ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమల్ హాసన్

ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమల్ హాసన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను మక్కల్‌ నీది మయ్యం (MNM) అధినేత, నటుడు కమల్‌ హాసన్‌ ఇవాళ(శుక్రవారం) విడుదల చేశారు. ఇది అందిరిలా ఉచితంగా అందించేందుకు ఉద్దేశించిన మేనిఫెస్టో కాదంటూ డీఎంకే, అన్నాడీఎంకే మేనిఫెస్టోలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాత్కాలిక సమస్యలకు పరిష్కారం కాకుండా.. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మేనిఫెస్టో అని చెప్పారు.

గృహిణులకు ఆదాయం అందించే హామీని ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు కమల్. వారి నైపుణ్యాలకు తగిన ఆదాయం లభించేలా చేస్తామని.. అంతే తప్ప ఫ్రీగా పంపిణీ చేయడం కాదని స్పష్టం చేశారు. వారి పని, నైపుణ్యానికి గానూ నెలకు రూ.10 నుంచి 15 వేల వరకు ఆదాయం పొందేలా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం ఉండబోదన్నారు.

234 నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాలను స్వయం సమృద్ధి సాధించేలా ఏర్పాటు చేస్తామని కమల్‌ హామీ ఇచ్చారు. మెడికల్‌ విద్యార్థులకోసం నీట్‌ బదులు సీట్‌ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యా రుణాలపై మొదటి మూడేళ్ల వరకు వడ్డీ మాఫీ అందిస్తామని.. చదువు తర్వాత ఉద్యోగం పొందడంలో విఫలమైతే ఆ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కమల్.