గురుద్వారాపై ఐసిస్ ఉగ్ర‌దాడి: 25 మంది మృతి

గురుద్వారాపై ఐసిస్ ఉగ్ర‌దాడి: 25 మంది మృతి

అఫ్ఘానిస్థాన్ రాజ‌ధాని కాబూల్ లో ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థ దాడికి పాల్ప‌డింది. గురుద్వారాలో ప్రార్థ‌న‌లు చేస్తున్న సిక్కుల‌పై ఓ ఉగ్ర‌వాది ఉన్న‌ట్టుండి తుపాకీతో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో 25 మందికి పైగా మ‌ర‌ణించార‌ని తెలుస్తోంది. ఈ అటాక్ జ‌రిగిన వెంట‌నే పోలీసులు రియాక్ట్ అయ్యార‌ని, దాడిని తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగార‌ని అఫ్ఘాన్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ఏ ఉగ్ర‌వాద సంస్థ కూడా తాము దాడికి పాల్ప‌డిన‌ట్లు ప్ర‌క‌టించ‌లేదు. అయితే కొద్ది గంట‌ల త‌ర్వాత ఈ దాడితో త‌మకు సంబంధం లేద‌ని తాలిబ‌న్ ఉగ్ర‌వాద సంస్థ ట్వీట్ చేసింది. ఆ త‌ర్వాత ఈ దాడి తామే చేశామ‌ని ఐసిస్ ప్ర‌క‌టించింది.

గురుద్వారా నుంచి ఎంపీకి ఫోన్

గురుద్వారాపై ఉగ్ర‌దాడి జ‌రిగిన వెంట‌నే త‌న‌కు లోప‌ల ఉన్న ఓ భ‌క్తుడు ఫోన్ ద్వారా స‌మాచారం ఇచ్చాడ‌ని తెలిపారు అఫ్ఘాన్ పార్ల‌మెంట్ స‌భ్యుడు న‌రింద్ర సింగ్ ఖ‌ల్సా. తాను వెంట‌నే పోలీసుల‌కు ఈ విష‌యం తెలియ‌జేశాన‌ని, స‌హాయం చేసేందుకు వారితో పాటు అక్క‌డికి చేరుకున్నాన‌ని చెప్పారాయ‌న‌. అటాక్ జ‌రిగిన స‌మ‌యంలో గురుద్వారా లోప‌ల 150 మంది భ‌క్తులు ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు.