500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం.. హైడ్రా బాధితులందరికీ అండగా ఉంటం: కేటీఆర్

500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం.. హైడ్రా బాధితులందరికీ అండగా ఉంటం: కేటీఆర్
  • పదేండ్లలో ఏ ఒక్కరికీ మేం అన్యాయం చేయలేదు
  • రెండేండ్లలో కూల్చేయడం తప్ప చేసిందేమీ లేదని కామెంట్
  • హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ భవన్​లో ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా బాధితులందరికీ అండగా ఉంటామని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. తాము పదేండ్లలో ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదని తెలిపారు. హైడ్రా కూల్చివేతలపై ఆదివారం తెలంగాణభవన్​లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా కూల్చివేతలపై పవర్​పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పలువురు బీజేపీ నేతలకు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేండ్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చుడు తప్ప చేసిందేమీ లేదన్నారు.

వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీలు.. ఏడు వందల రోజులైనా అమలు చేయడం లేదని విమర్శించారు. వృద్ధులు, నిరుద్యోగులు, మహిళలు, యువత అందరూ హామీల గురించే ప్రశ్నిస్తున్నారని అన్నారు. హామీలపై కాంగ్రెస్ నేతలను, సీఎం రేవంత్​ను నిలదీస్తే.. తమనెవరూ నమ్మట్లేదంటున్నారని చెప్పారు. ఇంటికి పెద్దలాంటి నాయకుడే ఇట్ల మాట్లాడితే ఇంకెవరు నమ్ముతారన్నారు. కరోనా సమయంలో రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని నడిపేటోళ్లకు తెలివి ఉంటే అలా ఉంటుందన్నారు.  

హైదరాబాద్ను నాశనం చేశారు..
హైదరాబాద్​ను నాశనం చేయడం తప్ప రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. పేదోళ్లకు ఒక న్యాయం.. పెద్దోళ్లకు మరో న్యాయం చేశారన్నారు. హైడ్రా పేరిట హైదరాబాద్​లో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారన్నారు. బుల్డోజర్ తన శరీరంపై నుంచి వెళ్లాలంటూ యూపీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడారని, అదే తెలంగాణలో బుల్డోజర్​తో ఇండ్లను కూల్చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

హైడ్రా చేసేది న్యాయమే అయితే.. కూల్చడానికి ముందు నోటీసులిచ్చేందుకు వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో ఎక్కడా చూసినా కట్టడాలే కనిపిస్తాయని, వైట్​హౌస్​ను తలదన్నేలా సచివాలయాన్ని నిర్మించామన్నారు. దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్​ కంట్రోల్ సెంటర్​ను నిర్మించామన్నారు. హైదరాబాద్​లో 42 ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లు కట్టామని, ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్​లు, ఇరిగేషన్​ ప్రాజెక్టులు కట్టామని చెప్పారు.

ఇండ్లలో ఎవరైనా చనిపోతే ఏడ్వరా? 
జూబ్లీహిల్స్​లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగిందని తెలిపారు. ‘‘ఒక మీటింగ్​లో గోపీనాథ్​ను తలచుకుని సునీత కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా కాంగ్రెస్ విమర్శించడం ఏమిటి? భర్త చనిపోతే ఒక ఆడబిడ్డకు ఏడుపు రాదా? కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఎవరైనా చనిపోతే వాళ్లు ఏడవరా?” అని ప్రశ్నించారు. చనిపోయిన వారిని తలచుకుని ఏడిస్తే కూడా కాంగ్రెస్​ రాజకీయం చేస్తున్నదని, ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.