జనం కోసం ఎన్ని మాటలన్నా భరిస్తున్నం

జనం కోసం ఎన్ని మాటలన్నా భరిస్తున్నం
  • క్యాంటీన్​లో ఫొటోలు దిగి బయటికొచ్చి ఫోజులిస్తున్నరని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎంపీలపై సంజయ్‌‌‌‌ ఫైర్
  • బీజేపీ నేతలు అనరాని మాటలు అంటున్నరని కేకే మండిపాటు
  • ప్లకార్డులు చించి వాకౌట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీలు గురువారం లోక్ సభలో పరస్పరం విమర్శలకు దిగారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మాట్లాడేందుకు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. ఆయన మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. వెనక సీట్లలో ఉన్న బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ టీఆర్ఎస్ ఎంపీలపై, వారి ఆందోళనలపై విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్ సర్కారే విఫలమైందన్నారు. యాసంగి పంటను కొనబోమని కేంద్రం తరఫున ఎవరు చెప్పారంటూ టీఆర్ఎస్ ఎంపీలను నిలదీశారు. ‘‘పార్లమెంట్ క్యాంటీన్లో ఫొటోలు దిగి పోతున్నరు. బయటికి పొయ్యి, ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నమంటూ మీడియాకు పోజులిస్తున్నరు” అంటూ టీఆర్ఎస్ ఎంపీల తీరుపై విమర్శలు చేశారు. ‘ఈ డ్రామాలు ఆపండి’ అంటూ తోటి ఎంపీ సోయం బాపురావుతో కలిసి సంజయ్ నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు గొడవకు దిగారు. ‘‘స్పీకర్ మా మైక్ కట్ చేస్తున్నడు. సంజయ్ మమ్ముల తిడుతున్నడు” అంటూ ఫైరయ్యారు. సభలో కాసేపు గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్, రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య తిట్ల పురాణం సాగింది. టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు చించి వెల్‌‌‌‌లోకి విసిరారు. అనంతరం నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు.

జనం కోసం భరిస్తున్నం: కేకే
రాష్ట్ర బీజేపీ ఎంపీలు తమను అనరాని మాటలంటున్నారని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల కోసం, ప్రజల కోసం అవన్నీ భరిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వానాకాలం పంటలో రాష్ట్ర అవసరాలకు పోను మిగతా ధాన్యమంతా కొంటామని కేంద్ర మంత్రులు పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ‘‘4 రోజులుగా పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పట్టించుకుంటలేదు. అందుకే వాకౌట్ చేసినం. మేమేమీ సంతోషంతో వెల్లోకి పోతలేం. బాధతోనే ఆందోళన చేస్తున్నం. గతేడాదికి సంబంధించి రాష్ట్రం కాడున్న బాయిల్డ్ రైస్ తో పాటు ఈ వానాకాలంలో రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిందంతా కేంద్రమే కొనాలె. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు కనీసం మూడేళ్లు పడ్తది. అప్పటిదాకా టైమియ్యాలె” అన్నారు.

కిషన్ మీటింగ్ పెడ్తే వస్తం
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రాన్ని కేంద్రం మల్టీ లెవల్స్ లో ఇబ్బంది పెడుతోందని నామా ఆరోపించారు. ‘‘రాష్ట్ర రైస్ మిల్లులకు నెలకు 8 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉంటే 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికే అనుమతిస్తున్నరు. ఈ మిల్లుల్లోని బియ్యాన్ని ఎఫ్‌‌‌‌సీఐ సకాలంలో సేకరిస్తలేదు. బియ్యాన్ని తరలించేందుకు రైల్వే ర్యాకులు అందుబాట్ల లెవ్వు. పంటను కల్లాల్లోనే కొంటమని చెప్పిన బీజేపీ ఎంపీ సంజయ్ పార్లమెంటులో ఎందుకు మాట్లాడ్తలేడు?’’ అని ప్రశ్నించారు. రైతు సమస్యలపై తమ ఎంపీల పోరాటంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నేతలు కలిసి రావాలన్నారు. గురువారం చాన్సిచ్చినట్టే ఇచ్చి మైక్ కట్ చేశారన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని మీటింగు పెడితే పాల్గొనడానికి తాము సిద్ధమన్నారు. లేదంటే సంబంధిత మంత్రి ద్వారా పార్లమెంటులో ఆయనే ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.