అనుమతివ్వండి..ఆత్మార్పణ చేసుకుంటం : కేయూ స్టూడెంట్స్

అనుమతివ్వండి..ఆత్మార్పణ చేసుకుంటం : కేయూ స్టూడెంట్స్
  • వరంగల్ సీపీ ఆఫీస్ ఎదుట కేయూ స్టూడెంట్ల ఆందోళన
  • పీహెచ్ డీ అక్రమాలకు నిరసనగా విద్యార్థుల ర్యాలీ
  • కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకోవట్లేదని ఆవేదన 

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ పీహెచ్​డీ అడ్మిషన్లలో అక్రమాలపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వర్సిటీ స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ అక్రమాలకు నిరసనగా గాంధీ జయంతి రోజున తామంతా సామూహికంగా ఆత్మార్పణ చేసుకుంటామని, ఇందుకోసం పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ శనివారం వరంగల్ సీపీ ఆఫీస్ ఎదుట స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. 

ముందుగా కేయూ జంక్షన్ నుంచి సీపీ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. అలర్ట్ అయిన పోలీసులు కమిషనరేట్ బిల్డింగ్ ఎదుట భారీగా బలగాలను మోహరించారు. ర్యాలీగా సీపీ ఆఫీస్​కు చేరుకున్న దాదాపు వంద మంది విద్యార్థులు అక్కడే బైఠాయించి వీసీ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  దీంతో కమిషనరేట్ బిల్డింగ్ వద్ద కొద్దిసేపు హై టెన్షన్ వాతావరణం కనిపించింది. 

ఈ సందర్భంగా కేయూ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ తిరుపతి, ఏబీవీపీ నేత మాచర్ల రాంబాబు మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీలో ప్రతిభకు పాతరేసి, అక్రమాలకు పట్టం కట్టారని మండిపడ్డారు. పీహెచ్​డీ అడ్మిషన్లలో అర్హత గలిగిన విద్యార్థులను పక్కన పెట్టి వీసీ తాటికొండ రమేశ్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో సీటుకు రూ.లక్షల్లో వసూలు చేశారన్నారు. పీహెచ్​డీ అక్రమాలకు నిరసనగా కేయూలో 25 రోజులుగా దీక్షలు చేస్తున్నామని, ఇంతవరకు వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, డీన్ తమ డిమాండ్లను పరిష్కరించకపోగా.. ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని ప్రకటనలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

పీహెచ్​డీ అక్రమాలపై తగిన ఆధారాలతో వరంగల్ సీపీకి 5 రోజుల కిందట ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, తమకు ఆత్మార్పణమే శరణ్యమన్నారు. అక్టోబర్ 2న తామంతా ఆత్మార్పణ చేసుకుంటామన్నారు. అనంతరం ఆత్మార్పణకు పర్మిషన్ కోరుతూ సీపీ ఆఫీస్ గేట్ ఎదుట సీఐ షుకూర్​కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేయూ స్టూడెంట్​ జేఏసీ నేతలు నిమ్మల రాజేశ్, ఎం.కుమార్, ఎండీ పాషా, కే.ప్రసాద్, జనగాని జగదీశ్, ఎ.శంకర్, నాగరాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.