తెలంగాణలో లోక్​సభ సీట్లన్నీ కాంగ్రెస్వే : జూపల్లి కృష్ణారావు

తెలంగాణలో లోక్​సభ సీట్లన్నీ కాంగ్రెస్వే : జూపల్లి కృష్ణారావు
  •     అచ్చంపేట సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్​ కర్నూల్,​ వెలుగు: రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లను కాంగ్రెస్​  గెలుచుకుంటుందని, అన్ని సీట్లను గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్​  క్యాడర్​దేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం అచ్చంపేటలో కాంగ్రెస్​ పార్టీ అచ్చంపేట నియోజకవర్గ స్థాయి పార్లమెంట్​ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు నెలలు బాగా కష్టపడితే  కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. 

ఢిల్లీ, హైదరాబాద్​లో ఉన్న పార్టీల లీడర్లు అడ్డం పొడువు మాట్లాడుతున్నారని, వీళ్లంతా ఏం పొడిచిండ్రో 10 ఏండ్ల నుంచి చూస్తున్నామన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన ఇందిరాగాంధీ కుటుంబానికి, ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను దోచుకు తిన్న కల్వకుంట్ల కుటుంబానికి పోలికా అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్​తో ఉన్న రాష్ట్రం పదేండ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలైందన్నారు. 

కేసీఆర్​ ఊ అంటే నరికిన, పొడిచిన, ఉద్దరించిన అంటడని, ఆ ఉద్ధరిచ్చింది రూ.8 లక్షల కోట్ల అప్పుతోనా అని నిలదీశారు. రాష్ట్రంలో రేవంత్​ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే బీఆర్ఎస్​ లీడర్లకు కడుపుమంట మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్​ మీడియా, ఇతర వేదికల్లో అడ్డగోలుగా విమర్శలు, ఆరోపణలు చేస్తే కాంగ్రెస్​ కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్పాలని కోరారు. 

ఉమ్మ డి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు ఎంపీ సీట్లతో పాటు తెలంగాణలోని అన్ని స్థానాలను తామే గెలుచుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఏఐసీసీ సెక్రటరీలు చిన్నారెడ్డి, సంపత్​కుమార్, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్​రెడ్డి, నారాయణ రెడ్డి, మేఘారెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, యూత్​ కాంగ్రెస్​ స్టేట్​ ప్రెసిడెంట్​ శివసేనా రెడ్డి, మల్లాది పవన్, హర్షవర్ధన్​రెడ్డి పాల్గొన్నారు.