కాళేశ్వరం, విద్యుత్​ కొనుగోళ్ల అక్రమాలపై ఎంక్వైరీ స్పీడప్​

కాళేశ్వరం, విద్యుత్​ కొనుగోళ్ల అక్రమాలపై ఎంక్వైరీ స్పీడప్​
  •     తప్పు ఎక్కడ జరిగిందో.. బాధ్యులెవరో.. జూన్​లోగా తేలే చాన్స్​
  •     ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్న జ్యుడీషియల్​ కమిషన్లు
  •     విద్యుత్ కొనుగోళ్లపై ఇప్పటికే ఆఫీసర్లకు నోటీసులిచ్చిన కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ నరసింహారెడ్డి
  •     ఈ నెల 24న రాష్ట్రానికి కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ చైర్మన్ జస్టిస్​ ఘోష్​ రాక

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం, విద్యుత్​ కొనుగోళ్లలో ఎవరెవరు ఏమేం తప్పులు చేశారు ? ఎక్కడ అక్రమాలు జరిగాయి?.. అనే దానిపై జూన్​లోగా క్లారిటీ రానుంది. ఇప్పటికే రెండు జ్యుడీషియల్​ కమిషన్లు వేర్వరుగా ఎంక్వైరీని స్పీడప్​ చేశాయి. ఇందులో విద్యుత్​ కొనుగోళ్లు, థర్మల్​ పవర్​ ప్లాంట్లపై జస్టిస్​ ఎల్.నరసింహా రెడ్డి చైర్మన్​గా ఏర్పాటైన కమిషన్​ ఇప్పటికే విచారణలో భాగంగా గత సర్కారులో పనిచేసిన ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. 

కాళేశ్వరంపై జస్టిస్​ ఘోష్​ చైర్మన్​గా ఏర్పాటైన కమిషన్​ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక వివరాలు తెప్పించుకున్నది. ఈ నెల 24న రాష్ట్రానికి జస్టిస్​ ఘోష్​ రానున్నారు. అప్పటి నుంచే ఎంక్వైరీని మరింత స్పీడప్​ చేయనున్నట్లు తెలిసింది. బీఆర్కే భవన్​లో రెండింటికి వేర్వురుగా ఆఫీస్​లను, స్టాఫ్​ను ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు.. అందులో భాగస్వామ్యమైన వారందరికీ మే నెల మొత్తం కమిషన్లు నోటీసులు ఇచ్చి విచారించనున్నాయి.

ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? ఎవరి ప్రోద్బలమైన ఉన్నదా ? ఫలితంగా ఎవరికి లబ్ధి జరిగింది? సాధారణంగా అనుసరించాల్సిన నిబంధనలు, విధానాలు ఏమిటి ?.. అనే వాటిపై లోతుగా కమిషన్లు ప్రశ్నించనున్నాయి. ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటనే కోణంలో ఎంక్వైరీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు కమిషన్లకు గత ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు జరిగాయో ప్రాథమిక రిపోర్టులు అందాయి. అటు కాళేశ్వరం.. ఇటు విద్యుత్​ కొనుగోళ్లు వీటికి సంబంధించిన నిర్ణయాలపై అప్పుడు ఏ ఆఫీసరైనా నో చెప్పరా? దానికి సంబంధించిన వివరాలుంటే వాటిపైనా రిపోర్ట్​ఇవ్వాలని కమిషన్లు కోరినట్లు తెలిసింది. 

ప్రాణహితను కాదని కాళేశ్వరం ఎందుకు మొదలుపెట్టారు?

డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ప్రాణహిత - చేవేళ్ల ఎత్తిపోతల పథకం ఏమిటి? ఆ తర్వాత అది పక్కన పెట్టి కాళేశ్వరాన్ని ఎందుకు తెరపైకి తీసుకువచ్చారనే దాని నుంచే జస్టిస్​ ఘోష్​ కమిషన్​ ఎంక్వైరీని మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. అప్పుడు తయారు చేసిన డీపీఆర్​లు, ఇతర రిపోర్ట్​లు ఏమిటి ? కాళేశ్వరం కోసం ఎలాంటి రిపోర్ట్​లు ఉన్నాయి ? అనే దానిపై సమాచారం తెప్పించుకుంటున్నది.

 ప్రాణహిత పథకానికి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు మధ్య ఏం తేడా ఉన్నది ? ఖర్చు అంచనాలు ఎలా పెరిగాయి ? ఏయే కంపెనీలు భాగస్వామ్యం అయ్యాయి ? ఎక్కడ ఏం చేయాలనే దానిపై నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు?.. వంటి అంశాలపై అన్ని ఫైల్స్​తో, రిపోర్టులతో సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.

  జస్టిస్​ ఘోష్​ ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేకమైన సెక్యూరిటీ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని బట్టి చూస్తే.. ఎంక్వైరీ స్ట్రిక్ట్​గా ఉండేటట్లు కనిపిస్తున్నదని సెక్రటేరియెట్​ వర్గాల్లో జరుగుతున్నది. అయితే.. విచారణ పూర్తి చేసేందుకు జూన్​ నెలఖారులోపైనా, లేదా అదనంగా ఒకటీ రెండు నెలలు ఎక్కువైనా కమిషన్​ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది.

చత్తీస్​గఢ్​కే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?

విద్యుత్​ కొనుగోళ్లపై విచారణను జస్టిస్​ నరసింహారెడ్డి స్పీడప్​ చేశారు. ఈ నెల 14న అధికారులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నవాళ్లలో గతంలో కీలక పోస్టింగ్​లో పనిచేసి రిటైర్​అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ నెలఖారులోగా వివిధ స్థాయిలోని అధికారులు, ఇతరులను కమిషన్​ ఎంక్వైరీ చేయనుంది. చత్తీస్​గఢ్​ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి నిర్ణయం ఎవరు తీసుకున్నారనే దానిపై విచారించనుంది. అత్యధిక ధరకు అక్కడి నుంచి కొనుగోలు చేయడం సరైంది కాదని.. ఒక కంపెనీకి మేలు చేసేలా కొనుగోళ్ల వ్యవహారం ఉండటంపై అప్పట్లో(గత బీఆర్​ఎస్​ సర్కార్​లో) విద్యుత్​ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీగా పనిచేసిన సురేష్​ చందా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

దీంతో ఆయన్ను బదిలీ చేసి వేరేవాళ్లకు అప్పగించి.. ఫైల్స్​ను కదిపినట్లు చర్చ నడుస్తున్నది.  అసలు ఆ టైంలో మార్కెట్​లో విద్యుత్​ తీసుకునేందుకు ఆప్షన్స్​ లేవా ? ప్రభుత్వంపై భారం పడేలా.. ప్రైవేట్​ వ్యక్తులకు మేలు చేసేలా  కరెంటు కొనుగోళ్లు ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై రిపోర్ట్​ అడిగినట్లు సమాచారం. పక్కనే ఉన్న ఏపీని కాదని ఎందుకు చత్తీస్​గఢ్​ వెళ్లాల్సి వచ్చిందనే కోణంలోనూ విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది.