కోరుట్ల కాంగ్రెస్‌‌లో టికెట్​ ఫైట్..​నియోజకవర్గం నుంచి ఐదుకిపైగా దరఖాస్తులు

కోరుట్ల కాంగ్రెస్‌‌లో టికెట్​ ఫైట్..​నియోజకవర్గం నుంచి ఐదుకిపైగా దరఖాస్తులు
  •     వివిధ కార్యక్రమాలతో ఇప్పటికే జనాల్లోకి జువ్వాడి, సుజిత్‌‌రావు
  •     టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్న జ్యోతక్క, కరంచంద్, శ్రీనివాస్‌‌రెడ్డి
  •     హైకమాండ్‌‌కు తలనొప్పిగా మారిన వర్గపోరు

జగిత్యాల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కోరుట్ల కాంగ్రెస్‌‌లో టికెట్​ఫైట్​షురూ అయింది. నియోజకవర్గం నుంచి ఐదుగురికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో జువ్వాడి నర్సింగరావు పోటీచేసి ఓడిపోగా, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల సుజిత్‌‌రావు పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టికెట్ ఆశించి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు భంగపడ్డారు. ఇప్పడు ఆయన లేకపోయినా(చనిపోయారు) భార్య కొమిరెడ్డి జ్యోతక్క, కొడుకు కొమిరెడ్డి కరంచంద్ పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. 

టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెట్‌‌పల్లి జడ్పీటీసీ కాటిపెల్లి రాధ భర్త శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఆశావహుల సంఖ్య ఐదుకు చేరింది. నియోజకవర్గ ఇన్‌‌చార్జి జువ్వాడి పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకోగా, సుజిత్‌‌రావు ఇప్పటికే గడప గడపకు కాంగ్రెస్ మొదలుపెట్టారు. దీంతో క్యాడర్‌‌‌‌లో కన్‌‌ఫ్యూజన్​ నెలకొంది. 

వర్గపోరుతో సతమతం 

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జువ్వాడి నర్సింగరావు విద్యాసాగర్‌‌‌‌రావు చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమికి కొమిరెడ్డి రాములుతోపాటు పార్టీలో వర్గపోరే కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. 
ప్రస్తుతం రాములు భార్య కొమిరెడ్డి జ్యోతక్క, కల్వకుంట్ల సుజిత్‌‌రావు వర్గాలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైకమాండ్​ తమకే  టికెట్​ఇస్తుందని ప్రచారం చేసుకుంటునారు. మరోవైపు మూడు నెలల కింద జువ్వాడికి టికెట్ రాకపోతే జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థిని గెలవనీయమని ఆయన అనుచరులు మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది. 

దీంతో వ్యతిరేక వర్గం జువ్వాడి దిష్టిబొమ్మలు దహనం చేశారు. అదే టైంలో ధర్మపురి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డి టికెట్​రాకపోతే కాంగ్రెస్​అభ్యర్థులను ఓడగొడుతావా అని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరిని ఉద్దేశిస్తూ జువ్వాడికి చురకలు అంటించినట్లు సమాచారం.  

టికెట్ దక్కిన అభ్యర్థికి సహకరించేనా 

టికెట్​ఎవరికి దక్కినా మిగతావారు నారాజ్​అయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థికి మిగతా నలుగురు సహకరిస్తారో లేదోనన్న టెన్షన్​పట్టుకుంది. కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు, కొమిరెడ్డి రాములు క్యాడర్ ఉన్న నేతలు కాగా రాములు ఇటీవల చనిపోవడంతో క్యాడర్ దెబ్బతిన్నట్లు టాక్​నడుస్తోంది. ఈ క్రమంలో టికెట్​పోటీ జువ్వాడి నర్సింగరావు, కల్వకుంట్ల సుజిత్ రావు మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. 

గత రెండు ఎన్నికల్లోనూ జువ్వాడి గెలుపు దగ్గరికి వచ్చి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలుస్తారని ఆయన వర్గం వాదిస్తోంది. కాగా ఆయనకు రెండు సార్లు అవకాశం ఇచ్చినా గెలవలేదని, ఈసారి సుజిత్‌‌రావును బరిలో దింపాలని ఆయన వ్యతిరేక వర్గం హైకమాండ్‌‌ను కోరుతోంది. ఈక్రమంలో ఆశావహులను బుజ్జగించే విషయంపై హైకమాండ్ కు తలపోటు తప్పేలా లేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.