నిఘా పెట్టారు. తిరుపతన్న ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్‌‌‌‌ను ఆపరేట్‌‌‌‌ చేశారు. ప్రత్యర్థుల డబ్బును ట్రాక్ చేసి ఎక్కడికక్కడే సీజ్ చేశారు. ఈ క్రమంలోనే పోయినేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘పీఓఎల్‌‌‌‌–2023’ పేరుతో మరో వాట్సాప్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఏర్పాటు చేశారు. టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి  తిరుపతన్న టీమ్‌‌‌‌ జాయింట్ ఆపరేషన్స్ చేసింది. ప్రత్యర్థుల వాహనాలను ట్రాక్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకుంది. 

కేటీఆర్​ను విమర్శించినోళ్ల ఫోన్లూ ట్యాప్..  

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పేపర్‌‌‌‌ లీకేజీ ఘటనపై అప్పటి మంత్రి కేటీఆర్‌‌‌‌ను విమర్శించినోళ్లపైనా భుజంగరావు, ప్రణీత్‌‌‌‌రావు టీమ్‌‌‌‌ నిఘా పెట్టింది. వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహరించిన ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల లీడర్లను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఎప్పటికప్పుడు వారి కదలికలను గుర్తించారు. ఈ క్రమంలోనే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోని అనుమానిత నేతలు, ఇతర పార్టీల నేతలపై భుజంగరావు, తిరుపతన్న టీమ్‌‌‌‌ నిఘా పెట్టింది.

 ముఖ్య నాయకులు, అనుచరులు, బంధువులు, స్నేహితుల వివరాలతో లిస్ట్‌‌‌‌ తయారు చేసేవారు. ప్రత్యర్థుల బలం బహీనతలను గుర్తించేవారు. టార్గెట్స్‌‌‌‌లో ఉన్న వారికి ఆర్థిక సహకారం అందించే వ్యక్తుల వివరాలనూ సేకరించేవారు. వాళ్ల ఫోన్‌‌‌‌ నంబర్స్‌‌‌‌ను ప్రణీత్‌‌‌‌రావుకు అందించేవారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్‌‌‌‌(ఎస్‌‌‌‌ఓటీ) ఆధ్వర్యంలో ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ చేసేవారు. ఇందుకోసం అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ టెక్నాలజీ టూల్స్‌‌‌‌ను వినియోగించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మునుగోడు, హుజూరాబాద్‌‌‌‌, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ స్పెషల్‌‌‌‌ ఆపరేషన్స్ నిర్వహించారు. 

సెటిల్​మెంట్లు సైతం.. 

ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల గెలుపు కోసం ఎస్ఐబీ టీమ్ సహకారం అందించింది. యశోద, ప్రతిమ ఆస్పత్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తరలించారు. ఆ డబ్బును టాస్క్ ఫోర్స్ వెహికల్స్‌‌‌‌లో తీసుకెళ్లి బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. మరోవైపు టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌‌‌రావు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులకు అనుకూలంగా సివిల్ సెటిల్‌‌‌‌మెంట్లు కూడా చేశారు.

 ఇందులో భాగంగా సంధ్యా కన్వెన్షన్‌‌‌‌ ఎండీ శ్రీధర్ రావును బెదిరించి బీఆర్ఎస్ కోసం రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించారు.  హైటెక్ సిటీలోని ఓ పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ వివాదంలో ఓ టీవీ చానెల్‌‌‌‌కు చెందిన ఎస్‌‌‌‌ రావు, శ్రీధర్ రావు మధ్య సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశారు. శ్రీధర్ రావు నుంచి రూ.2 కోట్లు ఎస్‌‌‌‌ రావుకు ఇప్పించారు. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసినప్పటికీ శ్రీధర్ రావుపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. ఎస్‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు బంధువైన రవీందర్‌‌‌‌‌‌‌‌రావు, శ్రీధర్‌‌‌‌‌‌‌‌రావు మధ్య కూడా ఓ సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ చేశారు.