
కాశీబుగ్గ, వెలుగు: పుట్టిన ప్రతి బిడ్డకి తల్లిపాలు అమృతంతో సమానమని వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సంధ్య తెలిపారు. మంగళవారం వరంగల్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, కూరపాటి ఆస్పత్రి సౌజన్యంతో కాకతీయ మెడికల్ కళాశాల సేవార్థ్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా 4 కిలో మీటర్ల వాకథాన్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ శిశువులకు అమ్మ పాలను మించిన పౌష్టికాహారం లేదన్నారు.
తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ ఇతరులకు సహాయ పడాలనే మనసున్న తల్లులు పాలను మిల్క్ బ్యాంక్‌లకు అందించాలని పిలుపునిచ్చారు. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) నిత్యం ఎంతో మంది శిశువులు ప్రాణాలతో పోరాడుతున్నారని తెలిపారు. ఇలాంటి వారికి తల్లిపాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ఈ వాకథాన్ కొనసాగింది.
కార్యక్రమంలో వరంగల్ అకాడమీ పీడియాట్రిక్స్ డాక్టర్ శ్రీరామ్ రెడ్డి, డాక్టర్లు అశోక్ రెడ్డి, అనిల్, కరుణాకర్, బలరాం నాయక్, సుమంత్, కూరపాటి రమేశ్, నవీన్, ప్రభాకర్ రెడ్డి, నవదీప్, సేవార్థ్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రవుఫ్, ఉపాధ్యక్షురాలు జి.అనన్య, ప్రధాన కార్యదర్శి సాయి సుధాంశ్ రెడ్డి, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.