రాష్ట్ర బడ్జెట్‌‌కు సమానంగా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు!

రాష్ట్ర బడ్జెట్‌‌కు సమానంగా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు!

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు భారీ మొత్తంలో రీపేమెంట్‌‌లు చేయాల్సి ఉంది. ఏటా రైతుబంధు స్కీం కోసం ఖర్చు చేస్తున్న మొత్తానికి సమాన స్థాయిలో ఈ చెల్లింపులు ఉండనున్నాయి. దాదాపు పదేండ్లు రూ.13 వేల కోట్ల కన్నా ఎక్కువే కిస్తీలుగా చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రూ.97.5 వేల కోట్ల అప్పులకు.. వడ్డీగా మరో రూ.71.5 వేల కోట్లు చెల్లించాలి. అంటే అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.1.69 లక్షల కోట్లను బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రానున్న 18 ఏండ్లలో తిరిగి కట్టాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఒక ఏడాది బడ్జెట్‌‌కు సమాన స్థాయిలో ఉంది. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎస్కలేషన్‌‌లు, ఇంకా అదనపు రుణాలను కలుపుకుంటే తిరిగి చెల్లింపులు తడిసి మోపెడు కానున్నాయి. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగిస్తే కరెంట్‌‌ బిల్లులకు ఏటా రూ.4,500 కోట్లు, మెయింటెనెన్స్‌‌కు ఇంకో రూ.500 కోట్ల వరకు ఖర్చవనుంది. ఈ లెక్కన బడ్జెట్‌‌లో పదో వంతు కాళేశ్వరం ఖర్చులకే పోనుంది.

పీఎఫ్‌‌సీ నుంచే రూ.37,737 కోట్లు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ డిజైన్‌‌ చేసింది. సోర్స్‌‌ను తుమ్మిడిహెట్టి నుంచి వంద కి.మీ.ల దిగువకు తీసుకెళ్లి మేడిగడ్డ నుంచి మూడు స్టేజీల్లో ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా మార్పులు చేశారు. పాత ప్రాజెక్టు డిజైన్‌‌లోనూ పలు మార్పులు చేశారు. దీంతో రూ.35 వేల కోట్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.81 వేల కోట్లకు చేరింది. ఈ పనుల ఎస్కలేషన్‌‌ కలుపుకుంటే ఖర్చు రూ.87 వేల కోట్లకు పెరిగింది. అడిషనల్‌‌ టీఎంసీ పనులతో నిర్మాణ వ్యయం రూ.1.15 లక్షల కోట్లు అయింది. ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు అవసరం ఉండటంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకునేందుకు 2015లో కాళేశ్వరం ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ ఏర్పాటు చేశారు. ఇదే కార్పొరేషన్‌‌లో పాలమూరు - రంగారెడ్డిని తర్వాత ఇంక్లూడ్‌‌ చేశారు. 

ఈ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ద్వారా కాళేశ్వరం కోసం రూ.87,449.16 కోట్లు, పాలమూరు కోసం రూ.10 వేల కోట్ల లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. పవర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ (పీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ) అత్యధికంగా రూ.37,737.11 కోట్లు, రూరల్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ రూ.30,536.08 కోట్లు, పంజాబ్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని కన్సార్షియం రూ.11,400 కోట్లు, నాబార్డ్‌‌‌‌‌‌‌‌ రూ.8,225.97 కోట్లు, యూనియన్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా నేతృత్వంలోని కన్సార్షియం రూ.7,400 కోట్లు, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ బరోడా రూ.2,150 కోట్ల లోన్లు ఇచ్చాయి. ఈ అప్పులకు 7.80 శాతం నుంచి 10.90 శాతం వరకు వడ్డీ కలిపి రీపేమెంట్స్ చేయాల్సి ఉంది.

కాళేశ్వరంలో ఇంకా పనులు పెండింగ్

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన పనులు ముగిసినా ఇంకా కొన్ని లింకుల్లో పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి ఇప్పుడు తీసుకున్న లోన్లకు తోడు ఇంకో నాలుగైదు వేల కోట్ల వరకు అదనంగా అప్పు తీసుకోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాలమూరు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్ల నుంచి రూ.54 వేల కోట్లకు చేరింది. ఇందులో పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లు, ఎలక్ట్రో మెకానికల్‌‌‌‌‌‌‌‌ పనుల కోసం ఇంకో రూ.10 వేల కోట్లకు పైగా లోన్లు తీసుకోక తప్పని పరిస్థితి. దీంతో అదనంగా ఇంకో రూ.15 వేల కోట్లు లోన్లు తీసుకోవాలి. వీటికి వడ్డీగా ఇంకో ఎనిమిది వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.2 లక్షల కోట్ల వరకు రీపేమెంట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అసలు రూపం తెలుస్తున్నది: కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు అసలు రూపమేందో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. ఆర్టీఐ ద్వారా కరీం అన్సారీ అనే వ్యక్తి సేకరించిన సమాచారంతో కాళేశ్వరం లోన్ల రీపేమెంట్‌‌‌‌‌‌‌‌పై ప్రముఖ హైడ్రాలజీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ గుజ్జా భిక్షం రూపొందించిన టేబుల్‌‌‌‌‌‌‌‌ను ఆయన శుక్రవారం ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి లోన్ల రీపేమెంట్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయిలో మొదలవుతుందని, అప్పుడు అది ఎంతటి భారంగా మారుతుందో ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుందని చెప్పారు.

 2040 దాకా కడుతూనే ఉండాలి..

నాబార్డ్‌‌ మొదటి విడతలో మంజూరు చేసిన రూ.1,500 కోట్లకు 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో వడ్డీతో కలిపి 213.44 కోట్లను మూడు ఇన్‌‌స్టాల్‌‌మెంట్లలో చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 లోన్ల రీ పేమెంట్‌‌ ప్రారంభం కానుంది. పాలమూరు కోసం తీసుకున్న అప్పుల చెల్లింపు 2024 అక్టోబర్‌‌ నుంచి మొదలు కానుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అన్ని లోన్లు కలిపి రూ.5,266.78 కోట్లు రీపేమెంట్‌‌ చేయాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.11 వేల కోట్లు, ఆ తర్వాతి సంవత్సరం నుంచి వరుసగా పదేండ్ల పాటు ఏటా రూ.13,746 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 2034 -35లో మాత్రం రూ.8,479 కోట్లు చెల్లించాలి. ఆ ఏడాదితో కాళేశ్వరం అప్పుల రీపేమెంట్‌‌ ముగియనుంది. తర్వాత 2036 నుంచి వరుసగా ఐదేండ్లు పాలమూరు కోసం తీసుకున్న లోన్లకు ఐదు ఇన్‌‌స్టాల్‌‌మెంట్లలో మొత్తం రూ.7,633.62 కోట్లు చెల్లించాల్సి ఉంది.
గోదావరిలోనే ఎక్కువ నీళ్లు ఎందుకు నిల్వ చేస్తలే

సర్కారును ప్రశ్నించిన సీడబ్ల్యూసీ

గోదావరి నదిలోనే ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసే అవకాశమున్నా.. అలా ఎందుకు చేయడం లేదని రాష్ట్ర సర్కారును సీడబ్ల్యూసీ ఇటీవల ప్రశ్నించింది. కాళేశ్వరం అడిషనల్‌‌‌‌‌‌‌‌ టీఎంసీ డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న అంశాలపై పలు సందేహాలు లేవనెత్తింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఎక్కువ నీటిని నిల్వ చేసుకోకుండా, వాటికి దూరంగా మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌, గంధమల్ల, బస్వాపూర్‌‌‌‌‌‌‌‌లను భారీ కెపాసిటీతో ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణం వ్యయంతో రాబడి నిష్పత్తి 2018లో 1 : 1.51 ఉండగా, ఇప్పుడు అడిషనల్‌‌‌‌‌‌‌‌ టీఎంసీతో అది 1: 1.54కు ఎలా పెరిగిందో చెప్పాలంది.  అడిషనల్‌‌‌‌‌‌‌‌ టీఎంసీతో వ్యయం తప్ప కొత్త ఆయకట్టు లేదని, అలాంటప్పుడు కాస్ట్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్‌‌‌‌‌‌‌‌ రేషియో ఎలా పెరుగుతుందని ప్రశ్నించింది. ‘‘ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లు ఎంత ? తీసుకున్న లోన్లకు ఎంతమేరకు రీపేమెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు? ప్రాజెక్టు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌, మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌కు అయ్యే వ్యయం ఎంత? గోదావరి వరదలో పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల మునకలో డిజైన్‌‌‌‌‌‌‌‌ల లోపం ఉందా? వాటి డ్రాయింగ్స్‌‌‌‌‌‌‌‌, నీటి లభ్యత, ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ వివరాలివ్వండి” అని ఆదేశించింది.