పారాలింపిక్స్​ 2020లో భారత్ నుంచి ఏకైక ఉమన్ ఆర్చర్

పారాలింపిక్స్​ 2020లో భారత్ నుంచి ఏకైక ఉమన్ ఆర్చర్

పట్టుదలతో విల్లు పట్టి..

తన గారాల పట్టిని ​వాలీబాల్​ ప్లేయర్​గా చూడాలనుకున్నాడు ఓ తండ్రి. కానీ, చిన్నతనంలో జరిగిన ఒక పొరపాటు వల్ల ఆ చిన్నారి కాలికి పోలియో సోకింది. అయితేనేం, ఆ తండ్రీ కూతుళ్ల ఆశయం అంతటితో ఆగిపోలేదు. తండ్రి ప్రోత్సాహంతో పడి లేచిన కెరటంలా ఆర్చరీ విభాగంలోకి అడుగుపెట్టింది. ఆగస్ట్ 27న టోక్యోలో జరగబోతున్న పారాలింపిక్స్​ 2020లో మనదేశం తరపున ఏకైక ఉమన్ ఆర్చర్​గా బరిలోకి దిగబోతోంది. ఆమె... ఉత్తరప్రదేశ్​కి చెందిన 27 ఏళ్ల జ్యోతి బలియాన్.

ఉత్తరప్రదేశ్​లోని గొయెలా...  జ్యోతి సొంతూరు. వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. నాన్న బలియాన్​కి స్పోర్ట్స్​ అంటే ఇష్టం. ఆ ఇంట్రెస్ట్​తోనే తన కూతురుని వాలీబాల్​ ప్లేయర్​గా చూడాలనుకున్నాడు. తండ్రి కలని నిజం చేయడానికి చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. కానీ, ఉన్నట్టుండి జ్యోతి తన పదో యేట జబ్బుపడటంతో ఇంజెక్షన్​ చేయించారు. దానికి రియాక్షన్​ వచ్చి, కాలికి పోలియో సోకింది. దాంతో తండ్రీ కూతుళ్ల ఆశయానికి బ్రేక్​ పడినట్లయింది. అయినా సరే పట్టుదల వదల్లేదు. ‘వాలీబాల్​ కాకపోతే వేరే స్పోర్ట్ ఆడొచ్చు. కాలు బాగోలేకపోతేనేం, చేతులతో ఆడే ఆటలున్నాయి కదా!’ అని ఎంకరేజ్​ చేశాడు తండ్రి. మొదట వద్దని చెప్పినా ఆ తర్వాత నాన్న ఎంకరేజ్​మెంట్​తోనే ముందడుగు వేసింది జ్యోతి. 

నెలరోజుల ప్రాక్టీస్,​ జీవితాన్నే మార్చేసింది!
​స్పోర్ట్స్​ అకాడమీకి దగ్గర్లో  ఉంటుందని జ్యోతిని వాళ్ల మామ ఇంటికి పంపించాడు బలియాన్. కానీ, ఆ వాతావరణం జ్యోతికి నచ్చలేదు. ఇంటికి వెళ్లి పోదామనుకుంది. అయితే ఆ విషయం తెలిసిన ఆమె కోచ్​, ‘ఇంకో నెల రోజుల్లో నేషనల్​ గేమ్స్​ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు కోచింగ్ తీసుకో. గెలవకపోతే అప్పుడు నువ్వు వెళ్లిపోవచ్చు’ అన్నాడు. ఆయన మాట విని, నెల రోజులు  ప్రాక్టీస్ చేసి, పెర్ఫామ్​ చేసింది. నేషనల్​ గేమ్స్​లో ఛాంపియన్​గా నిలిచి, కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకుంది. ఆ రిజల్ట్ చూసి తనను తానే నమ్మలేకపోయింది జ్యోతి. అదే తన జర్నీ​కి బిగినింగ్​ పాయింట్. ​ ​అప్పటినుంచి ఆమె మనసు పెట్టి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది. జ్యోతి వాళ్ల నాన్న​ లక్ష రూపాయలు లోన్​ తీసుకుని, కూతురికి ఆర్చరీ ఎక్విప్​మెంట్ కొనిచ్చాడు. అలా జ్యోతి 2011, 2012 సంవత్సరాల్లో జరిగిన నేషనల్ గేమ్స్​లో గోల్డ్ మెడల్స్​ సాధించింది. దేశవ్యాప్త గుర్తింపుతోపాటు, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్​లో పాల్గొనే ఛాన్స్​ దక్కింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు జ్యోతి. 2014 ఏసియన్​ గేమ్స్​లో మొదటి ఇండియన్​ పారాఆర్చర్​గా అడుగుపెట్టి అద్భుతమైన ప్రదర్శన చేసి తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2017లో వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో గెలిచింది. 2019లో ఏసియన్​ పారా ఛాంపియన్​షిప్​లో సిల్వర్​ మెడల్​ సొంతం చేసుకుంది.