కాలేజీ పక్కన చెత్తకు నిప్పు.. పొగతో స్టూడెంట్లకు అస్వస్థత.. కరీంనగర్‌‌ లో ఘటన

కాలేజీ పక్కన చెత్తకు నిప్పు.. పొగతో స్టూడెంట్లకు అస్వస్థత.. కరీంనగర్‌‌ లో ఘటన

కరీంనగర్‌‌ క్రైం, వెలుగు : కాలేజీ పక్కన చెత్తను తగులబెట్టడంతో వెలువడిన పొగ కారణంగా ఆరుగురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్‌‌ పట్టణంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌‌లోని ఉస్మాన్‌‌పుర ప్రభుత్వ బాలికల జూనియర్‌‌ కాలేజీ పక్కనే హైస్కూల్‌‌ నడుస్తోంది. స్కూల్‌‌లో కలెక్టర్‌‌ విజిట్‌‌ఉన్నందున కాలం చెల్లిన ట్యాబ్లెట్లను, చెత్తను ఓ ప్రదేశంలో పోగు చేసి నిప్పంటించారు. 

పెద్ద ఎత్తున పొగ రావడంతో పక్కనే కాలేజీలో ఉన్న సాహేత్‌‌నగర్‌‌కు చెందిన మహేఖ్‌‌, మంకమ్మతోటకు చెందిన ఖుబ్రా ఖానం, షబ్నా ఖానం, వైష్ణవి, విద్యానగర్‌‌కు చెందిన రాగిణి, సవరన్‌‌ స్ట్రీట్‌‌కు చెందిన ఉమేరా శ్వాస తీసుకోలేక అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే అంబులెన్స్‌‌లో ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. స్టూడెంట్లు కోలుకోవడంతో కొద్దిసేపటి తర్వాత డిశ్చార్జి చేశారు.