వికారాబాద్ లో కంది రైతులకు కోలుకోలేని నష్టం

 వికారాబాద్ లో కంది రైతులకు కోలుకోలేని నష్టం

గత రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి  వికారాబాద్ ​జిల్లా అతలాకుతమైంది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో భారీ వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి.  ఈ ఏడాది వానాకాలం పంటల సాగు సానుకూలంగా ఉందని భావించిన రైతన్నలకు వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పంటలన్నీ నీట మునగడంతో పెట్టిన పెట్టుబడి కూడా నీట మునిగిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.  

పెద్దేముల్ మండలం కొండా పూర్ గ్రామంలో పత్తి, కంది పంటలకు భారీగా నష్టం వాటిల్లిందాని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఎకరానికి రూ.10 నుంచి 20 వేల పెట్టుబడి పెట్టిన కూడా చివరికి తమకు  కన్నీళ్లు మిగిలాయని.. దాదాపు కొండాపూర్ గ్రామంలొనే 45 నుంచి 50 ఎకరాల వరకు పంట పొలాలు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు చెబుతున్నారు.  తమకు వ్యవసాయం తప్ప మరో దారి లేదని ఉన్న డబ్బులు పెట్టుబడి  పెట్టడంతో ఇప్పుడు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టుకుంటున్నారు.  స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున నష్ట పరిహారం చెల్లించాలని రైతన్నలు వేడుకుంటున్నారు.