ప్లానింగ్​, డిజైన్​, క్వాలిటీ ఏదీ సక్కగ లేదు .. మేడిగడ్డ బ్యారేజీ అందుకే కుంగింది

ప్లానింగ్​, డిజైన్​, క్వాలిటీ ఏదీ సక్కగ లేదు .. మేడిగడ్డ బ్యారేజీ అందుకే కుంగింది
  • రిపోర్టులో తేల్చిచెప్పిన నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ
  • ఏడో బ్లాక్‌‌లోని 11 పిల్లర్లను పునాదులతో సహా తొలగించాలి
  • వాటిని మళ్లీ కట్టాల్సిందే.. రిపేర్ చేయడానికి అవకాశమే లేదు
  • మిగతా బ్లాకుల్లోనూ ఇట్లనే సమస్య ఉంటే.. మొత్తం బ్యారేజీనే కొత్తది కట్టాలి
  • అన్నారం, సుందిళ్ల పటిష్టతపైనా స్టడీ చెయ్యాలి
  • తాము 20 రకాల రిపోర్టులు అడిగితే 11 మాత్రమే ఇచ్చారన్న ఎక్స్‌‌పర్ట్​ కమిటీ
  • పిల్లర్లలో ఏర్పడిన పగుళ్ల వివరాలు, సమగ్ర డిజైన్లు అందజేయలేదని వెల్లడి

 

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీని డిజైన్ ప్రకారం కట్టలేదని, మెయింటెనెన్స్‌‌లోనూ లోపాలున్నాయని నేషనల్ డ్యామ్‌‌ సేఫ్టీ అథారిటీ చెప్పింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌‌లోని 11 పిల్లర్లను పునాదుల నుంచి తొలగించి మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. మిగతా ఏడు బ్లాకుల్లోనూ ఇట్లనే సమస్య ఉంటే మొత్తం బ్యారేజీనే తొలగించి కొత్తగా నిర్మించాలని తేల్చిచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇదే టెక్నాలజీతో నిర్మించారు కాబట్టి వాటి పటిష్టతపైనా స్టడీ చేయాలని సూచించింది.

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌‌లోని 20వ పిల్లర్ కుంగుబాటుపై నేషనల్​డ్యామ్‌‌ సేఫ్టీ అథారిటీ మెంబర్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎక్స్‌‌పర్ట్ కమిటీ.. కేంద్ర జల శక్తి శాఖకు రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికను తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్‌‌‌‌కు సీడబ్ల్యూసీ సభ్యుడు సంజయ్​కుమార్ ​సిబల్ పంపారు. మేడిగడ్డ కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులు, పునరుద్ధరణకు సంబంధించి కమిటీ చేసిన కీలక సిఫార్సులను లేఖలో ప్రస్తావించారు. 11 పేజీల నివేదికను ఎక్స్‌‌పర్ట్ కమిటీ సమర్పించింది. దానికి సపోర్ట్‌‌గా మరో 34 పేజీల డేటాను కూడా అందజేసింది.

అన్ని పిల్లర్ల వివరాలు ఇవ్వలే

అక్టోబర్ 21న సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీపై నిర్మించిన అప్రోచ్ బ్రిడ్జి భారీ శబ్దంతో కుంగిపోయింది. ఏడో బ్లాక్‌‌లోని 20వ నంబర్​ పిల్లర్​ వద్ద కుంగిపోయినట్టుగా గుర్తించారు. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్ అనిల్ జైన్ ​చైర్మన్‌‌గా ఆరుగురు సభ్యులతో ఎక్స్‌‌పర్ట్ ​కమిటీని సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. 

కె.శర్మ, ఆర్.తంగమణి, రాహుల్​ కె.సింగ్, దేవేందర్​రావు, ప్రవీణ్ అన్నెపు సభ్యులుగా ఉన్న ఎక్స్​పర్ట్​కమిటీ.. అక్టోబర్​23న హైదరాబాద్ జలసౌధలో ఇరిగేషన్​ఈఎన్సీ(జనరల్) మురళీధర్‌‌‌‌‌‌‌‌తో సమావేశమైంది. 24న మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ఫీల్డ్​ ఇంజినీర్ల నుంచి పలు వివరాలు సేకరించింది. 25న జలసౌధలో ఇరిగేషన్​ ఇంజినీర్లతో సమావేశమై బ్యారేజీకి సంబంధించిన 20 రకాల డాక్యుమెంట్లు సమర్పించాలని కోరింది.

అక్టోబర్​29లోగా ఆ డేటా సమర్పించకపోతే ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​వద్ద ఆ వివరాలు లేవని భావించాల్సి వస్తుందని స్పష్టం చేస్తూ 27న స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌‌‌‌కు లేఖ రాసింది. అయినా ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ 11 రకాల డాక్యుమెంట్లు సమర్పించిందని, మిగతావి ఇవ్వలేదని ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ కమిటీ చెప్పింది. బ్యారేజీ జియోలాజికల్ స్ట్రక్చర్ ప్రొఫైల్, క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్ట్స్, వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీకి ఎగువ, దిగువన క్రాస్ ​సెక్షన్ ​రిపోర్టులు, బ్యారేజీలోని బ్లాకులకు సంబంధించిన నివేదికలు ఇవ్వలేదని తెలిపింది.

బ్యారేజీలోని అన్ని పిల్లర్లకు సంబంధించిన పగుళ్ల వివరాలివ్వాలని కోరితే ఒక్క ఏడో బ్లాకులోని పిల్లర్ల వివరాలు మాత్రమే ఇచ్చారని చెప్పింది. ఈ డాక్యుమెంట్లేవీ డిపార్ట్​మెంట్​వద్ద లేవని, అసలు అందుకు అవసరమైన స్టడీ, ఎగ్జామినేషన్స్​ చేయలేదని భావించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. డ్యామ్‌‌‌‌ సేఫ్టీ యాక్ట్​2021 ప్రకారం ఇందుకు బాధ్యులపై చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది. 

నిబంధనలను పట్టించుకోలే

ఏడో బ్లాక్​లోని 16వ నంబర్​ నుంచి 20వ నంబర్​పిల్లర్ల వరకు పగుళ్లు ఉన్నట్టు తమ పరిశీలనలో గుర్తించామని రిపోర్టులో ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీ పేర్కొంది. ‘‘మేము బ్యారేజీని పరిశీలించిన రోజు మేడిగడ్డలో 3 మీటర్ల వరకు నీటి నిల్వ ఉండటంతో పునాది వద్ద ఏమి జరిగిందో తెలుసుకునే అవకాశం రాలేదు. ఇరిగేషన్ ​డిపార్ట్​మెంట్​వద్ద క్వాలిటీ కంట్రోల్ ​సంబంధించిన సరైన నివేదికలేవీ లేవు. పిల్లర్లలో పగుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, నిర్మాణానికి సంబంధించిన సమగ్ర డిజైన్లు అందజేయలేదు.

పునాదితో కట్ ఆఫ్ వాల్స్‌‌‌‌కు సంబంధించిన జాయింట్స్‌‌‌‌ను పటిష్టంగా నిర్మించలేదు. బ్యారేజీ మెయింటెనెన్స్‌‌‌‌లోనూ నిబంధనలు పాటించలేదు. బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌‌‌‌ డిజైన్ చేసి కాంక్రీట్ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌గా నిర్మించారు. కానీ దాని అప్​స్ట్రీమ్, డౌన్ ​స్ట్రీమ్‌‌‌‌ను​ లింక్​చేయడానికి కాంక్రీట్​ గోడలను ఉపయోగించడం వల్ల బ్యారేజీపై అధిక ప్రభావం పడింది. హైడ్రాలిక్ బ్యారేజేస్ అండ్ వియర్స్ గైడ్​లైన్స్ ప్రకారం బ్యారేజీ నిర్మాణంలో పునాది ఎంత లోతున నిర్మించాలో నిర్ధారించాలి. సీబీఐపీ మ్యానువల్​ ప్రకారం బ్యారేజీలు, వియర్స్ నిర్మాణ ప్రాంతాల్లో భూగర్భంలోని నివేదికల ఆధారంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేవీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు” అని చెప్పింది.

బ్యారేజీలు, వాటి పునాదులు దెబ్బతినకుండా నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలి. కానీ మేడిగడ్డ వద్ద అలాంటివేవీ లేవు. దీన్ని బట్టి చూస్తే బ్యారేజీ నిర్మాణాన్ని నిర్దేశిత నిబంధనల మేరకు చేపట్టలేదని తెలుస్తున్నది. డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న విధంగా బ్యారేజీ అప్​స్ట్రీమ్​లోని కుడి కట్ట వైపున నీటి ప్రవాహం సవ్యంగా లేదు. అక్కడ క్రాస్ ఫ్లోస్​ఉన్నట్టుగా గుర్తించాం. దీనివల్ల బ్యారేజీపై ప్రభావం పడుతున్నది. బ్యారేజీ నాణ్యత విషయంలో బెంటోనైట్, స్లర్రి లాంటి పరిశోధనలు చేయాలి. సెకాంట్​ఫౌండేషన్​ను మరింత బలోపేతం చేయడానికి ఇవి దోహదపడుతాయి”అని తెలిపింది.

2019 నుంచి మెయింటెనెన్స్ చేయలే

మేడిగడ్డ బ్యారేజీని 2019లో ప్రారంభించారని, ఆ రోజు నుంచి ఇది డ్యామ్​సేఫ్టీ యాక్ట్​2021 పరిధిలోకి వస్తుందని రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ‘‘ప్రాజెక్టును ప్రారంభించిన రోజు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28 వరకు ఎలాంటి పరిశీలనలను స్టేట్​డ్యామ్‌‌‌‌ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌వో) చేపట్టలేదు. వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది పరిశీలించలేదు. బ్యారేజీ నిర్వాహకులు ఈఏపీ, ఓ అండ్​ఎం మ్యానువల్, లాగ్​బుక్స్​మొదలైనవి సరిగా నిర్వహించడం లేదని తేలింది. ఇది అధికారుల నిర్లక్ష్యంగానే పరిగణించాల్సి వస్తుంది. డ్యామ్​సేఫ్టీ యాక్ట్ చాప్టర్ పదిలోని 41(బీ) ప్రకారం సంబంధిత అధికారులు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.

రిపోర్టులో ఇంకా ఏముందంటే?

బ్యారేజీ డిజైన్లు, డ్రాయింగ్స్, జియో టెక్నికల్, జియోలాజికల్​ఇన్వెస్టిగేషన్స్‌‌‌‌ను పరిశీలించాల్సిన అవసరముందని నేషనల్ ​డ్యామ్‌‌‌‌ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది.
బ్లాక్​ నంబర్ 7లోని 20వ పిల్లర్ కుంగుబాటుతో దానికి ఆనుకుని ఉన్న పిల్లర్లలోనూ పగుళ్లు వచ్చాయి. వాటిని రిపేర్ చేయడానికి అవకాశం లేదు. ఈ కారణంగా ఏడో బ్లాక్​లోని మొత్తం 11 పిల్లర్లను పునాదుల తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. దీనికి ఆనుకునే ఉన్న ఆరో, ఎనిమిదో నంబర్​ బ్లాకుల్లోని పిల్లర్లతో పాటు వాటి ఫౌండేషన్‌‌‌‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. 

బ్యారేజీ ఎగువ, దిగువ ఆప్రాన్/ప్లింత్ కనెక్షన్లను పరిశీలించాలి. పగుళ్లను గుర్తించడానికి గ్లాస్ ​స్ర్టిప్​లు ఫిక్స్ చేయడం లాంటి చర్యలు చేపట్టాలి. బ్యారేజీ పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి ముందే పునాదికి జరిగిన నష్టాన్ని గుర్తించాలి. 

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌‌‌‌లో కుంగుబాటు కారణంగా మొత్తం బ్యారేజీని ఆపరేట్​చేయలేని పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించేదాకా బ్యారేజీని వినియోగించడానికి అవకాశం లేదు.

మేడిగడ్డ బ్యారేజీ మొత్తాన్ని పర్మియబుల్​ఫౌండేషన్​తో నిర్మించారు. కాబట్టి మిగతా బ్లాకులను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. ఒకవేళ ఆయా బ్లాకుల్లో ఇలాంటి సమస్యలే ఉన్నట్టు తేలితే మొత్తం బ్యారేజీని తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. 

ఈ పరిస్థితుల్లో బ్యారేజీలో నీటిని నింపితే దాని ఫౌండేషన్​ మరింత క్షీణించే అవకాశముంది. ఏడో బ్లాక్​ను పునరుద్ధరించే వరకు బ్యారేజీని ఉపయోగించడానికి వీల్లేదు.
బ్యారేజీని పునరుద్ధరించే వరకు గాంట్రీ క్రేన్​ఆపరేట్​చేయొద్దు. ఏడో బ్లాకులోని గేట్లను అసలే ఆపరేట్ ​చేయొద్దు.

మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఇదే టెక్నాలజీ వాడారు. వాటిలోనూ సమస్యలే తలెత్తవచ్చు. అన్నారం బ్యారేజీ కింద బాయిలింగ్​ఇష్యూ ఉన్నట్టుగా ఇప్పటికే ఇండికేషన్స్ ఉన్నాయి. రెండు రోజుల క్రితం దీనిని గుర్తించారు. మేడిగడ్డతో పాటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఫౌండేషన్​లను వెంటనే తనిఖీ చేయాలి. ఎక్కడైనా సమస్యలు గుర్తిస్తే చర్యలు చేపట్టాలి.

2019 నుంచి బ్యారేజీ కాంక్రీట్​ పిల్లర్లు, పునాది, లాంచింగ్ ఆప్రాన్‌‌లను రాష్ట్ర ఇంజినీర్లు సరిగా పరిశీలించలేదు. మెయింటెనెన్స్ చేయలేదు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే బ్యారేజీ బలహీనపడినట్టుగా గుర్తించాం. వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీని పరిశీలించాలని మేము తెలంగాణ స్టేట్​ డ్యామ్‌‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌‌ (ఎస్‌‌డీఎస్‌‌వో)కు సూచించాం. తనిఖీల్లో సమస్యలు గుర్తిస్తే వాటికి తగ్గట్టుగా పరిష్కరించాల్సి ఉంది. కానీ ఎస్‌‌డీఎస్‌‌వో వాటిని పట్టించుకోలేదు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌‌లోని నిబంధనలను పట్టించుకోకపోవడం తీవ్రమైన అంశం. బ్యారేజీ విఫలమైతే అది ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తుంది.  - రిపోర్టులో నేషనల్ డ్యామ్‌‌ సేఫ్టీ అథారిటీ ఎక్స్‌‌పర్ట్ కమిటీ

పిల్లర్లు కుంగడానికి ప్రధాన కారణాలివే

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి తాము గుర్తించిన కారణాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం​ ఇచ్చిన డేటా ఆధారంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్​పర్ట్​ టీమ్​ ఈ కింది అంశాలను గుర్తించింది.

  • బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక వరదలకు కొట్టుకుపోవడంతో పిల్లర్ల సపోర్ట్​ బలహీన పడింది.

  • ఫౌండేషన్​ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ సామర్థ్యం తక్కువగా ఉంది.

  • బ్యారేజీపై లోడ్​ ఉండటంతో సెకాంట్ పైల్స్ (కాంక్రీట్) వైఫల్యం చెందాయి.

  • ప్లానింగ్, డిజైన్​ క్వాలిటీ కంట్రోల్​ అండ్​ఆపరేషన్ అండ్​ మెయింటెనెన్స్‌‌లో వైఫల్యం.

  • బ్యారేజీని నీటిపై తేలియాడేలా డిజైన్​చేసి.. కాంక్రీట్ స్ట్రక్చర్‌‌‌‌గా నిర్మించడం.