కాళేశ్వరం.. యూజ్​లెస్ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపలేం : మంత్రి ఉత్తమ్​

కాళేశ్వరం.. యూజ్​లెస్ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపలేం : మంత్రి ఉత్తమ్​
  • కాగ్, ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ ఆధారంగా బాధ్యులపై చర్యలు 
  • గత సర్కార్​ అవినీతి, అక్రమాల వల్ల రాష్ట్రంపై రూ.లక్షల కోట్ల అప్పు
  • వైట్​ పేపర్​లో తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్​
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు భారీ డ్యామేజీ
  • అన్నారం బ్యారేజీకి మళ్లా ఇంకో బుంగ పడ్డది
  • ఎన్​డీఎస్​ఏకి ఫిర్యాదు చేసినం.. సుందిళ్ల బ్యారేజీనీ చెక్​ చేయిస్తం
  • మూడు బ్యారేజీలను ఎన్​డీఎస్​ఏకి అప్పగిస్తున్నట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం లోపభూయిష్టంగా ఉందని, అదో యూజ్​లెస్​ ప్రాజెక్ట్​ అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే గత సర్కారు ప్రాజెక్టును కట్టిందనే విషయాన్ని కాగ్​ కూడా తన రిపోర్టులో  తెలిపిందని, వాళ్ల (బీఆర్​ఎస్​) అవినీతి, అక్రమాలతో రాష్ట్రంపై రూ.లక్షల కోట్ల అప్పు మోపైందని ఆందోళన వ్యక్తం చేసింది. 


మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన డ్యామేజీ చాలా తీవ్రంగా ఉందని, వాటి లక్ష్యాలు నెరవేరలేదని ప్రభుత్వం తెలిపింది. అన్నారం బ్యారేజీలో గతంలో బుంగలు ఏర్పడ్డాయని, ఇప్పుడు మళ్లీ శుక్రవారం కొత్తగా ఇంకో బుంగ ఏర్పడిందని, దీనిపై నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ)కి ఫిర్యాదు చేశామంది. అథారిటీ వారు మరో రెండ్రోజుల్లో వస్తామన్నారని, దాంట్లోని నీళ్లను ఖాళీ చేసి పెట్టాల్సిందిగా చెప్పారని వివరించింది. అన్నారం ప్రాజెక్టు కూడా మేడిగడ్డ లాగానే కుంగిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం  పేర్కొంది. కాగ్​, ఎన్​డీఎస్​ఏ రిపోర్టుల ఆధారంగా బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇరిగేషన్​పై శనివారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం వైట్​పేపర్​ రిలీజ్​ చేసింది. దీన్ని ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విడుదల చేశారు. పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయే దశకు వచ్చిందని, కట్టిన తర్వాత దాని నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. బ్యారేజీని నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ కూడా చెక్​ చేసిందని గుర్తుచేశారు. 

మేడిగడ్డ బ్యారేజీ భారీగా డ్యామేజ్​ అయిందన్నారు. కట్టిన మూడేండ్లకే  ఓ పిల్లర్​ కింది నుంచి పైదాకా నెర్రెలిచ్చిందని, మరికొన్ని పిల్లర్లు, పిల్లర్లలో ఇనుప రాడ్లు బయటకు తేలాయని చెప్పారు. వందేండ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేండ్లలోనే కూలిపోయే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. బ్యారేజీ నిర్మాణానికి రూ.1,800 కోట్లతో టెండర్లు పిలిచారని, కానీ.. ఖర్చు మాత్రం రూ.4,500 కోట్లు పెట్టారని విమర్శించారు. సుందిళ్ల బ్యారేజీ పరిస్థితిపైనా ఓసారి చెక్​ చేయిస్తామని చెప్పారు. మూడు బ్యారేజీలను ఎన్​డీఎస్​ఏకి అప్పగించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ వచ్చాక ముందుకు వెళ్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్​ స్పష్టం చేశారు. 3 బ్యారేజీల్లో నీళ్లు నింపలేమని, గేట్లన్నీ ఖుల్లా పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు నీళ్లిచ్చేలా బ్యారేజీలను రిపేర్​ చేయిస్తామని చెప్పారు. నాగార్జునసాగర్​, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించేది లేదని మరోసారి ఆయన తేల్చి చెప్పారు. 

అడ్డగోలుగా అప్పులు చేశారు

ఇరిగేషన్​లో అడ్డగోలు లోన్ల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని మంత్రి ఉత్తమ్​ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చును గత బీఆర్​ఎస్​ సర్కార్​ అడ్డగోలుగా పెంచిందని, అది ఆర్థికంగా అత్యంత ఫెయిల్యూర్​ ప్రాజెక్ట్​ అని అన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రాజెక్టును కట్టారని కాగ్ ​రిపోర్ట్​ తేల్చిందని, ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను కట్టి ఉంటే రాష్ట్రంపై భారం పడి ఉండేది కాదని పేర్కొన్నారు. గత పాలకుల అవినీతి, అక్రమాలతో రాష్ట్రంపై రూ.లక్షల కోట్లు అప్పు మోపైందన్నారు. అదే ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలా మారిందని తెలిపారు.  ‘‘వివిధ కార్పొరేషన్ల పేరిట ప్రాజెక్టు కోసం అధిక వడ్డీలకు షార్ట్​ టర్మ్​ రుణాలు తీసుకున్నారు. సీఎం, నేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ను కలిసి ఈ విషయాన్ని వివరించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెప్పాం. ఈ లోన్లను తక్కువ వడ్డీ ఎక్కువ కాలపరిమితి రుణాలుగా మార్చాలని కోరాం. అందుకు ఆమె అంగీకరించారు. 

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి షెకావత్​నూ కలిశాం. ఫేజ్​ 1లో భాగంగా మైనర్​ ఇరిగేషన్​ కింద 45 టీఎంసీలు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సెకండ్​ ఫేజ్​లోనూ 45 టీఎంసీలు ఇస్తామన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగాం. ఏపీలో పోలవరానికి ఇచ్చినట్టే ఫండింగ్​ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. కరువు జిల్లా అయిన మహబూబ్​నగర్​ను దృష్టిలో పెట్టుకుని జాతీయ హోదా విషయం ఆలోచించాలని రిక్వెస్ట్​ చేశాం. ఏఐబీపీ, పీఎంఎస్​కేవై కింద 60 శాతం ఫండింగ్​ ఇస్తామన్నారు’’ అని మంత్రి ఉత్తమ్​ వివరించారు.

తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టులను కడ్తం

‘‘తమకు అధికారం ఇస్తే బ్యారేజీని రిపేర్​ చేసి నీళ్లిస్తమని కొందరు పెద్దలు అంటున్నారు. అసలు వాళ్ల వల్లే బ్యారేజీ కూలిపోయే స్థితికి వచ్చిందన్న విషయాన్ని వారు మరుస్తున్నారు. అలాంటిది బ్యారేజీని వాళ్లేం రిపేర్​ చేస్తారు?” అని హరీశ్​రావుపై మంత్రి ఉత్తమ్​ ఫైర్​ అయ్యారు.  ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు కరెంటు బిల్లే ఏడాదికి రూ.10 వేల కోట్లు అవుతుంది. మరో రూ.15 వేల కోట్లు రుణాలకు చెల్లించాలి. అంటే ఏటా రూ.25 వేల కోట్లు భారం పడుతుంది. అందుకే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను కట్టి ఆయకట్టుకు నీళ్లిస్తాం. డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్​, కొడంగల్​ నారాయణపేట, చిన్న కాళేశ్వరం, ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్​ఎల్​బీసీ, శ్రీపాద ఎల్లంపల్లి, ఇందిరమ్మ వరద కాలువ, మిడ్​మానేరు, కుమ్రంభీం, దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులను ఫాస్ట్​ ట్రాక్​ పద్ధతిలో నిర్మిస్తాం. 

బడ్జెట్​లో పెట్టినట్టు 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. నిరుడు అక్టోబర్​ 21న మేడిగడ్డ కుంగిపోతే.. తమ ప్రమాణస్వీకారం రోజు డిసెంబర్​ 7 వరకు కూడా మాజీ సీఎం కేసీఆర్​ కనీసం స్పందించలేదని ఉత్తమ్  మండిపడ్డారు. ఇప్పటివరకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసింది 180 టీఎంసీలేనని, ఐదేండ్లలో 65 టీఎంసీలే వ్యవసాయానికి నీళ్లిచ్చారని, రాష్ట్రంలో ఎక్కడ నీళ్లిచ్చినా కాళేశ్వరం నీళ్లే అన్నట్లుగా  బీఆర్​ఎస్​ వాళ్లు గోబెల్స్​ ప్రచారం చేశారని విమర్శించారు. 

రూ.40 వేల కోట్లతో అయిపోయేది

కృష్ణా జలాలపై అక్టోబర్​లోనే కొత్త నిబంధనలు వచ్చాయని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారు. ‘‘పరివాహక ప్రాంతానికి తగ్గట్టుగా తెలంగాణకు ఎక్కువ నీళ్లు వచ్చేలా మా ప్రభుత్వం ఫైట్​ చేస్తుంది. ప్రాణహిత –చేవెళ్ల, ఖమ్మంలోని రాజీవ్​ ఇందిరా సాగర్  సహా గత కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను బీఆర్​ఎస్​ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. గత ప్రభుత్వాలకు పేరు రావొద్దన్న ఉద్దేశంతో బీఆర్​ఎస్​ సర్కార్​కే పేరుండాలన్న దుర్బుద్ధితో పాత ప్రాజెక్టులను గాలికొదిలేసింది. రీడిజైన్ల పేరుతో కొత్తగా కట్టిన ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసింది. ఒరిజినల్​ డిజైన్​ను మార్చి కొత్తగా కట్టడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. తుమ్మిడిహెట్టికి సంబంధించి పక్క రాష్ట్రాన్ని 152 మీటర్లుకాకుంటే 151 మీటర్లకు ఒప్పించి ముందుకుపోయి ఉంటే రూ.40 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ఉండేది. రాష్ట్రానికి మేలు జరిగేది. కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్ణయం’’ అని అన్నారు. 

వాళ్లకు కాగ్​, ఎన్​డీఎస్​ఏ రిపోర్టులూ తప్పేనట

కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టం జరిగిందని కాగ్  రిపోర్ట్​ ఇస్తే అది తప్పుడు నివేదిక అని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అంటున్నారని ఉత్తమ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్​డీఎస్​ఏ ఇచ్చిన రిపోర్ట్​నూ తప్పుపడుతున్నారని, ఖర్చు పెరిగిందంటే పెరగలేదంటున్నారని అన్నారు. ‘‘దేశంలోనే కాగ్​ రిపోర్ట్​కు అత్యంత విలువ ఉన్నది. దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ నిలబడిందంటే కాగ్ బాధ్యత ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్​ రిపోర్ట్​ ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా విశ్లేషించింది” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే విద్యుత్​ వినియోగం కన్నా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడిచినప్పుడు విద్యుత్​ వినియోగం ఎక్కువని చెప్పారు. ఆ విషయాలను కొట్టిపారేయడం మంచిది కాదన్నారు. ఎన్​డీఎస్​ఏ.. పార్లమెంట్​లో చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ అని, అందుకే ఆ బ్యారేజీలను ఎన్​డీఎస్​ఏకి అప్పగించామని చెప్పారు. కాగా, సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం నిర్వించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రకటించారు.  ప్రాజెక్టుల ఖర్చు, ప్రయోజనాలపై కచ్చితంగా చర్చ జరగాలన్నారు. గ్రావిటీ ప్రాజెక్టుల ద్వారా మాత్రమే తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిపారు.