కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ను రిపేర్ చేస్తలేరు

కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ను రిపేర్ చేస్తలేరు

కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్ ను రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మరిచిపోయినట్టుంది. ఈ ఏడాది జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు గ్రావిటీ కెనాల్ ధ్వంసమైంది. మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్ లు నీట మునిగిపోయాయి. అప్పటి వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్ వెంట రెండు వైపులా నిర్మించిన రోడ్డు కూడా కోతకు గురైంది. నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు గ్రావిటీ కాలువ రిపేర్ మాత్రం చేయలేదు. 

పంప్ హౌస్ లు మునగడంతో..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూలైలో కురిసిన వర్షాలకు పంప్ హౌస్ లు మునగడం గ్రావిటీ కెనాల్ ధ్వంసం కావడంతో  వేలకోట్ల నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి  ప్రభుత్వంతో పాటు నీటిపారుదల శాఖ మౌనవ్రతం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

పూర్తిగా మునిగిన మేడిగడ్డ పంప్ హౌస్ తో పాటు అన్నారం పంప్ హౌస్ ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కానీ మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు నిర్మించిన కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ మరమ్మతు పనులు మాత్రం ఇప్పటివరకు చేయలేదు. 

మేడిగడ్డ పంప్ హౌస్ రిపేర్ పూర్తయితే ఈ పంప్ హౌస్ నుంచి నీరు ఈ గ్రావిటీ కాలువ ద్వారానే అన్నారం బ్యారేజీలోకి రావాలి. 13.5 కిలోమీటర్ల మేర ఈ గ్రావిటీ కాల్వ ఉంది. కాలువకు ఇరు వైపులా రహదారిని నిర్మించారు. ప్రాజెక్టుకు ప్రధానమైన ఈ కాల్వ నిర్మాణానికి దాదాపు 800 కోట్ల రూపాయల ఖర్చు అయింది. గోదావరి జలాలను ఎగువ ప్రాంతాలకు ఈ కాలువనే కీలకం. 

లైనింగ్ కూడా కూలిపోయింది

భారీ వర్షాలకు 6వ కిలోమీటర్ దగ్గర 40 మీటర్ల మేర, 9వ కిలోమీటర్ వద్ద 50 మీటర్లు, 13వ కిలోమీటర్ వద్ద 15 మీటర్లు మేర కాలువ ధ్వంసమైంది. కాలువ ధ్వంసమైన చోట లైనింగ్ కూడా కూలిపోయింది. 6వ కిలోమీటర్ దగ్గర రోడ్డు పూర్తిగా దెబ్బతిని రాకపోకలే బంద్ అయ్యాయి.

కాలువ నిర్మాణం కోసం అప్పుడు తీసిన మట్టి కుప్పలు కూడా.. మళ్లీ కాలువలోకి జారిపోయాయి. దీంతో కాలువలో మట్టి పేరుకుపోయింది. దెబ్బతిన్న రోడ్డును, ధ్వంసమైన లైనింగ్ కు మరమ్మతులకు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులుపడలేదు. పంప్ హౌస్ ల మరమ్మతులు పూర్తి కాగా గ్రావిటీ కెనాల్ ను ఇంకా రిపేర్ చేయలేదు. తొందర్లోనే చేపడతామని అధికారులు చెబుతున్నా.. ఎప్పుడు ప్రారంభిస్తారు ? ఎప్పడు పూర్తి చేస్తారు ? అనేది తెలియడం లేదు.