
- ప్రజల్లో ప్రభుత్వ పథకాలకు మంచి స్పందన వస్తోంది
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై మంచి స్పందన వస్తోందని, ఈ స్కీమ్‌లతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరమ్ కన్వీనర్, ఎంపీ మల్లు రవి అన్నారు. అన్ని వర్గాలకు లబ్ధి చేసే పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. దీంతో సర్పంచ్, లోకల్ బాడీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, రఘురామ, చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు.
అధికారం ఇకరాదనే ప్రస్ట్రేషన్‌లో కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం అన్న విజ్ఞత వదిలి రేవంత్ రెడ్డిపై స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తోందని చెప్పారు. సీఎం ఏ సందర్భంలో ఆ కామెంట్స్ చేశారో రాజగోపాల్ రెడ్డికి తెలియదన్నారు. అయితే.. వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే వాటిని అధిష్టానం ముందు చెప్పాలని, బహిరంగంగా మాట్లాడటం పార్టీకి మంచిది కాదని హితవు పలికారు.
24న ఢిల్లీకి సీఎం రేవంత్ రాక..
ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గం ఢిల్లీ పర్యటనకు రానున్నట్లు మల్లు రవి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ జీవోను పార్లమెంట్ లో అమలు చేసేందుకు పలువురు ఎంపీల సహయం కోరేందుకు రేవంత్ ఢిల్లీ వస్తున్నారని చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలకు ఇన్విటేషన్లు పంపుతున్నట్లు వెల్లడించారు. అలాగే, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని వివరించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 24 సాయంత్రం ఇందిరా భవన్‌లో 100 మంది కాంగ్రెస్ ఎంపీలకూ బీసీ రిజర్వేషన్లపై సీఎం స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపారు. కాగా, ఆపరేషన్ సిందూర్‌పై సభలో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. ఆయన మాత్రం రెండే నిమిషాలు హౌస్‌లో ఉండి వెళ్లిపోయారని మండిపడ్డారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేశారని విమర్శించారు.