స్టూడెంట్స్ ఉన్న చోటుకే బడి..

V6 Velugu Posted on Jul 21, 2021

కరోనా కారణంగా పోయిన సంవత్సరం నుంచి స్కూళ్లు సరిగ్గా నడవడం లేదు. దీని ఎఫెక్ట్‌‌ ప్రైమరీ స్టూడెంట్స్‌‌పై ఎక్కువగా పడింది. ఈ టైంలో సరిగా నేర్చుకుంటేనే పై చదువులకు ఉపయోగపడుతుంది. కరోనా వల్ల స్కూళ్లు తెరవకపోవడంతో మధ్యమధ్యలో ఆన్‌‌లైన్‌‌ క్లాసులు నడుస్తున్నాయి. కానీ, వీటి ద్వారా పిల్లలకు పూర్తిస్థాయి చదువు అందడం లేదు. అందుకే ప్రైమరీ స్కూల్‌‌ పిల్లలకు సరైన చదువు ఎలాగైనా చెప్పాలనుకున్నారు ఈ ఊరివాళ్లు. అందుకోసం ‘కానిగి బడి’కి శ్రీకారం చుట్టారు. ఆ ఊరి పేరు ఇస్రోజివాడి. ఊళ్లో ఉన్న టీచర్లు, యువత, గ్రామస్తులు అంతా కలిసి పిల్లలకు చదువు చెప్పడానికి ఈ ఉపాయం చేశారు. టీచర్ల పర్యవేక్షణలో ‘ఈచ్‌‌ వన్‌‌ టీచ్ ఫైవ్‌‌’ పేరుతో పిల్లలకు చదువు చెబుతున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రానికి  8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఊరు ఇస్రోజివాడి. ఇక్కడ ప్రైమరీ స్కూల్‌‌లో 135 మంది స్టూడెంట్స్​ఉన్నారు. గతంలో ఈ ఊరివాళ్లు ఎక్కువగా తమ పిల్లల్ని ప్రైవేట్‌‌ స్కూల్‌‌కు పంపేవాళ్లు. అయితే ఐదో తరగతి వరకు ప్రైవేట్‌‌ స్కూళ్లకు పంపకుండా, ఇక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని అందరూ కలిసి మూడేళ్లక్రితం నిర్ణయించుకున్నారు. ప్రైవేటుకు దీటుగా సర్కారుబడిని తీర్చిదిద్దుకున్నారు. దీంతో స్కూల్లో స్టూడెంట్స్‌‌ సంఖ్య పెరిగి. స్కూల్‌‌ బాగా డెవలప్‌‌ అవుతోంది... పిల్లలు బాగా చదువు కుంటున్నారు అనుకునే టైంలో ఆ పరిస్థితి పూర్తిగా మార్చేసింది కరోనా. ఆన్​లైన్​ క్లాసుల వల్ల పిల్లల్లో స్కిల్స్‌‌ తగ్గుతున్నట్లు, పాఠాలు సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారని అర్థం చేసుకున్నారు. చాలామందికి చదవడం, రాయడం కూడా రావడం లేదు. దీంతో పిల్లల్లో మళ్లీ స్కిల్స్‌‌ పెరిగేలా చేయాలని పంచాయతీ పాలకులు, యూత్‌‌ అంతా కలిసి స్కూల్‌‌ హెడ్మాస్టర్‌‌‌‌తో డిస్కస్‌‌ చేశారు. అలా పుట్టిందే ‘కానిగి బడి’. కానిగి బడి అంటే ప్రైవేట్​ స్కూల్​ అన్నమాట.

వీధి బడితో
ఇస్రోజివాడిలో  ఇరవై రోజుల క్రితం ‘కానిగి బడి’ మొదలుపెట్టారు.  స్టూడెంట్స్​ ఉన్న చోట చదువు చెప్పటమే ‘కానిగి బడి’ ఉద్దేశం. కరోనా దృష్ట్యా స్టూడెంట్స్​అందరు ఒకే చోట కూర్చోవడానికి వీల్లేదు. అందుకే అందరు పిల్లల్ని ఒక దగ్గర కాకుండా, ఒక వీధిలో  ఉండే పిల్లల్ని ఒకచోట చేర్చి, ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు చదువు చెబుతున్నారు. మొత్తం ఊరంతా ఇలాంటి ఇరవైరెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుతున్న వాళ్లతోపాటు, కొందరు యూత్‌‌, మరికొందరు స్టూడెంట్స్​తల్లులు  వలంటీర్లుగా పని చేస్తూ పాఠాలు చెబుతున్నారు. ఐదో తరగతి పిల్లల వరకు చదవడం, రాయడం, మ్యాథ్స్‌‌తోపాటు అవసరమైన అన్ని సబ్జెక్టుల్ని నేర్పిస్తున్నారు. ఈ సెంటర్స్‌‌ను ప్రతిరోజు టీచర్లు రాజశేఖర్, రాజయ్య, సరిత చూస్తుంటారు.

స్టూడెంట్స్‌‌కు ఎంతో మేలు
కానిగి బడిలో భాగంగా ‘ఈచ్​ వన్​–టీచ్​ ఫైవ్’​ ద్వారా స్టూడెంట్స్‌‌కు ఎంతో మేలు జరుగుతోంది. కరోనాతో  గత ఏడాది పిల్లలు కంప్లీట్‌‌గా చదువుకు దూరమయ్యారు. ఇప్పటికీ స్కూల్స్‌‌ స్టార్ట్‌‌కాలేదు.  పరిస్థితి ఇలాగే ఉంటే స్టూడెంట్స్‌‌ వెనుకబడిపోతారు. అందుకే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్‌‌ చేశాం. చదువులో వెనుకబడి పోకుండా పాఠాలు చెబుతున్నాం. ఈ సక్సెస్‌‌కు పంచాయతీ పాలక వర్గం, యూత్, గ్రామస్తుల సహకారం బాగుంది.
-  రాజశేఖర్, హెడ్​ మాస్టర్.

మంచి ప్రోగ్రామ్​
ప్రైమరీ స్కూల్​ పిల్లలంతా మా ఊరి స్కూల్‌‌లోనే చదువుకుంటారు. కరోనాతో  స్కూల్స్​మూసి వేశారు. కానీ మా ఊరిలో ఇటీవల కానిగి బడి ద్వారా స్టూడెంట్స్​ ఉన్న చోటుకే వెళ్లి చదువు చెబుతున్నారు. దీనివల్ల స్టూడెంట్స్‌‌కు​ చదువు దూరం కాదు. తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు.
- కొత్త మమత, సర్పంచ్‌‌

ఉత్సాహంగా వింటుండ్రు
మా ఇంటికి దగ్గరలో ఉండే స్టూడెంట్స్‌‌కు రోజూ గంట సేపు చదువు చెబుతున్నా.  వాళ్లు చాలా ఉత్సాహంగా వింటున్నారు. చదవటం, రాయటం నేర్చుకుంటున్నారు.  ఏదైనా అర్థం కాకుంటే వారికి మళ్లీ మళ్లీ చెప్పి నేర్పిస్తున్నాం.
- పవిత్ర, వలంటీర్

- గంగాధర్​ వాడికారి, కామారెడ్డి, వెలుగు

Tagged students, study, Kamareddy, private school, each one teach five, kanigi badi, isrogiwadi

Latest Videos

Subscribe Now

More News