Preity Mukhundhan: వైరల్ వీడియోలతో ఓవర్‌నైట్ స్టార్.. కన్నప్ప బ్యూటీ ప్రీతి సక్సెస్ స్టోరీ

 Preity Mukhundhan: వైరల్ వీడియోలతో ఓవర్‌నైట్ స్టార్.. కన్నప్ప బ్యూటీ ప్రీతి సక్సెస్ స్టోరీ

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రీతి ముకుందన్‌‌ జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్స్. చదువే లోకంగా బతికే కుటుంబం వాళ్లది. అలాంటి ఫ్యామిలీలో పెరిగినా, చిన్నప్పటి నుంచే ఆమెకు కళలపై ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా డాన్స్​ అంటే మహా ఇష్టం. ఐదేళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. తర్వాత వెస్ట్రన్‌‌, ఫ్యూజన్‌‌ డ్యాన్స్‌‌ల్లో కూడా శిక్షణ తీసుకుంది.

చదువుతో పాటు కళలు..

ప్రీతి చదువులో కూడా మంచి టాలెంటెడ్​. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(NIT) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌‌ పూర్తి చేసింది. ఇంజినీరింగ్‌‌ చదువుతోపాటు డ్యాన్స్‌‌, మోడలింగ్‌‌ను కూడా కంటిన్యూ చేసింది. కాలేజీ రోజుల్లోనే రకరకాల డ్యాన్స్‌‌ ఈవెంట్స్‌‌, పోటీల్లో పాల్గొనేది. ఒకానొక టైంలో చదువు, ప్రాక్టీస్‌‌, షూటింగ్స్‌‌ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం ఆమెకు సవాలుగా మారింది. అయినా ఇష్టమైన రంగాన్ని వదిలిపెట్టడానికి మనసురాలేదు. దాంతో ఆ సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లింది.

మోడలింగ్‌‌తో కెరీర్‌‌ స్టార్ట్​

డ్యాన్స్‌‌పై ఉన్న ఆసక్తే ఆమెను మోడలింగ్‌‌ వైపు తీసుకెళ్లింది. కాలేజీ రోజుల్లో సోషల్‌‌ మీడియాలో డ్యాన్స్‌‌ వీడియోలు,  ఫొటోషూట్లు పోస్ట్‌‌ చేయడం ప్రారంభించింది. ఆ వీడియోల ద్వారానే కొన్ని బ్రాండ్లు ఆమెను యాడ్స్‌‌ కోసం సంప్రదించాయి. మొదట చిన్న కమర్షియల్స్‌‌తో ప్రారంభమైన ప్రయాణం తర్వాత పెద్ద బ్రాండ్ల ప్రకటనల వరకు వెళ్లింది. టెలివిజన్‌‌ కమర్షియల్స్‌‌, ప్రింట్‌‌ యాడ్స్‌‌లో కనిపిస్తూ ఒక స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్​ ఇండియన్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో వందకు పైగా యాడ్స్‌‌లో నటించింది. కెమెరా ముందు ఎలా నటించాలి? ఎక్స్‌‌ప్రెషన్స్‌‌ ఎలా ఇవ్వాలి? అనే విషయాల్లో ఈ అనుభవం ఆమెకు ఉపయోగపడింది. ఇదే తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడానికి బలమైన పునాది అయింది.

మ్యూజిక్‌‌ వీడియోలతో వచ్చిన గుర్తింపు

ప్రీతి పేరు సోషల్‌‌ మీడియాలో ఎక్కువగా వినిపించడానికి కారణం మ్యూజిక్‌‌ వీడియోలు. ముఖ్యంగా ‘ముట్టు ము2’ పాటతో యూత్​లో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత వచ్చిన ‘ఆసా కూడ’ వీడియో సాంగ్‌‌ కూడా వైరల్‌‌ అయింది. ఈ పాటల ద్వారా ఆమెకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌‌ వచ్చింది. దర్శకులు, నిర్మాణ సంస్థల దృష్టి కూడా ఆమెపై పడింది. సినిమాల్లోకి వెళ్లడానికి అక్కడే ముందడుగు పడింది.

మొదటి సినిమా చాన్స్‌‌

ప్రీతి మొదటి పెద్ద సినిమా అవకాశాల్లో ఒకటి తమిళ చిత్రం ‘స్టార్’. ఈ సినిమాలో అవకాశం రావడానికి ముందు ఆమె ఆడిషన్స్‌‌, వర్క్‌‌షాప్స్‌‌లో పాల్గొంది. దర్శకుడు ఎలన్‌‌ ఆమెను నటనలో మరింత మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చాడు. నటి మాయా కృష్ణన్‌‌తో కలిసి ఆమె యాక్టింగ్‌‌ సెషన్స్‌‌ చేసింది. ఒక ఇంటర్వ్యూలో ప్రీతి మాట్లాడుతూ, “స్క్రీన్‌‌పై ఏడవడం కూడా నాకు మొదట భయంగా ఉండేది. కానీ ఆ వర్క్‌‌షాప్స్‌‌ వల్ల నేను కంఫర్ట్‌‌ జోన్‌‌ నుంచి బయటకు వచ్చాను” అని చెప్పింది. చిన్న చిన్న భావోద్వేగ సన్నివేశాలపై కూడా ఎక్కువగా ప్రాక్టీస్‌‌ చేసినట్లు తెలిపింది.అవకాశాల కోసం ఎదురుచూపులు

సినిమాల్లోకి రావడం అంత సులువు కాలేదు. ఆడిషన్స్‌‌, స్క్రీన్‌‌ టెస్టులు, అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మంచి చదువు చదివిన తర్వాత సినిమా రంగాన్ని ఎంచుకోవడం కూడా పెద్ద సవాలుతో కూడిన నిర్ణయమే. అయినా నటనపై ఇంట్రెస్ట్​తో తన ప్రయత్నాలు ఆపలేదు. చిన్న అవకాశాలైనా యాక్సెప్ట్ చేస్తూ ముందుకుసాగింది. అటు తమిళ చిత్రాలతో పాటు తెలుగులో కూడా ప్రీతి అవకాశాలు అందుకుంది.

‘ఓం భీమ్ బుష్‌‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘కన్నప్ప’లో చాన్స్ వచ్చింది. పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలో భాగమవ్వడంతో ఆమెపై సినీ వర్గాల్లో ఫోకస్ పెరిగింది. అయితే సినీ రంగంలో ప్రతి సినిమా విజయం సాధించదు. ప్రీతికీ అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కొన్ని ప్రాజెక్టులు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అయినా ఒకే ఇండస్ట్రీలో ఉండకుండా ఇతర భాషల ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.

‘బ్లాస్ట్‌‌ జోన్‌‌’ గురించి..

ప్రస్తుతం ప్రీతి నటించిన ‘బ్లాస్ట్‌‌ జోన్‌‌’ రిలీజ్ అయింది. హీరో అర్జున్‌‌ కూడా ప్రీతి కష్టపడే తీరు చూసి “ఆమె డ్యాన్స్‌‌ మాత్రమే కాదు, ఫైట్స్‌‌లో కూడా చాలా బాగా చేసింది” అని మెచ్చుకున్నాడు. “ఇంత యాక్షన్‌‌ ఓరియెంటెడ్‌‌ రోల్‌‌ చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. స్టంట్‌‌ సీన్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. ఫైట్‌‌ మాస్టర్‌‌ ఫీనిక్స్‌‌ ప్రభు నాకు యాక్షన్‌‌ సన్నివేశాలను చాలా జాగ్రత్తగా నేర్పించారు. షూటింగ్‌‌లో రాత్రి వరకు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇకపోతే రవిబస్రూర్‌‌ సంగీతంతో స్లో మోషన్‌‌ షాట్స్‌‌లో కనిపించడం నాకు చాలా కొత్త అనుభూతినిచ్చింది. యాక్షన్‌‌, ఎమోషన్‌‌ రెండూ కలిసిన పాత్ర చేయడం ద్వారా నటిగా మరింత నేర్చుకున్నాన’’ని తెలిపింది.

డ్యాన్స్‌‌ నా బలం

‘‘నేను స్క్రీన్‌‌పై కనిపించినప్పుడు చాలామంది గమనించే విషయం నా బాడీ లాంగ్వేజ్‌‌. దానికి కారణం చిన్నప్పటినుంచే వచ్చిన డాన్స్​ ప్రాక్టీస్. భరతనాట్యం వల్ల ఎక్స్‌‌ప్రెషన్స్‌‌, స్టేజ్‌‌ ప్రెజెన్స్‌‌ మెరుగయ్యాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా డాన్స్‌‌ను పూర్తిగా వదల్లేదు. సమయం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్‌‌ చేస్తూనే ఉంటా. ఎందుకంటే డాన్సే నా బలం” అంటోంది ప్రీతి.

‘ఆసా కూడ’ సక్సెస్‌‌..

‘‘ఆసా కూడ’ పాట అంత పెద్ద హిట్‌‌ అవుతుందని షూటింగ్‌‌ సమయంలో అసలు ఊహించలేదు. ఒక్కసారిగా సోషల్‌‌ మీడియాలో అందరూ ఆ పాట గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించింది” అని ఆమె చెప్పింది. ఆ పాట తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, మరిన్ని అవకాశాలు రావడం ప్రారంభమైందని తెలిపింది. హిందీలో బాద్‌‌షా పాట ‘మోర్నీ’లో కూడా కనిపించే అవకాశం అదే గుర్తింపుతో వచ్చిందని చెప్పింది. “ఇప్పుడు నేను కలగన్న జీవితాన్ని నిజంగా జీవిస్తున్నాననే భావన కలుగుతోంది” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచే డాన్స్​ అంటే ఇష్టం. అది కాస్తా మోడలింగ్‌‌ వైపు నడిపించింది. దాంతో మోడల్​గా కెరీర్‌‌ ప్రారంభించి, ఒక్కో అవకాశాన్ని పట్టుకుని సినిమా ఇండస్ట్రీ దాకా చేరింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే ప్రీతి ముకుందన్​.. నేచురల్​ యాక్టింగ్​తో కట్టిపడేస్తుంది. సౌత్​ సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకునేలా పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం అర్జున్ సర్జా నటించిన ‘బ్లాస్ట్ జోన్​’ సినిమాలో ఓ మంచి పాత్రలో మెరిసింది.