కాళేశ్వరం బ్యాక్​ వాటర్.. మళ్లా ముంచింది

కాళేశ్వరం బ్యాక్​ వాటర్.. మళ్లా ముంచింది
  • గోదారి ఒడ్డుపొంట వేల ఎకరాల్లో పంట నీటిపాలు
  • మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రైతులకు భారీ నష్టం
  • చెన్నూర్​ మండలం సుందరశాలలో కలెక్టర్​ ఘెరావ్​
  • పంట మునిగి నష్టపోతున్నా ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదంటూ రైతుల ఆవేదన

మంచిర్యాల/పెద్దపల్లి, వెలుగు: రైతులను కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్  వాటర్​ కన్నీళ్లు పెట్టిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్​ వాటర్​ మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలను ముంచుతోంది. నాలుగు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గోదావరికి వరద పోటెత్తింది. ఎస్సారెస్పీ నుంచి మేడిగడ్డ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్​ చేశారు. అయినప్పటికీ పలు వాగులు, ఒర్రెల నుంచి పెద్ద ఎత్తున గోదావరికి వరద వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆఫీసర్లు క్యాచ్​మెంట్​ ఏరియా వాటర్​ను అంచనా వేయకుండా కేవలం బ్యారేజీల ద్వారా వచ్చే వాటర్​ను అంచనాలోకి తీసుకున్నారు. దీంతో బ్యారేజీల గేట్లు ఎత్తినా ఫలితం లేకుండాపోతోంది. బ్యాక్​ వాటర్​ రెండువైపులా రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తూ పంటలను ముంచుతోంది. ఇటు మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్​, మంచిర్యాల, నస్పూర్​, జైపూర్​, చెన్నూర్​, కోటపల్లి వరకు.. అటు వెల్గటూర్​, అంతర్గాం,  రామగుండం, మంథనితో పాటు భూపాలపల్లి జిల్లా వరకు గోదావరి ఒడ్డున పంటలు మునిగిపోతున్నాయి. ప్రాణహిత ఒడ్డుపొంటి ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూర్​, పెంచికల్​పేట్​, దహెగాం, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి వరకూ ఇదే పరిస్థితి. తాజా వరదలతో మంచిర్యాల జిల్లాలో 10 వేల ఎకరాల్లో, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో 10వేల ఎకరాల్లో, మొత్తంగా 20 వేల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చితో పాటు ఇతర పంటలు నీటిపాలయ్యాయి. గోదావరి నుంచి ఎటూ రెండు కిలోమీటర్ల పరిధిలో రైతులు పొలాల్లో నిల్వ ఉంచిన ఎరువుల బస్తాలు, కరెంట్​ మోటార్లు కొట్టుకుపోయాయి. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 181 కరెంట్​ పోల్స్​ కూలిపోగా, 183 ట్రాన్స్​ఫార్మర్లు నీటమునిగాయి. మరో నాలుగు ట్రాన్స్​ఫార్మర్లు వరదలో కనిపించకుండాపోయాయి. ఎకరానికి రూ. 30 వేలకు పైగా నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్​ను ఘెరావ్​ చేసిన రైతులు
మంచిర్యాల జిల్లా చెన్నూర్​ మండలం సుందరశాలలో శుక్రవారం నీటమునిగిన పంటల పరిశీలనకు వచ్చిన కలెక్టర్​ భారతి హోళికేరిని రైతులు ఘెరావ్​ చేశారు. గ్రామంలో 500 ఎకరాలకు పైగా పంటలు మునిగిపోతే.. ముంపు భూముల సర్వేలో 5.32 ఎకరాలను మాత్రమే గుర్తించారని వారు అన్నారు. రెండు మూడేండ్లుగా పంటలు నష్టపోయి అప్పులపాలవుతున్నామని, ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇయ్యడం లేదని కలెక్టర్​ వెహికల్​ను అడ్డుకొని నిరసన తెలిపారు. కలెక్టర్​ రైతులకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో ఎఫెక్ట్​ అవుతున్న భూములను ప్రభుత్వం వెంటనే సేకరించాలని రైతులు డిమాండ్​ చేశారు. 

నిరుడు ఇదే పరిస్థితి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో నిరుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గోదావరి, ప్రాణహిత బ్యాక్​ వాటర్​తో  మంచిర్యాల జిల్లాలో 9 వేల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆఫీసర్లు పంటనష్టం సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్టు పంపారు. రాష్ట్ర ప్ఱభుత్వం పైసా ఇయ్యలేదు. నష్టపరిహారం రాక, అప్పులు తీర్చేదారి లేక మంచిర్యాల జిల్లాలో ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాజెక్టులు నిండితే బ్యాక్​ వాటర్​ పంటలను ముంచుతుందని, ఎప్పటికప్పుడు గేట్లు ఓపెన్​ చేసి తమ పంటలు మునగకుండా చూడాలని రైతులు మొత్తుకుంటున్నా ఆఫీసర్లు పట్టించుకోలేదు. తాజా వరదలతో వరినాట్లు కొట్టుకుపోయాయి. పత్తి చేన్లు  అక్కరకు రాకుండా పోయాయి. ఎకరానికి రూ. 30 వేలకు పైగా నష్టం వచ్చినట్లుగా రైతులు చెప్తున్నారు. పంటలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కాళేశ్వరం ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతోనే పంటలన్నీ నీటి పాలైనయ్​.  నేను 50 ఎకరాల్లో పంట నష్టపోయిన. నీటి ఉధృతి పెరిగేదాక అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన్రు. అన్నారం బ్యారేజీకి గోదావరితో పాటు మానేరు, ఇతర వాగుల నుంచి నీళ్లు ఎక్కువగా వస్తయని తెలిసినా చర్యలు తీసుకో లేదు. ఇప్పటిదాకా ఏ అధికారీ మా పొలాల వైపు రాలే. నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.  
- మూల పురుషోత్తం రెడ్డి, మంథని, పెద్దపల్లి జిల్లా