ప్రచారం కోసం టీఆర్ఎస్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టింది: కేఏ పాల్

ప్రచారం కోసం టీఆర్ఎస్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టింది: కేఏ పాల్

హైదరాబాద్: మునుగోడు ప్రచారం కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మునుగోడులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, మునుగోడు ఎన్నికను వాయిదా వేయాలంటూ పాల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి  ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు మునుగోడు ఓటర్లను ప్రలోభపెడుతన్నారని ఆయన మండిపడ్డారు.

టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్  కూడా విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయని పాల్ ఆరోపించారు. ఒక్క నామినేషన్ ప్రక్రియ కోసమే ప్రధాన పార్టీలు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశాయని పాల్ అన్నారు. ఒక్కో ఓటరుకు 30 వేల నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు డబ్బు ఆశ చూపుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని పాల్ ప్రశ్నించారు. 

తమ పార్టీ( ప్రజాశాంతి) ఇన్ యాక్టివ్ లో ఉందంటూ సెప్టెంబర్ 13న నోటీసులు వచ్చాయని, వివరణ కోసం అక్టోబర్ 13 వరకు గడువిచ్చారని పాల్ తెలిపారు. అయితే తాము వివరణ ఇవ్వడానికి ముందే అక్టోబర్ 3న ఈసీ మునుగోడు బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇది చట్ట విరుద్ధమని పాల్ చెప్పారు. 2022 జనవరి 1 వరకు ఉన్న ఓటర్ల జాబితానే ఫైనల్ అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెబుతోంటే... రాష్ట్రంలోని ఈసీ అధికారులు మాత్రం కొత్త ఓటరు దరఖాస్తుకు 2022 అక్టోబర్ 4 వరకు గడువు విధించడమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయాలని కేఏ పాల్ ఈసీని కోరారు.