పేదల గుడిసెల్లో దీపం..కాకా యాదిలో

పేదల గుడిసెల్లో దీపం..కాకా యాదిలో

బహుజనుల ఆత్మగౌరవ ప్రతీకగా, కార్మిక పక్షపాతిగా నిఖార్సయిన రాజకీయ జీవితం కాకాది. ఎంత ఎదిగినా ఆయన తన మూలాలను ఎన్నడూ మరిచిపోలేదు. నాయకుడు ఎలా ఉండాలో, ప్రజలతో ఎలా నడవాలో ఆయన జీవితమే ఒక పాఠం. ఇప్పుడు అలాంటి రాజకీయ విలువలు అంతరించిపోతున్న విషయం తెలిసిందే. బహుజనుల గొంతుకగా సుమారు75 వేల మందికి హైదరాబాదులో గుడిసెలు వేయించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపి, వారి గుడిసెల్లో దీపం అయ్యారు గడ్డం వెంకటస్వామి. కులం గోడలు అడ్డుగా ఉన్నా అట్టడుగు నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగారు. రాష్ట్రపతి పదవి ఆయనను వరించాల్సి ఉన్నా, వెంట్రుకవాసిలో తప్పిపోయింది. అయితే ఆ స్థాయిలో తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మారుమోగిన పేరు కాకా వెంకటస్వామిదే. నిజాం వ్యతిరేక పోరాట యోధుడిగా, కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా, కార్మిక చట్టాల రూపకర్తగా కాకా సేవలు మర్చిపోలేనివి. సామాజిక స్పృహలేని సమాజంలో దళిత బహుజనుల గొంతుకగా, దళిత పోరాటాలు నిర్వహించి, వారికి తోడుగా నిలబడ్డారాయన. చుండూరు, కారంచేడు ఉద్యమాల్లో ముందుండి పోరాటం చేశారు కాకా. దళిత ఉద్యమాలకు పునాది అయ్యారు, దళిత బహుజనులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేశారు. 

తెలంగాణ కోసం పార్లమెంట్​లో గొంతెత్తి

తెలంగాణ ప్రజలపై సాగుతున్న దమనకాండను నిరసిస్తూ 1969 ఆగస్టు18న కాకా పార్లమెంట్ లో బలమైన వాణి వినిపించారు. చనిపోయిన అమరుల ఫొటోలను పట్టుకుని నిరసన తెలిపారు. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని, వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. “నెత్తురు ఏరులై పారుతున్న తెలంగాణ నుంచి వచ్చినం. తుపాకీ గుండ్లను తప్పించుకుని వచ్చినం. ఇప్పటికే 250 మంది ఉద్యమకారులను కాల్చి చంపిన్రు. ఈ రాక్షసకాండను ఖండిస్తున్నం. మాపై వలసవాదుల పెత్తనం వద్దు. మేం ఎవరికీ బానిసలం కాదు” అంటూ ఆయన గొంతెత్తారు. తెలంగాణ కోసం ఇంతగా కొట్లాడిన కాకా.. చివరకు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటును కండ్లతో చూసిన తర్వాతే కాలం చేశారు.

కార్మికుల జీవితాల్లో..

కాకా కేంద్ర మంత్రిగా దేశంలో ఆయన కార్మికుల కోసం అనేక సంస్కరణలు, చట్టాల రూపకల్పనకు కృషి చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే రేషన్​ బియ్యం పంపిణీ ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి కాకానే. నిజాం వ్యతిరేక, తెలంగాణ పోరాటాల్లో.. ఆయన అనేకసార్లు జైలుకెళ్లారు. కొన్నిసార్లు చావు అంచుల వరకు వెళ్లి వచ్చినా ఎక్కడా, తన పోరాట పటిమను తగ్గించలేదు.  కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మూతపడిన అనేక పరిశ్రమలను తెరిపించారు. కాకా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కార్మికుల కోసం పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులు, కూలీలకు ముసలితనంలో భద్రత ఇవ్వాలన్నదే ఈ స్కీం ఉద్దేశం. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకున్నట్లే.. కార్మికుడు కూడా తీసుకోవాలనే ఆలోచనతో కాకా అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ను ఒప్పించి పార్లమెంట్​లో బిల్లు పెట్టేంత వరకు పట్టువదల్లేదు. పెన్షన్​ స్కీం వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నేషనల్​ లేబర్​ ఆర్గనైజేషన్​ కాకాను జెనీవాకు ఆహ్వానించింది. 1995లో బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ స్కీం రూపొందించిన ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. 

జీవితం ఒక పోరాటంగా..

తాను చదువుకోకున్నా, పిల్లలకు మంచి చదువులు చెప్పించటానికి కాకా వెనుకాడలేదు. తాను ఇంగ్లీష్​ నేర్చుకోవడానికి ఎలాంటి మొహమాటం పడేవారు కాదు ఆయన. 1950లో మొదటిసారి అంబేద్కర్ ను కలిసినప్పుడు ‘వెంకటస్వామి.. నీకున్న పేరుతో దళితులు, పేదలకు ఉన్నత చదువులు అందించే ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు?’ అని ప్రశ్నించారట. అట్టడుగువర్గాలకు చదువు అందించాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు కాకా. అదే స్ఫూర్తితో, రాజకీయాల్లో బిజీగా ఉన్నా, తన ఆలోచనలకు రూపం ఇచ్చారు. 1973లో బాగ్ లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీని ప్రారంభించి ఎంతో మందికి విద్యనందిస్తున్నారు. అందుకే ఆయన జీవితం ఒక పోరాటం. ఆయన నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పేదవాళ్లు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆయన ఆశయం నేరవేరాలని ఆశిద్దాం. 

- పిల్లి సుధాకర్, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మాల మహానాడు