జహీరాబాద్​లో ఎంపీ ఎన్నికల్లో  కామారెడ్డినే కీలకం

జహీరాబాద్​లో ఎంపీ ఎన్నికల్లో  కామారెడ్డినే కీలకం
  •     జిల్లాలోని 4  సెగ్మెంట్స్  అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణ తీర్పు
  •     పార్లమెంట్​ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు 3 పార్టీల ఫోకస్​

కామారెడ్డి, వెలుగు: జహీరాబాద్​ఎంపీ స్థానం గెలుపులో కామారెడ్డి జిల్లా ఓటర్లే ముఖ్య భూమిక పోషించనున్నారు.   ఈ ఎంపీ  స్థానం పరిధి సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో విస్తరించి ఉంది.  7 అసెంబ్లీ సెగ్మెంట్స్​లో  సంగారెడ్డి జిల్లాలో 3, కామారెడ్డి జిల్లాలో 4 ఉన్నాయి.   మొత్తం 16,31, 501 మంది ఓటర్లలో కామారెడ్డి జిల్లాలో  8,73,630 మంది, సంగారెడ్డి జిల్లాలో 7,57,931 మంది ఓటర్లు ఉన్నారు.  ఈ లెక్కన కామారెడ్డి  జిల్లాలో  1,15,699 మంది ఓటర్లు ఎక్కువ. 

ఎంపీ  ఎన్నికల్లో ఇక్కడి ఓట్లు కీలకమైన దృష్ట్యా  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ అభ్యర్థులు జిల్లాపై ఫోకస్​ పెట్టారు.  అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో  కామారెడ్డి జిల్లా ఓటర్లు గతానికి భిన్నంగా విలక్షణ తీర్పు ఇచ్చారు. 3  పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈ పరిస్థితుల్లో  ఎంపీ ఎన్నికల్లో  మెజార్టీ ఓట్లు ఇక్కడి నుంచి పొందేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.   అసెంబ్లీ సెగ్మెంట్స్​ వారీగా మీటింగ్​లు నిర్వహిస్తూ క్యాడర్​లో ఉత్తేజాన్ని నింపటంతో పాటు,  ఆయా వర్గాల్లోని ప్రముఖులు, ముఖ్య వ్యక్తులు, కుల సంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాలను కలిసి  వారిని ఆకర్షించే పనిలో అభ్యర్థులు ఉన్నారు.  పార్టీల్లో చేరికలను ప్రొత్సహిస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో  భిన్న తీర్పుతో.. పార్టీల మల్లగుల్లాలు

2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కామారెడ్డి జిల్లా ఓటర్లు  భిన్నమైన తీర్పు ఇచ్చారు.   వన్​ సైడ్​ కాకుండా 3 పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు.  4 సెగ్మెంట్లకు గాను  కాంగ్రెస్​ పార్టీ ఎల్లారెడ్డి, జుక్కల్.. బీజేపీ కామారెడ్డి,  బీఆర్ఎస్​ బాన్సువాడలో గెలుపొందింది.   2018లో మాత్రం బీఆర్ఎస్​ 3,  కాంగ్రెస్​1 చోట విజయం సాధించింది. దీంతో అసెంబ్లీ ఫలితాలను   బేరీజు బేసుకొని ఆయా నియోజక వర్గాల్లో మెజార్టీ ఓట్లు సాధించేలా  ప్రధాన పార్టీలు ప్లానింగ్​లను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నాయి.   క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం చేయడంతోపాటు  యూత్​ ఓటర్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి.