కామారెడ్డి, వెలుగు: ఎన్నికల వేళ కామారెడ్డికి పొలిటికల్ టూరిస్టులు వస్తుంటరు.. పోతుంటరని, వారిని పట్టించుకోవద్దని బీజేపీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. వారిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. శుక్రవారం మున్సిపాల్టీ పరిధిలోని అడ్లూర్కు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మళ్లీ ఉప ఎన్నిక తెచ్చుకోవాల్సిన అవసరం కామారెడ్డి ప్రజలకు లేదన్నారు. ఓటు హక్కు వినియోగంలో ప్రతి ఒక్కరూ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు. కామారెడ్డిలో కాషాయ జెండాను కచ్చితంగా ఎగుర వేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.
