- చారిత్రక కట్టడాలను కాపాడేందుకు రూ. 42 కోట్లు ఇచ్చిన కేంద్రం
- ఆర్టిఫిషియల్ నిర్మాణాలకు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- హైదరాబాద్‍లో 300 ఏండ్ల నాటి బావులకు మోక్షం
- ఓరుగల్లులోని 800 ఏండ్ల కింది బావులపై నిర్లక్ష్యం
- ప్రపోజల్స్పంపినా పట్టించుకోని వైనం
వరంగల్, వెలుగు: కాకతీయుల పేరు చెబితే వీరోచిత పోరాటాలు, అద్భుత కట్టడాలు, ఆకట్టుకునే శిల్ప సంపద గుర్తొస్తాయి. కానీ నీటి పారుదల రంగంలో కాకతీయుల కృషి తక్కువేమీ కాదు. ముఖ్యంగా ఎలాంటి నది లేని ఓరుగల్లు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆ కాలపు ఇంజినీర్లు నిర్మించిన మెట్ల బావులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఎంత తోడినా తరగని జలసంపద ఈ బావుల సొంతం. 800 ఏండ్ల తర్వాత కూడా ఊట తగ్గింది లేదు. మూడేండ్ల క్రితం కార్పొరేషన్ సిబ్బంది ఒక బావిని పునరుద్ధరించే ప్రయత్నంలో రెండు, మూడు మోటర్లు పెట్టి మూడురోజులపాటు నీటిని తోడినా ఖాళీ చేయలేకపోయారు. ఇలాంటి విశాలమైన మెట్ల బావులు ప్రస్తుతం వరంగల్ సిటీలో పదుల సంఖ్యలో ఉన్నాయి. ఓరుగల్లును హెరిటేజ్ సిటీగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చారిత్రక కట్టడాలను కాపాడేందుకు హృదయ్ స్కీం కింద కోట్ల కొద్దీ ఫండ్స్ ఇస్తోంది. కానీ ఈ ఫండ్స్‌ను ఆర్టిఫిషియల్ నిర్మాణాలపై ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఒరిజినల్ కాకతీయ వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు చూపే ఇలాంటి బావుల పునరుద్ధరణపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఓరుగల్లులో 365 మెట్ల బావులు
వినుకొండ వల్లభరాయుడు 14వ శతాబ్దంలో రాసిన ‘క్రీడాభిరామం’లో కాకతీయులు ఓరుగల్లులో 365 మెట్ల బావులు తవ్వించినట్లు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇన్ని లేవు. ప్రతి వానబొట్టు వృథా కాకుండా 365 రోజులు నీరు నిల్వ ఉండేలా కోనేరులు, బావులను ఒక ప్లాన్ ప్రకారం తవ్వించారు. ఇందులో మెట్ల బావుల నిర్మాణాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఇవి ఆకర్షణగా ఉండడమే కాదు, ఎండాకాలంలో నీరు లోపలికి వెళ్లినా ప్రజలు సులువుగా కిందికి వెళ్లి తెచ్చుకునేలా నాటి సాంకేతిక పరిజ్ఞానంతో దిగుడు మెట్లు ఏర్పాటు చేశారు. 12,13వ శతాబ్దాల్లో నిర్మించిన ఈ కోనేరులు, బావులు ప్రస్తుత వరంగల్ సిటీ మధ్యలో ఉన్నాయి. ఇందులో శివనగర్ మెట్ల బావి, ఈసన్న బావి, అక్కాచెల్లెళ్ల బావి, సవతుల బావి, గడియారం బావి, జంగమయ్య బావి, కొత్తవాడ గోపాలస్వామి మెట్ల బావి, శృంగార బావి, పీరీళ్ల బావి, కరీమాబాద్ మెట్ల బావి, వెయ్యిస్తంభాల గుడి కోనేరు, ఉర్సు దర్గా బావి, కొండ మసీద్ బావి, తూర్పుకోట హనుమాన్ గుడి బావి, రామ్ లక్ష్మన్ ఏఎస్ఎం కాలేజ్ వద్ద బావి, రైస్ మిల్ బావి, హనుమకొండ కలెక్టర్ బంగ్లా బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ పట్టించుకునేవారు లేక అవన్నీ చెత్తతో నిండిపోతూ ఆనవాళ్లు కోల్పోతున్నాయి.
హెరిటేజ్సిటీ అంటే ఆర్టిఫిషియల్ నిర్మాణాలా?
కేంద్ర ప్రభుత్వం 2016, 2017, 2018లో వరుసగా వరంగల్ ను హెరిటేజ్ సిటీగా ప్రకటించింది. హృదయ్ పథకం ద్వారా ఖిలా వరంగల్ కోట, వెయ్యి స్తంభాలగుడి, రామప్ప ఆలయాలు, ఇతర చారిత్రక కట్టడాల అభివృద్ధికి రూ.42 కోట్ల నిధులు కేటాయించింది. కానీ ఇక్కడి ఆఫీసర్లు కాకతీయుల బావుల సంరక్షణకు ఇందులోంచి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఆమ్రపాలి వరంగల్ అర్బన్ కలెక్టర్‍గా ఉన్పప్పుడు ఈ బావుల సంరక్షణకు కొంత ఉత్సాహం చూపారు. రూ.కోటిన్నరతో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి ఫండ్స్ కోసం ట్రై చేశారు. నిధుల విడుదలకు సమయం పడుతుందని గ్రహించి.. మున్సిపల్ ఆఫీసర్లు, సిబ్బంది సహకారంతో మూడు బావుల్లోని చెత్తను తొలగించేలా చూశారు.
హైదరాబాద్‍లో చేస్తున్రు.. వరంగల్‌లో కావట్లే
రాష్ట్ర ప్రభుత్వం సిటీని డెవలప్ చేసే క్రమంలో భావితరాలకు కాకతీయ కళాసంపద అంటూ.. అర్టిఫిషియల్ పనులు, బొమ్మలకు రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లోని పదుల సంఖ్యల్లోని జంక్షన్లు, పార్కుల్లో సిమెంట్ కాకతీయ పిల్లర్లు, ఏనుగు బొమ్మలు, ప్రతి రూపాలకు ఫండ్స్ వెచ్చిస్తోంది. ఇవేవి పట్టుమని ఏడాది కూడా ఉండట్లేదు. ఇదే ప్రభుత్వంలోని హైదరాబాద్ టీఆర్‍ఎస్ లీడర్లు.. ఒక్క బన్సీలాల్‍పేట బావిలో 800 లారీల చెత్తను తొలగిస్తే.. వరంగల్ లీడర్లు మాత్రం 800 ఏండ్ల నాటి బావులను కాపాడుకోలేకపోతున్నారు.
రూ. కోటిన్నరతో బావులను కాపాడొచ్చు
800 ఏండ్ల నాటి వారసత్వ సంపద వరంగల్ సిటీ సొంతం. దాదాపు 15 బావులు ఇప్పటికీ మన మధ్యనే ఉన్నయ్. వీటిని భావితరాలకు అందించడానికి మహా అయితే కోటిన్నర ఫండ్స్ చాలు. ఇదే విషయమై గడిచిన నాలుగైదేండ్లలో నలుగురు కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు పలుసార్లు రిక్వెస్ట్ చేసినా.. లెటర్లు ఇచ్చినా ఫలితం లేదు. ఎదురుగా నిజమైన కాకతీయ సంపదను వదిలి.. రూ.కోట్లు పెట్టి ఆర్టిఫిషియల్ కళా సంపదను టూరిస్టులకు చూపే ప్రయత్నం సరికాదు.
– పకిడె అరవింద్ ఆర్య, చరిత్ర పరిశోధకుడు
