మహబూబ్‌నగర్/కోస్గి, వెలుగు: ‘నేను పార్టీ పెడితే బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ వదిలిన బాణం అని అన్నరు. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ వదిలిన బాణం అన్నరు. ఇంకొకరు బీజేపీ వదిలిన బాణం అన్నరు. కానీ నేను వాళ్లు, వీళ్లు వదిలిన బాణాన్ని కాదు. తెలంగాణ బహుజనుల బాణాన్ని’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన ‘పాంచజన్యం సంకల్ప సభ’కు హైదరాబాద్ నుంచి కొడంగల్ మీదుగా ఆమె ర్యాలీగా వచ్చారు.
అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో పదేండ్లు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని, అయినా ప్రజల బతుకులు మారలేదన్నారు. తెలంగాణ రాక ముందు పరిస్థితులు ఎట్లుండెనో, ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. పొలాలకు నీళ్లు, యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు.
రాష్ర్టంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఉండగా, కొత్త పార్టీ ఎందుకని అందరూ ప్రశ్నించారని.. కానీ తెలంగాణ బిడ్డల కోసం రాష్ర్టంలో కొత్త పార్టీ రావాలని బలంగా నమ్మానన్నారు. బహుజనుల ఎజెండాతో ప్రజలకు ముందుకు వచ్చానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే వారి కోసం మోదీ, కేసీఆర్, రేవంత్ రెడ్డితో కొట్లాడతానన్నారు.
2009లో చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డితో కలసి కోస్గి జూనియర్ కాలేజీకి వచ్చానని, వారిద్దరూ సీఎంలు అయ్యారని.. తాను కూడా అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో బాధ్యత లేని రాజకీయ నాయకులు ఉన్నారని, అందుకే ప్రజల పక్షాన పోరాడేందుకే పార్టీ పెట్టానన్నారు.
పాలమూరు రైతుల ఓపికకు మెచ్చుకోవాలి
పాలమూరు ఉమ్మడి జిల్లా రైతుల ఓపికను మెచ్చుకోవాలని కవిత అన్నారు. ఉమ్మడి జిల్లా మీదుగా కృష్ణానది వందల కిలోమీటర్లు పారుతున్నా జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తి కాలేదన్నారు. జూరాల నుంచి రోజుకు 3 నుంచి 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం ఇస్తే జూరాల ప్రాజెక్టు నుంచి కొండంగల్, మక్తల్, నారాయణపేట, తాండూరు, పరిగి, రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం వరకు పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తానన్నారు.
లేకుంటే పేరును మార్చకుంటానన్నారు. తెలంగాణ వచ్చినా పాలమూరు రైతుల ఆత్మహత్యలు ఆగుతలేవని, మళ్లీ ఎండ్రిన్ తాగే తెలంగాణ కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల టైం మాత్రమే ఉందని, కౌంట్ డౌన్‌స్టార్ట్ అయ్యిందన్నారు. రైతులే వారిని గద్దె దింపుతారని హెచ్చరించారు.
కమీషన్లు పెంచుకున్నరు
తాను బలవంతుడినని సీఎం రేవంత్ అనుకుంటున్నారని, కానీ ఎంత బలవంతమైన సర్పమైనా చలి చీమల చేతిలో చిక్కి చనిపోతుందని కవిత అన్నారు. కాంగ్రెస్ పాలనలో సామాజిక అన్యాయం జరుగుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామన్నారు. రేవంత్ కేబినెట్‌లో లంబాడీలకు స్థానం లేదన్నారు. కొట్లాడితే అజారుద్దీన్‌కు స్థానం కల్పించారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 10 శాతం కమీషన్ తీసుకునేదని, రెండో ఏడాది 20 శాతం, ఇప్పుడు ప్రతి పని మీద 30 శాతం కమీషన్ తీసుకుంటోందన్నారు. ఈ లెక్కల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తప్పులు చేస్తూ.. ఆ తప్పులను ఎత్తి చూపిన వారిపై ఎదురు దాడికి దిగడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందన్నారు.
