59 నిమిషాల్లోనే లోన్ అఫ్రూవ్..

59 నిమిషాల్లోనే లోన్ అఫ్రూవ్..
  •              బ్యాంక్‌‌లతో, ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు
  •                 డిమాండ్‌‌ను పెంచేందుకు చర్యలు

ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని ప్రభుత్వంతో సహా పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన వరల్డ్ బ్యాంక్ జీడీపీ ర్యాంకింగ్స్‌‌లో కూడా ఇండియా 7వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఆటో, రిటైల్ సెక్టార్ కూడా నెమ్మదించాయి. దీంతో ఆర్థికాభివృద్ధిని పుంజుకునేలా చేయడానికి ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఆర్థికాభివృద్ధికి అత్యంత కీలకమైన వినియోగ రంగాన్ని పుంజుకునేలా చేయడానికి రిటైల్ లోన్ విధానంలో సరికొత్త మెకానిజాన్ని ప్రవేశపెట్టబోతోంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న మెకానిజం కింద, ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌లు గృహ రుణాలను, కారు రుణాలను, వ్యక్తిగత రుణాలను కేవలం 59 నిమిషాల్లో అఫ్రూవ్ చేయనున్నాయి. ఇప్పటికే కుటీర,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌‌ఎంఈలకు) 59 నిమిషాల్లో పీఎస్‌‌బీలోన్స్‌‌ఇన్59మినిట్స్.కామ్‌‌ ద్వారా ప్రభుత్వం రుణం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కొత్త రిటైల్ విధానంపై ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌లకు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు మధ్య చర్చలు కూడా జరిగినట్టు సంబంధిత అధికారులు చెప్పారు. అయితే ఈ చర్చలు ఇంకా అడ్వాన్స్ స్టేజీకి చేరుకోలేదని తెలిపారు.

క్రెడిట్‌‌ను తేలికగా అందజేసే మోడీ ప్రభుత్వ ప్రయత్నాల్లో ఇదీ ఒక భాగమని పేర్కొన్నారు. ఈ కొత్త రిటైల్ లోన్ విధానం డిమాండ్‌‌ను పెంచి, ఎకానమీకి సహకరించనుందని తెలిపారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌లకు, ఆర్థిక మంత్రికి ఇటీవల జరిగిన మీటింగ్‌‌లో పీఎస్‌‌బీలోన్స్‌‌ఇన్59మినిట్స్.కామ్ పోర్టల్ ద్వారా ఎంఎస్‌‌ఎంఈలకు ఇచ్చే రుణాల పరిమితిని కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. ఈ పోర్టల్‌‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిందటేడాది నవంబర్ 2న లాంచ్ చేశారు. బ్యాంక్‌‌లకు వెళ్లకుండానే ఈ పోర్టల్ ద్వారా ఎంఎస్‌‌ఎంఈలకు వెనువెంటనే రుణాలు లభిస్తున్నాయి. జూలై 17 నుంచి ఇప్పటి వరకు 13 కోట్ల లోన్స్‌‌ అయ్యాయి. ఆగస్ట్ 5న జరిగిన మీటింగ్‌‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్  అధికారులు, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.  ఆటో, ఎంఎస్‌‌ఎంఈ, ఫైనాన్స్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ వంటి  రంగాల ప్రతినిధులతోనూ ఇలాంటి భేటీలు నిర్వహించనున్నారు.

 కొనడం తగ్గినందుకే…

వినియోగదారులు వస్తువులను కొనడం తగ్గించారు. దీంతో వృద్ధి గణాంకాలు కూడా కిందకి పడిపోయాయి. అధికారిక డేటా  ప్రకారం.. వరుసగా మూడో క్వార్టర్ కూడా ఇండియన్ ఎకానమీ నెమ్మదించింది. గ్రామీణ భారతం ఆందోళనకరంగా ఉండటంతో, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్‌‌ఎంసీజీ) కంపెనీలపై ప్రభావం పడుతోంది. హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్ వంటి నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి. గ్రామీణ డిమాండ్ తక్కువగా ఉండటంతో టూవీలర్స్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఇప్పటికే ఆటో సెక్టార్ కుదేలై ఉంది. ఇండియన్ ఎకానమీ పడిపోతోందని.. ఎన్‌‌బీఎఫ్‌‌సీ, రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌తో ఇది ప్రారంభమై.. ఆటో, వినియోగ రంగానికి ఇది తాకిందని యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు.  ఎన్నో వ్యాపారాలు మూతపడ్డాయన్నారు. జూన్ కోర్ సెక్టార్ గ్రోత్ కూడా 2015 నాటికి కనిష్టాలకు పడిపోయినట్టు గణాంకాలు చెప్పాయి.2019 తొలి ఆరు నెలల కాలానికి సంబంధించి విడుదలైన ఆర్‌‌‌‌బీఐ డేటాలో.. ఇండియన్ బ్యాంక్‌‌లు గత ఐదేళ్లలో అత్యంత తక్కువ స్థాయిలో రిటైల్ లోన్లను జారీ చేశాయి. బలహీనమైన కన్‌‌సప్షన్ డిమాండ్, పెరుగుతోన్న నిరుద్యోగం వంటి ఆందోళనలతో రుణాలు జారీ చేయడం  కూడా తగ్గిపోయిందని ఆర్‌‌‌‌బీఐ డేటా పేర్కొంది. రిటైల్‌‌ వ్యక్తిగత రుణాలను జారీ చేసే వృద్ధి 2019 హెచ్‌‌1లో(జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో) 7.3 శాతంగా ఉంది. ఇది గతేడాది తొలి ఆరు నెలల కాలంలో 7.7 శాతంగా ఉండేది. 2017లో 8.6 శాతంగా ఉంది. అంటే ఈ రుణాల వృద్ధి ఏ మేర  పడిపోయిందో ఇక్కడే చూడొచ్చు.