జనవరి 18 నుంచి మరోసారి కంటి వెలుగు కార్యక్రమం

జనవరి 18 నుంచి మరోసారి కంటి వెలుగు కార్యక్రమం

రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. వైద్యారోగ్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరుపై మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్యారోగ్య శాఖ అధికారులతో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రివ్యూలో కొత్త మెడికల్ కాలేజీలు, హైదరాబాద్ చుట్టూ హాస్పిటల్స్ నిర్మాణం, హెల్త్ ఫ్రొఫైల్, బస్తీ దవాఖానాలపై కేసీఆర్ సమీక్షించారు. కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది. 

పాడైన రోడ్లను ఎప్పటికప్పుడు రిపేర్ చేయాలి: కేసీఆర్

అంతకు ముందురాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి  సమీక్షా సమావేశం నిర్వహించారు. పాడైన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని కేసీఆర్ సూచించారు. పరిపాలన సంస్కరణలో భాగంగా.. వికేంద్రీకరణ, పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు, భవనాల శాఖలో చేపట్టాల్సిన నియామకాలపై చర్చించారు. రోడ్లు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. మారుమూల గ్రామాల్లో కూడా రోడ్ల పరిస్థితిపై దృష్టి పెట్టాలని చెప్పారు. పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం వల్ల... రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.  అలాగే తదితర అంశాలపై సీఎం చర్చించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.