నా పోరాటమే నా బలం : బండి సంజయ్

నా పోరాటమే నా బలం : బండి సంజయ్
  • అభివృద్ధి, మోదీ నా ప్రచారాస్త్రాలు.. 3 లక్షల మెజార్టీతో గెలుస్త
  • ప్రధాని సహకారంతో కరీంనగర్​కు రూ.12 వేల కోట్లు తీసుకొచ్చిన 
  • ప్రజల కోసం కొట్లాడి అత్యధిక కేసులపాలైన నేతను నేను 
  • వెలుగు’ ఇంటర్వ్యూలో కరీంనగర్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్​

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో ప్రజల కోసం కొట్లాడి అత్యధిక కేసులపాలైన లీడర్  తానేనని.. ఆ అలుపెరగని పోరాటమే తన బలమని, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, మోదీ తన ప్రచారాస్త్రాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్​ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోక్ సభ సెగ్మెంట్​లో తనకు 3 లక్షల మెజార్టీ ఖాయమని, కనీవినీ ఎరగని రీతిలో బీజేపీ ఈసారి రాష్ట్రంలో సీట్లు గెలుచుకోబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో కరీంనగర్ నియోజకవర్గానికి రూ.12 వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని  ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ‘వెలుగు’కు బండి సంజయ్​ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

వెలుగు: కరీంనగర్​కు ఐదేండ్లలో నయా పైసా తేలేదనే విమర్శలకు మీ సమాధానం?

బండి సంజయ్​: కరీంనగర్ లోక్​సభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ సహకారంతో రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. గతంలో కరీంనగర్ నుంచి వరంగల్, కరీంనగర్ నుంచి జగిత్యాల, ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు రోడ్లపై ప్రయాణం చేస్తుంటే ప్రజల నడుములు విరిగేవి. యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోతున్నా ఎవరూ పట్టించుకోలే. నేను ఎంపీ అయ్యాక ప్రత్యేక శ్రద్ధపెట్టి కేంద్రం సహకారంతో దాదాపు రూ. 4 వేల 8 వందల కోట్లపైచిలుకు నిధులతో ఫోర్ లేన్ విస్తరణ పనులు ప్రారంభించేలా చేసిన.

 తీగలగుట్ట ఆర్వోబీ నిర్మాణం విషయంలో పైసలియ్యకుండా గత కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రజలు పడుతున్న బాధలను చూడలేక సేతుబంధన్ పథకం కింద కేంద్రమే పూర్తిగా నిధులను (రూ.154.85 కోట్లు) విడుదల చేసేలా ఒప్పించిన. సెంట్రల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఎక్స్ టెన్షన్  సెంటర్ ఏర్పాటు చేయించిన. శాతవాహన యూనివర్సిటీకి ‘12 బీ’ హోదా తీసుకొచ్చిన. ఎస్సారార్ కాలేజీకి అటానమస్ హోదా తెచ్చిన. ఇవన్నీ కొన్ని మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నయ్​. 

ఈ ఎన్నికల్లో కరీంనగర్​కు మేనిఫెస్టో లాంటి హామీపత్రం ఏమైనా ఇస్తున్నరా ? 

కాంగ్రెస్ పార్టీలాగా 6 గ్యారంటీల పేరుతో హామీలిచ్చి గెలిచాక వాటిని విస్మరించి ప్రజలను మోసం చేయడం నాకు చేతకాదు. బీజేపీ మేనిఫెస్టో మాకు భగవద్గీత. అందులో పేర్కొన్న ప్రతి హామీని తూచ తప్పకుండా అమలు చేసి తీరుతం. 

కరీంనగర్​లో 50 ఎకరాలు కేటాయిస్తే ట్రిపుల్ ఐటీ తీసుకురావడంలో ఫెయిలయ్యారని వినోద్ చేస్తున్న విమర్శలపై మీరేమంటారు ? 

ఆయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఎంపీగా ఉన్నప్పుడు లెటర్లు రాసుకుంటూ పోవడం తప్ప ఆయన చేసిందేమైనా ఉందా? పైకి లెటర్లు రాసుడు.. లోపల కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టుడు.. కొంత కుటుంబానికి దాచిపెట్టుడు తప్ప కరీంనగర్ ప్రజలకు వినోద్​చేసిందేమైనా ఉందా? ట్రిపుల్ ఐటీ కోసం నేను కేంద్రానికి లేఖలు రాసిన. పెద్దలను కలిసిన. ఆ అంశం పరిశీలనలో ఉందనే సోయి కూడా ఆయనకు లేదు.
 
ఇప్పుడు మీ ప్రచారస్త్రాలు ఏంటి ?

మా ప్రచార అస్త్రం నరేంద్రమోదీనే. నేను చేసిన అభివృద్ధి, పోరాటాలే నా ప్రచారాస్త్రాలు. దేశ రక్షణ, ధర్మ రక్షణ మోదీతోనే సాధ్యమని మారుమూల పల్లెలోని చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు నమ్ముతున్నరు. హిందుగాళ్లు బొందుగాళ్లు అన్న వాళ్ల చెంప చెల్లుమనిపించిన ఘనత కరీంనగర్ ప్రజలదే. ఇప్పుడు కూడా కొందరు శ్రీరాముడి పేరు చెబితే ఓట్లు పడతయా? అని హేళన చేస్తున్నరు. అధికారం వచ్చిందనే అహంకారంతో దేవుడిని, రాముడి అక్షింతలను కూడా ఎగతాళి చేస్తున్న వాళ్లకు కరీంనగర్ ప్రజలు తగిన గుణపాఠం చెప్తరు. ప్రజల పక్షాన కొట్లాడి అత్యధిక కేసులు ఎదుర్కొన్న నేతను నేను. ఐదేండ్లుగా కుటుంబాన్ని పక్కన పెట్టి.. కష్టాల్లో ఉన్న జనం కోసం కొట్లాడిన. 

మీ స్పీచుల్లో డెవలప్​మెంట్​ విషయాలు ఉండవని, ఎంతసేపు ప్రత్యర్థులను తిట్టే ఓట్లు రాబట్టుకుంటారనే విమర్శలపై మీ కామెంట్ ? 

అది ముమ్మాటికీ తప్పు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారమది. నా ప్రసంగంలో నేను మొదట చెప్పేదే అభివృద్ధి గురించి.. నన్ను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ లోక్​సభ సెగ్మెంట్​ అభివృద్ధి కోసం ఏమేం చేశానో, ఎన్ని నిధులు తీసుకొచ్చానో పూస గుచ్చినట్లు వివరిస్తున్న. ప్రత్యేకంగా బుక్ లెట్ రూపొందించి ఇంటింటికీ పంపుతున్న.

 కరోనా మహమ్మారితో దేశమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి రెండేండ్లపాటు నిధులివ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ.. మిగిలిన మూడేండ్ల కాలంలోనే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. విభజన‌ హామీలు పదేండ్లయినా కేంద్రం అమలు చేయలేదనే విమర్శ ఉంది.‌ 

ఈ విషయంలో ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారు?

ఈ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలి. విభజన హామీల అమలు విషయంలో నాటి కేసీఆర్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండె. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలపై సమావేశం నిర్వహించేందుకు సిద్ధమని కేంద్రం పదేపదే చెప్పినా కేసీఆర్ ముందుకు రాలే. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అనేకసార్లు జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినా కేసీఆర్ రాకుండా డుమ్మా కొట్టిండు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్​గా రాష్ట్రమంతా తిరిగారు. ప్రస్తుతం కరీంనగర్ దాటి బయటికి వెళ్లడం లేదు. ఇతర నియోజకర్గాల్లో మీ అవసరం పార్టీకి లేదని బీజేపీ భావించిందా ? మీరే వెళ్లడం లేదా ? 

నేను పార్టీ సైనికుడిని. అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ నాయకత్వం స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిన. ఈసారి కూడా తమ తమ నియోజకవర్గాల్లోకి రావాలని, ప్రచారం నిర్వహించాలని పార్టీ నేతల నుంచి ఫోన్లు వస్తున్నయ్​. పార్టీ ఆదేశానుసారం పనిచేస్త. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధి తక్కువగా ఉంటుంది. ఇతర నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేయడానికి సమయం ఉండేది. కానీ, లోక్​సభ  ఎన్నికల్లో అట్లా కాదు కదా... నియోజకవర్గ పరిధి చాలా పెద్దది. అందుకే ఎక్కువ సమయం సొంత నియోజకవర్గానికే వెచ్చిస్తున్న.

కరీంనగర్ లోక్ సభ సెగ్మెంట్​ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. మీరు ఎలా గెలుస్తారని అనుకుంటున్నారు?

గత లోక్​సభ ఎన్నికల్లోనూ బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కదా.. దాదాపు లక్ష మెజారిటీతో గెలిచిన కదా. బీజేపీ కార్యకర్తలు, యువతే మా స్టార్ క్యాంపెయినర్స్. ఒక్కో బీజేపీ కార్యకర్త ఒక్కో ఎమ్మెల్యేతో సమానంగా కష్టపడి పనిచేస్తరు. ఇవన్నీ నేను చెప్పాల్సిన పనిలేదు. మీరు ఒక్కసారి గ్రౌండ్​లోకి వెళ్లి పరిశీలిస్తే మీ ప్రశ్నకు జవాబు దొరుకుతది. 

లోక్​సభ ఎన్నికల తర్వాత మీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతున్నది. ఇది నిజమేనా ?

నేను బీజేపీ సైనికుడిని. కరీంనగర్ ప్రజల సేవకుడిని. మోదీ బాటలో నడిచే కార్యకర్తను. పార్టీ అప్పగించిన పనిని వంద శాతం నిర్వహించడమే నా బాధ్యత. నాకు ఎలాంటి బాధ్యత, గుర్తింపు ఇవ్వాలో మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా నాయకత్వంలోని మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం, ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం బీజేపీ కల్పించింది. 

నిజం చెప్పాలంటే నా కష్టాన్ని ప్రతిసారి నా పార్టీ గుర్తించింది. సామాన్య కార్యకర్తనైన నాకు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎంపీగా అవకాశం ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది, జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది. భవిష్యత్తులో ఎలాంటి అవకాశం ఇవ్వాలో పార్టీ ఆలోచిస్తది. పార్టీ ఇచ్చే ఏ బాధ్యతనైనా శిరసావహించి పనిచేసే సైనికుడిని నేను.

ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ జర్నీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు జీరో బిల్లు లాంటి స్కీమ్ లు ఇచ్చే కాంగ్రెస్ ను కాదని మహిళలు బీజేపీకి ఎలా ఓటేస్తారనుకుంటున్నారు? 

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి మాట కాంగ్రెస్​ పార్టీ మాట తప్పింది. ఆ పార్టీ పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వారెంటీ ముగిసిపోయింది. 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ మళ్లోసారి జనాన్ని మోసం చేసేందుకు సిద్ధమైంది. దొంగ హామీలు ఇవ్వడం, మోసం చెయ్యడం కాంగ్రెస్ డీఎన్​ఏలోనే  ఉంది. 

మహిళలకు నెలనెల రూ. 2500, వృద్ధులు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్, రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా కింద సాయం, రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందులో ఏ హామీని కూడా అమలు చేయలేదు. నిరుద్యో గులు, ఉద్యోగుల పక్షాన ఉద్యమాలు చేసి జైలుకు పోయిన వ్యక్తిని నేను. మరి బీఆర్ఎస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఏం చేసింది? అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడం తప్ప. ప్రజలకు అన్నీ తెలుసు. కనీవినీ ఎరగని రీతిలో బీజేపీ ఈసారి రాష్ట్రంలో సీట్లు సాధించబోతు న్నది. కరీంనగర్ లో 3 లక్షల పైచిలుకు మెజారిటీతో నన్ను జనం గెలిపిస్తరు.