అనగనగా ఒక ఊరు : పైసా లేకున్నా.. బతికేయొచ్చు

అనగనగా ఒక ఊరు : పైసా లేకున్నా.. బతికేయొచ్చు

ఎటు చూసినా కనుచూపు మేర సముద్రం. దాని ఒడ్డును ఆనుకుని ఉన్న కొంత భూభాగంలో కొన్ని ఇళ్లు కనిపిస్తాయి. పైసా లేకున్నా హాయిగా బతకొచ్చు ఇక్కడ. ఆ ఊరి పేరు కైకౌర. ఇక్కడ ఉండడానికి గూడు, తినడానికి తిండి దొరుకుతుంది. అందుకే అక్కడికి వెళ్లిన వాళ్లలో చాలామంది తిరిగి వేరే చోటుకి వెళ్లలేకపోయారు. వందల ఏండ్లు అంటే.. ఎన్నో తరాలు అక్కడ బతికాయి. ఇప్పుడు అదో టూరిస్ట్​ ప్లేస్​. అయితేనేం కైకౌర వెళ్తే మనసుకు హాయిగా ఉంటుంది. సముద్రంలో ఎగురుతూ అల్లరి చేసే డాల్ఫిన్లు, వేల్స్​ని చూస్తూ ఎంజాయ్​ చేయొచ్చు. 

కైకౌర.. ఈ ఊరు క్రైస్ట్​ చర్చ్​ అనే పెద్ద నగరానికి దాదాపు180 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కైకౌర అంటే మవొరి భాషలో ‘క్రేఫిష్​ని తినడం’ అని అర్థం​. న్యూజిలాండ్​లోని సౌత్​ ఐలాండ్​లో తూర్పు తీరంలో అంటే.. పెనిన్​సుల అనే ద్వీపకల్పంలో ఉంది ఈ ఊరు. ఇక్కడ ఉండటానికి, తినడానికి ఎటువంటి సమస్యా ఉండదు. అందుకే వందల ఏండ్లుగా మవొరి ప్రజలు అక్కడ ఉండగలిగారు. మవొరి ప్రజలు మొదట్లో గుహల్లో ఉండేవాళ్లు. తిండి కోసం అక్కడ కనిపించే మొవ అనే పక్షుల్ని వేటాడేవాళ్లట.

1850లో అక్కడ ఒక గుహలో ఒక కళేబరం కనిపించింది. చూసేందుకు అది ఒక మనిషి తన చేతిలో పెద్ద సైజులో ఉన్న మొవ పక్షి గుడ్డు పట్టుకున్నట్టు ఉంది. మొవ ప్రజల సంఖ్య తగ్గిపోయేకొద్దీ వాళ్లు కొండలపైన ఇళ్లు కట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడ జరిగిన యుద్ధాల్లో ఆ ప్రాంతాన్ని వేరే వాళ్లు ఆక్రమించుకున్నారు. మవొరితో పాటు పకేహ తెగ ప్రజలు కూడా కైకౌరలో ఉండేవాళ్లు. 

వేల్స్​ని చూడాలంటే..

వేల్స్​ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అందుకని అక్కడ వేల్స్ ఇండస్ట్రీ యూరోపియన్లను అట్రాక్ట్ చేసింది. ఇప్పటికీ అక్కడ వేల్స్​ని చూడడం ఒక బిజినెస్! వేల్స్ నుంచి ఆయిల్స్, లూబ్రికెంట్స్ వంటి ప్రొడక్ట్​లు తయారుచేస్తారు. వాటికోసం వాటిని వేటాడతారు.1850ల కాలం వేల్స్ ఇండస్ట్రీకి స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఆ టైంలో ఎక్కువగా వాటిని వేటాడారు. దాంతో వేల్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది కూడా ఆ టైంలోనే. 

కైకౌర విషయానికొస్తే.. సముద్రం ఒడ్డు నుంచి కొంచెం ముందుకెళ్తే లోతు ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ వేల్స్​ని చూడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ప్రత్యేకంగా వేలింగ్​ స్టేషన్స్ ఉంటాయి. వాళ్ల దగ్గర కయకింగ్​ చేసే బోట్​ తీసుకుని సముద్రంలోకి వెళ్లాలి. ఈ పద్ధతి1843లో మొదలైంది. రాబర్ట్​ ఫిఫె అనే వ్యక్తి మొదటి సారి వేలింగ్​ స్టేషన్​ ఏర్పాటు చేశాడు. అలాగే ‘ఫిఫె హౌస్’ కూడా ఉంది ఇక్కడ. దీన్ని జార్జ్ ఫిఫె1860లో కట్టాడు.

నడక దారిలో వెళ్లేటప్పుడు కనిపిస్తుంది. ఈ హౌస్​ చారిత్రక ప్రదేశాల్లో ఒకటిగా, ట్రస్ట్ ప్రాపర్టీగా నిలిచింది. దీన్ని విజిట్​ చేసేందుకు వీలుగా ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. వేలింగ్ ఇండస్ట్రీకి ఒత్తిడి పెరగడం వల్ల1850 తర్వాత నుంచే ఇక్కడున్న వేల్స్ సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడైతే వాటిని బాగానే కాపాడుతున్నారు. కైకౌర అనేది వేల్స్​కి సేఫ్​ ఎన్విరాన్​మెంట్​కి కేరాఫ్​గా మారింది. అలాగే అంతర్జాతీయంగా వేల్​ వాచింగ్ లొకేషన్​ ( వేల్స్​ని చూసే ప్రదేశం)గా పేరుగాంచింది.

చాలా ఏండ్లు పోర్ట్​లోకి వెళ్లడానికి అధికారికం​గా పర్మిషన్​ ఉండేది కాదు. పోర్ట్​ని 1931లో మూసేశారు కూడా. ఆ తర్వాత1945లో క్రైస్ట్ చర్చ్​ నుంచి పికాన్​కి వెళ్లేందుకు 21 టన్నెల్స్​తో రైలు మార్గం వేశారు. అన్ని గ్రామాల్లానే కైకౌర కూడా ఆర్థికం​గా1980 వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత నుంచి విజిటర్స్ పెరగడం, వేల్స్​ సంరక్షణ చూసుకోవడం వంటి పనుల కోసం ఉద్యోగావకాశాలు పెరిగాయి. 

మవొరి కల్చర్​

అసలైన మవొరిలు కైకౌరని ‘తె కొహ ఒ మరొకుర’ అని పిలుస్తారు. అంటే మరొకుర ఇచ్చిన గిఫ్ట్​ అని అర్థం. మరొకుర అంటే మవొరీలు ఆరాధించే దేవుడు. మాయా ఖడ్గంతో ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. మరొకుర కూడా నీటి అడుగున కందకాలు, లోయల ఆకారంలో చెక్కారు. అందువల్ల ఆ సముద్రంలో నివసించే డాల్ఫిన్స్, వేల్స్, మిగతా జీవరాశులకు నివాసాలుగా మారి వాటిని సంరక్షిస్తున్నాయని నమ్ముతారు. తిండి, నివాసానికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో 900 ఏండ్లకు పైగా మవొరిలు ఇక్కడ నివసించారు.

వీళ్లే కాకుండా ‘వెయితహ’, ‘కటి మమొ’ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ రెండు తెగలు 350 ఏండ్ల కిందటి వరకు కలిసిమెలిసి ఉన్నాయి. ఆ తర్వాత ‘ఎన్​గయ్ తహు’ తెగలోని సబ్ ట్రైబ్​ అయిన ‘ఎన్​గటి కురి’ ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చారు. అంతకుముందు ‘వెయితహ’, ‘కటి మమొ’ మధ్య జరిగిన పోరాటాల్లో వాళ్లు సొంతం చేసుకున్న భూములన్నీ చివరికి ‘ఎన్​గటి కురి’ ప్రజలకు దక్కాయి. ఎలాంటి యుద్ధాలు చేయకుండా ప్రశాంతంగా భూమిని సొంతం చేసుకున్నవాళ్లుగా మవొరి చరిత్రలో వీళ్లు నిలిచిపోయారు.

ఇప్పుడు కైకౌర పక్కనే మూడు రకాల ట్రైబ్స్​ ఉన్నాయి. వాళ్లంతా డిఫరెంట్​ కల్చర్స్​తో జీవిస్తుంటారు.  కైకౌరని ఇప్పుడు ‘తె అహి కైకౌర ఎ తమ కి తె రంగి’ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు ఈ మధ్య. తమ కి తె రంగి అనేది ఒక వ్యక్తి పేరు. అతను తన భార్యలను వదిలించుకోవడానికి ఈ ప్రదేశానికి వచ్చాడని సౌత్​ ఐలాండ్​లోని పడమటి తీరం​లో చెప్పుకునే కథ. 

పూర్వ వైభవం

కైకౌరలో 2016లో భూకంపం వచ్చి ఆ ప్రాంతం చాలా దెబ్బతింది. అయితే దీన్ని తిరిగి కట్టడంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన చిన్న గ్రామాల్లో ఒకటి. ఇక్కడ కొండల మీద వంకలు తిరిగిన రహదారిలో వెహికల్స్​ వెళ్తాయి. 

సీల్ కాలనీ 

ఈ కాలనీనే ‘ఒహవు పాయింట్ కాలనీ’ అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో ఎటు చూసినా సీల్స్​ కనిపిస్తాయి. వాటిలో కొన్ని సముద్రంలో తిరుగుతూ, ఒడ్డున ఉన్న రాళ్లపై సేదతీరుతూ కనిపిస్తాయి. 

ఆర్కియాలజీ ప్రకారం ‘మొవ’ అనే పక్షిని వేటాడిన ఆనవాళ్లు ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత ఆ పక్షుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కానీ, కైకౌర మాత్రం అట్రాక్టివ్​ ప్లేస్​గా మారింది. ఇక్కడున్న లావెండర్ గార్డెన్ చాలా బాగుంటుంది. వింటర్​ సీజన్​లో మాత్రమే ఇక్కడికి వెళ్లేందుకు పర్మిషన్​ ఉంటుంది. డిసెంబర్​ నుంచి జనవరి బెస్ట్​ సీజన్​. హైదరాబాద్​ నుంచి కైకౌరకు నేరుగా వెళ్లేందుకు విమాన మార్గం ఉంది. కైకౌర ఎయిర్​పోర్ట్​లో దిగి అక్కడి నుంచి ట్యాక్సీలో టూర్​ చేయొచ్చు. 

లోబ్​స్టర్ కెఫె

కైకౌర నుంచి ఉత్తరం వైపు అరగంట ప్రయాణం చేస్తే లోబ్​స్టర్ కెఫె కనిపిస్తుంది. అక్కడ రుచికరమైన లోబ్​స్టర్(ఎండ్రకాయ)​ ఫుడ్​ వెరైటీలు దొరుకుతాయి. ఆ కెఫె సముద్రం ఒడ్డున ఉంటుంది. అందుకని టేస్టీ ఫుడ్​ని సముద్రపు అలలను చూస్తూ ఎంజాయ్​ చేస్తుంటారు.