
రూ.245 కోట్లు బాకీ పడ్డరు బకాయిలన్నీ క్లియర్ చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌ఈసీ లేఖ
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము ఇచ్చిన లోన్లకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టడం లేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) చెప్పింది. రూ.245 కోట్లు బాకీ పడ్డారని, వాటిని వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి ఈమేరకు ఆర్‌ఈసీ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల ఇన్‌స్టాల్‌మెంట్లను అణాపైసాతో సహా సకాలంలో చెల్లిస్తున్నామని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. తమ సర్కారుకు పతారా ఉంది కాబట్టే పెద్ద ఎత్తున అప్పులు పుడుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. కానీ కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్లకు చెల్లించాల్సిన ఇంట్రస్ట్ పెండింగ్‌లో పెట్టారు. చివరికి తమ వడ్డీ క్లియర్ చేయాలని సర్కార్‌కు ఆర్‌ఈసీ లేఖ రాయాల్సి వచ్చింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ డిజైన్ చేసిన తర్వాత నిధుల సమీకరణ కోసం 2015లో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం (అడిషనల్ టీఎంసీ కలుపుకొని) రూ.1.15 లక్షల కోట్లు కాగా.. ఇందులో బ్యాంకులు, నాబార్డు, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ నుంచి పలు విడతలుగా రూ.87,449.16 కోట్ల లోన్లు తీసుకుంది. ఆర్‌ఈసీ నుంచి ప్రాజెక్టులో లింక్ -1 (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు)కు రూ.4,657.95 కోట్లు, లింక్ -2 (ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు) రూ.11,784.70 కోట్లు, లింక్ -4 (మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు) రూ.14,093.43 కోట్లను లోన్‌గా తీసుకున్నారు. మొత్తం రూ.30,536.08 కోట్లను 2023 జూన్ నుంచి 2035 మే వరకు 144 వాయిదాల్లో 10.90 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి. ఆర్‌ఈసీ లోన్ల రీ పేమెంట్ ప్రారంభం కావడానికి ఇంకో 9 నెలల టైం ఉంది. ఆలోగా తీసుకున్న అప్పుకు ప్రతినెలా వడ్డీ చెల్లించాలి. ఇలా ప్రభుత్వం ఆర్‌ఈసీకి రూ.245 కోట్లు బకాయి పడింది. కరోనా నేపథ్యంలో వడ్డీ పేమెంట్లు చేయలేకపోయినట్టు అధికారులు చెప్తున్నారు.
కార్పొరేషన్‌లో పైసా లేక
కాళేశ్వరం కార్పొరేషన్‌లో రుణాల రీ పేమెంట్‌కు రూపాయి కూడా లేదు. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప లోన్ల ఇన్‌స్టాల్‌మెంట్ కట్టే పరిస్థితి లేదు. యూనియన్ బ్యాంక్ కన్సార్షియం నుంచి తీసుకున్న రూ.7,400 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం మంజూ రు చేసిన రూ.11,400 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన రూ.2,150 కోట్లకు ఈ ఏడాది నుంచి రీపేమెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఒక కిస్తీ కట్టగా ఈనెలాఖరులోగా మరో ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాబార్డు మొదటి దశలో ఇచ్చిన రూ.1,500 కోట్ల లోన్ రీ పేమెంట్ కూడా సక్రమంగానే చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐదు దశల్లో ఇచ్చిన రూ.27,737.4 కోట్ల రుణాన్ని ఈ అక్టోబర్ నుంచి ప్రతి నెలా చెల్లించాల్సి ఉంది. నాబార్డ్ రెండో దశలో ఇచ్చిన రూ.4,674.83 కోట్లు ఈ ఏడాది డిసెంబర్ నుంచి చెల్లించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై కార్పొరేషన్ దృష్టి సారించింది. రైతుల నుంచి నీటి తీరువా, ఇండస్ట్రీస్‌కు ఇచ్చే నీళ్లు, హైదరాబాద్‌కు ఇచ్చే తాగునీటితో పాటు మిషన్ భగీరథకు ఇచ్చే నీటి ద్వారా రూ.65,454 కోట్ల ఆదాయం వస్తుందని, ఈ మొత్తంతో తీసుకున్న లోన్లను వడ్డీతో సహా చెల్లిస్తామని కాళేశ్వరం కార్పొరేషన్ టెక్నో ఎకనామికల్ వయబులిటీ నివేదికను బ్యాంకుల కన్సార్షియంకు సమర్పించారు. రైతుల నుంచి నీటితీరువా వసూలు చేయడం లేదు.. మిషన్ భగీరథ నీటికి బిల్లుల చెల్లింపులు లేవు. దీంతో ఆ మొత్తాన్ని ప్రభుత్వం వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి చెల్లించేలా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.87,449.16 కోట్లు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం కోసం ఇంకో రూ.10 వేల కోట్లను రాష్ట్ర సర్కారు తీసుకుంది. ఏటా లోన్ల కిస్తీలు, వడ్డీ కలిపి వచ్చే ఆర్థిక ఏడాది నుంచి 2034–35 దాకా ఏటా రూ.13 వేల కోట్ల చొప్పున పే చేయాల్సి ఉంది.
కాళేశ్వరం అప్పులు ఇలా
⇒ ఆర్థిక సంస్థ అప్పు (రూ. కోట్లలో)
⇒ యూబీఐ కన్సార్సియం 7,400
⇒ పీఎన్‌బీ కన్సార్షియం 11,400
⇒ బ్యాంక్ ఆఫ్ బరోడా 2,150
⇒ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 37,737.11
⇒ నాబార్డ్ 8,225.97
⇒ రూరల్ ఎలక్ట్రిఫికేషన్
⇒ కార్పొరేషన్ 30,536.08
⇒ మొత్తం - 97,449.16